హిట్లర్‌ ప్రతిరూపం స్టాలిన్‌

ABN , First Publish Date - 2022-03-13T14:31:44+05:30 IST

తప్పుడు కేసులు బనాయించి భయపెట్టాలని డీఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇలాంటి కేసులకు తాను భయపడే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్‌ పేర్కొన్నారు. అన్నాడీఎంకేను

హిట్లర్‌ ప్రతిరూపం స్టాలిన్‌

- తప్పుడు కేసులతో భయపెట్టలేరు

- మాజీ మంత్రి జయకుమార్‌

- పుళల్‌ జైలు నుంచి విడుదల


చెన్నై: తప్పుడు కేసులు బనాయించి భయపెట్టాలని డీఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇలాంటి కేసులకు తాను భయపడే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్‌ పేర్కొన్నారు. అన్నాడీఎంకేను నాశనం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ హిట్లర్‌ను తలపించేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అధికారపార్టీపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సహజమని, ఆ విమర్శలను భరించలేకనే స్టాలిన్‌  తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేయించారని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా విమర్శిస్తుండటాన్ని సహించలేకపోయారని, తనను యాభై సెక్షన్ల కింద అరెస్టు చేశారని, ఈ కేసులన్నింటికీ తాను భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తనను అరెస్టు చేసినప్పుడు పోలీసులు మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. ఓ తీవ్రవాదిని అరెస్టు చేసినట్లుగా రాత్రిపూట తనను తరలించుకు వెళ్లారని చెప్పారు. శనివారం ఉదయం ఆయన పుళల్‌ సెంట్రల్‌ జైలు నుండి విడుదలయ్యారు. మూడు కేసుల్లో అరెస్టయిన ఆయనకు బెయిలు లభించింది. నగరపాలక ఎన్నికల్లో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద రిగ్గింగ్‌కు పాల్పడిన డీఎంకే కార్యకర్తను అర్ధనగ్నంగా ఊరేగించి బెదిరించారని, అదే రోజు పోలింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని అనుమతి లేకుండా రాస్తారోకో జరిపారనే నేరారోపణలపై పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. డీఎంకే కార్యకర్తను నిర్బంధించిన వ్యవహారంలో ఆయనకు బెయిలు మంజూరైనప్పుడు తన బంధువుకు చెందిన చేపల వలల తయారీ కర్మాగారాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణపై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. తిరుచ్చిలో రెండువారాలపాటు బసచేసి అక్కడి కంటోన్‌మెంట్‌ పోలీసుస్టేషన్‌లో రోజూ సంతకం చేయాలని, ఆ తర్వాత చెన్నైకి తిరిగివచ్చి కేసులను విచారణ జరుపుతున్న విచారణ అధికారి ఎదుట హాజరుకావాలనే నిబంధనలతో బెయిలు మంజూరు చేసింది. దీనితో శనివారం ఉదయం జయకుమార్‌ పుళల్‌ సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ప్రాంగణం వద్ద జయకుమార్‌కు స్వాగతం పలికేందుకు అన్నాడీఎంకే స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మంగళవాయిద్యాలు, కార్యకర్తల నినాదాల నడుమ జయకుమార్‌కు స్థానిక నేతలు స్వాగతం పలికారు.


ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పలేదు...

 జైలు వెలుపల విలేఖరులతో ఆయన మాట్లాడుతూ... తనను అరెస్టు చేసేందుకు పోలీసులు నానా హడావిడి చేశారని చెప్పారు. తీవ్రవాదిని అరెస్టు చేసేలా తన నివాసగృహంలో పోలీసులు చొరబడ్డారని, పూజగదిలో బూట్లు వేసుకుని నడిచారని, తనను ఎందుకు అరెస్టు చేశారో కూడా తనకు స్పష్టంగా చెప్పలేదన్నారు. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయలేదన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతలను అరెస్టు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని మిని ఎమర్జెన్సీని తలపించేలా తప్పుడు కేసులు వేసి బనాయిస్తోందని అన్నారు. తనపై ఫిర్యాదు చేసిన డీఎంకే కార్యకర్త గూండా చట్టం కింద అరెస్టయిన పాతనేరస్థుడని, అతడిపై పలు కేసులున్నాయని, అతడికి ప్రభుత్వం అండగా ఉంటోందని ఆరోపించారు. పోలింగ్‌ సందర్భంగా తాను తప్పు చేశానా? డీఎంకే గూండా తప్పు చేశాడో సీసీటీవీ కెమెరాలలో నమోదైన దృశ్యాలే సాక్ష్యం చెబుతాయన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ రౌడీలకు మద్దతు ఇస్తున్నారని, హిట్లర్‌కు ప్రతిరూపం ఆయనేనని జయకుమార్‌ విమర్శించారు. స్టాలిన్‌ తండ్రి కరుణానిధి వల్లే అన్నాడీఎంకేని నాశనం చేయడం కుదరలేదని, ఇప్పుడు ఎంతమంది స్టాలిన్‌లు వచ్చినా తమ పార్టీ చెక్కుచెదరదని అన్నారు.


రాత్రంతా నగర సందర్శన...

పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఏ స్టేషన్‌కు తీసుకెళుతున్నదీ తెలుపకుండా రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా వ్యాన్‌లో నగరమంతటా తనను తిప్పారని, తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదని జయకుమార్‌ ఆరోపించారు. మేజిస్ట్రేట్‌ వద్ద హాజరుపరచిన తర్వాత తనను తీవ్రవాదులను నిర్బంధించే పూందమల్లి జైలుకు తరలించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. తనను నిర్బంధించిన గది చుట్టూ, గదిపైనా సాయుధ పోలీసులు చేత తుపాకులు పట్టుకుని మరీ కాపలా కాయడం చూసి నవ్వుకున్నానని చెప్పారు. 


ఈపీఎస్‌, ఓపీఎస్‌ భేటి...

జైలు నుండి విడుదలై పట్టినంబాక్కంలోని తన నివాసగృహానికి చేరుకున్న జయకుమార్‌ను అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం కలుసుకున్నారు. జయకుమార్‌ను శాలువలతో సత్కరించారు. ఆ తర్వాత అరగంట సేపు జయకుమార్‌తో ఆ ఇరువురూ చర్చలు జరిపారు. పోలీసులు తనను అరెస్టు చేసినప్పుడు అన్నాడీఎంకే నేతలు తనకు అండగా నిలిచినందుకు జయకుమార్‌ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Updated Date - 2022-03-13T14:31:44+05:30 IST