Kodali Nani.. ఖబడ్దార్‌.. చిటికెన వేలితో లేపేస్తా..!

ABN , First Publish Date - 2021-11-30T05:44:16+05:30 IST

‘కొడాలి నానీ.. బందరు రా.. చిటికెన వేలితో లేపేస్తా..

Kodali Nani.. ఖబడ్దార్‌.. చిటికెన వేలితో లేపేస్తా..!

  • ఆడపడుచుల ఆత్మగౌరవ సభలో..
  • మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఫైర్‌


మచిలీపట్నం టౌన్‌, నవంబరు 29 : ‘కొడాలి నానీ.. బందరు రా.. చిటికెన వేలితో లేపేస్తా.. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును తిట్టేంత వాడివా..’ అంటూ మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అధ్యక్షతన మచిలీపట్నం పార్లమెంట్‌ టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆడపడుచుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధులు హద్దులు దాటి మాట్లాడుతున్నారని, పవిత్రమైన చట్టసభల్లో మహిళలను కించపరుస్తున్న వారి దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆడపడుచులకు పిలుపునిచ్చారు. మంత్రి పేర్ని నాని సొంత నియోజకవర్గంలోని బందరు బస్టాండ్‌ ముంపునకు గురవుతుంటే పట్టించుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ వల్లభనేని వంశీ, కొడాలి నానీకి టీడీపీ రాజకీయ భిక్ష పెడితే, నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ విశ్వాస ఘాతకులుగా మారారన్నారు.


అన్ని రాసి పెట్టుకుంటున్నామని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ మంత్రులకు సొంత శాఖలపై పట్టులేదని, బూతులంటే పోటీపడి మరీ మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ గడిచిన 30 నెలల్లో ఒక్క అభివృద్ధి పనైనా చేశారా?, మహిళలపై జరుగుతున్న దాడులను ఆపగలిగారా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో మహిళను దారుణంగా చంపితే న్యాయం చేయలేని వైసీపీ పాలకులు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏం కాపాడతారని ప్రశ్నించారు. పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ నీచమైన సంస్కృతిని చాటుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులకు మహిళలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమవుతోందన్నారు. పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల కుమార్‌ రాజా మాట్లాడుతూ శాసనాలకు వేదిక అయిన అసెంబ్లీలో తెలుగింటి ఆడపడుచును అవమానించేలా వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రవర్తించారన్నారు. తలశిల స్వర్ణలత మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రశ్నించిన ప్రతి సామాన్యుడి అమ్మ, అక్క, చెల్లి, భార్య శీలాన్ని నడిబజారులో అవమానించి పైశాచికానందం పొందినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు.


ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి, మచిలీపట్నం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, టీడీపీ నాయకులు పీవీ ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T05:44:16+05:30 IST