- 9 వరకు కస్టడీ
- బెయిల్ పిటిషన్ తిరస్కరణ
చెన్నై: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా డీఎంకే కార్యకర్తపై దాడి జరిపించి, అర్ధనగ్నంగా ఊరేగించారనే ఆరోపణలపై అరెస్టయి పూందమల్లి జైలులో ఉన్న అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్‌ను మరో కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు మార్చి 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ జార్జిటౌన్ కోర్టు ఆదేశించింది. ఈ నెల 19న పోలింగ్ సందర్భంగా ఓల్డ్ వాషర్‌మెన్‌పేట సంజీవరాయన్ కోవిల్ వీధిలోని కామరాజర్ మెట్రి క్యులేషన్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద నకిలీ ఓట్లు వేస్తున్నాడనే ఆరోపణపై డీఎంకే కార్యకర్త నరేష్కుమార్ (33)ను జయకుమార్, అన్నాడీఎంకే నాయకులు నిర్బంధించారు. ఆ సందర్భంగా కార్యకర్తలు అతడిపై దాడి చేశారు. జయకుమార్ సూచనలతో అతడి చొక్కా విప్పదీసి అర్ధ నగ్నంగా ఊరేగిం చారు. ఈ దృశ్యాలతో వీడియో జయకుమార్ సామాజిక ప్రసారమాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ సంఘటనలో గాయపడి స్టాన్లీ ప్రభుత్వ ఆస్పపత్రిలో చికిత్స పొందిన నరేష్కుమార్ పోలీసులకిచ్చిన వాంగ్మూలం మేరకు జయకుమార్ సహా 40 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోమవారం రాత్రి పట్టినంబాక్కంలోని నివాసంలో జయకుమార్‌ను అరెస్టు చేసి జార్జిటౌన్ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. మేజిస్ట్రేట్ మార్చి 7 వరకు జయకుమార్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆయనను పూందమల్లి సబ్‌జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బుధవారం జయకుమార్ బెయిలు పిటిషన్ జార్జిటౌన్ కోర్టులో విచారణ జరుగనున్న సమయంలో మరో కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల అక్రమాలను నిరోధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూ రాయపురంలో జయకుమార్ పార్టీ కార్యకర్తలు అనుమతి లేకుండా రాస్తారోకో చేసిన సంఘటనపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. జయకుమార్ సహా వంద మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా వుండగా బెయిల్ కోరుతూ జయకుమార్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జార్జ్‌టౌన్ కోర్టు తిరస్కరించింది.
ఇవి కూడా చదవండి