13.5శాతం నిరుద్యోగాన్ని పెంచిన ఘనత జగన్‌దే

ABN , First Publish Date - 2021-06-20T05:19:24+05:30 IST

మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్‌ మనసు మార్చుకోవాలని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్‌ చేశారు.

13.5శాతం నిరుద్యోగాన్ని పెంచిన ఘనత జగన్‌దే
అమరావతి రైతులకు మద్దత్తుగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న మాజీ మంత్రి పుల్లారావు, నాని, తదితరులు

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరు, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్‌ మనసు మార్చుకోవాలని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్‌ చేశారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. 550 రోజులుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్న రైతులు, మహిళలను ఆయన అభినందించారు. రాజధాని పరిఽధిలోని అసైన్డ్‌  రైతులకు సైతం వార్షిక కౌలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇక ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై రాష్ట్రంలోని యువత ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో ప్రభుత్వంలో విలీనంచేస్తే అందులోని తామే ఉద్యోగాలను సృష్టించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఖాళీగా ఉన్న వివిధ బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఈరెండేళ్లలో 13.5శాతం నిరుద్యోగాన్ని పెంచిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందంటూ ఒద్దేవా చేశారు. రాష్ట్రంలో సుబాబులు రైతులను ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి నెట్టిందన్నారు.  కర్నూలులో జరిగిన టీడీపీ నేతల హత్యను ఖండించారు. టీడీపీ నేతలపై దాడులు చేస్తుంటే చూస్తు ఊరుకోబోమని... తాము అధికారంలోకి రావడం ఖాయమని తప్పుచేసిన అధికారులపై తప్పక చర్యలుంటాయని పుల్లారావు తెలిపారు. పార్టీ పశ్చిమ ఇన్‌ఛార్జ్‌ కోవెమూడి రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుతో త్వరలో ప్రజాఉద్యమం రాబోతుందన్నారు. రివర్స్‌ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని వైసీపీ నేతలను విమర్శించారు. సమావేశంలో నేతలు మానుకొండ శివప్రసాద్‌, చిట్టాబత్తిని చిట్టిబాబు, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T05:19:24+05:30 IST