మాజీమంత్రి తంగమణిపై ACB పంజా

ABN , First Publish Date - 2021-12-16T14:40:52+05:30 IST

అన్నాడీఎంకే మాజీ మంత్రి తంగమణి, కుటుంబ సభ్యుల నివాసగృహాలు, ఆయన అనుచరులు, బంధువుల నివాసగృహాలు, కార్యాలయాల్లో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

మాజీమంత్రి తంగమణిపై ACB పంజా

               - ఒకేసారి 69 చోట్ల తనిఖీలు


చెన్నై: అన్నాడీఎంకే మాజీ మంత్రి తంగమణి, కుటుంబ సభ్యుల నివాసగృహాలు, ఆయన అనుచరులు, బంధువుల నివాసగృహాలు, కార్యాలయాల్లో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చెన్నై, కోయంబత్తూరు, నామక్కల్‌, ఈరోడ్‌, సేలం, కృష్ణగిరి, వేలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోనూ తంగమణి సన్నిహితులు, వ్యాపార భాగస్వాములకు చెందిన నివాసగృహాలు, కార్యాలయాలు, సంస్థలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఒకే సమయంలో 69 ప్రాంతాల్లో సుమారు రెండు వందల మందికి పైగా ఏసీబీ అధికారులు, పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన తంగమణి ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారనే నేరారోపణలపై కేసు నమోదు చేసుకున్న అవినీతి నిరోధకవిభాగం అధికారులు.. ఈ తనిఖీలు చేపట్టారు. నామక్కల్‌ గోవిందం పాళయంలోని తంగమణి నివాసగృహంలో బుధవారం ఉదయం 6.45 గంటలకు 18 మంది ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సందర్భంగా అన్నాడీఎంకే కార్యకర్తలు అక్కడ పెద్ద సంఖ్యలో గుమికూడి డీఎంకే ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. నామక్కల్‌లో నివసిస్తున్న తంగమణికి సన్నిహితుడైన ప్రభుత్వ కాంట్ర్టాక్టర్‌ సత్యమూర్తి నివాసగృహంలోను ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈరోడ్‌లో పారీ వీధి, పన్నైనగర్‌, పన్నై వీధి, గణపతినగర్‌, మునియప్పన్‌ కోవిల్‌ వీధి సహా ఐదుచోట్ల 30 మందికిపైగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కరూరు సమీపం వేలాయుధంపాళయం ప్రాంతంలో తంగమణి బంధువులు వసంతి నివాసగృహంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. సేలం హైవేనగర్‌లోని తంగమణి కుమారుడు ధరణీధరన్‌ నివాసగృహంలోను ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం ఆరుగంటల నుంచే ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. తంగమణి అనుచరులైన వెల్లయంగిరి, సెంథిల్‌, ఈవీకేఎస్‌ అలియాస్‌ సుబ్రమణ్యం, బంధువు శివా నివాసగృహాలలోనూ ఒకే సమయంలో సోదాలు కొనసాగాయి. తంగమణి అనుచరులైన పళ్ళిపాళయంకు చెందిన ధనలక్ష్మి, ఆమె భర్త సెంథిల్‌ ఫామ్‌హౌస్‌లలోనూ తనిఖీలు జరిపారు. వేలూరు జిల్లా కాట్పాడి కల్‌పుదూరులోని శీనివాసన్‌ అనే వ్యక్తికి చెందిన వాణిజ్య సముదాయం ఉంది. ఆ సముదాయంలో తంగమణికి చెందిన కట్టడ నిర్మాణ సంస్థ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు ఐదుగురు తనిఖీలు నిర్వహించారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో తంగమణి అనుచరుల నివాసగృహాలు, కార్యాలయాలలో కూడా తనిఖీలు కొనసాగాయి.


చెన్నైలో 14 చోట్ల...

నగరంలో మాజీ మంత్రి తంగమణి, ఆయన అనుచరులు, బంధువులకు చెందిన నివాసగృహాలు, కార్యాలయాలు సహా 14 చోట్ల ఒకే సమయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తంగమణి ప్రస్తుతం శాసనసభ్యుడు కావడంతో.. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన గదిని సైతం అధికారులు తనిఖీ చేయడం గమనార్హం. ఇదే విధంగా ఈస్ట్‌కోస్ట్‌రోడ్డులో పనయూరు సమీపంలోని అక్కరై ప్రాంతంలో తంగమణికి స్వంత ఫామ్‌హౌస్‌ ఉంది. ఆ ఫామ్‌హౌస్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదే రీతిలో తంగమణి అనుచరులకు చెందిన నివాసగృహాలు, కార్యాలయాలలోనూ సోదాలు జరిపారు. ఆ మేరకు కీల్పాక్‌ రాజరత్తినం రోడ్డులోని వి.సత్యమూర్తి అండ్‌కో, పట్టినంబాక్కంలోని పలు అంతస్థుల భవనసముదాయంలోని ప్లాట్‌లో నివసిస్తున్న కె.శివసుబ్రమణ్యం గృహంలో, అన్నానగర్‌లో శశిరేఖ ఇల్లమ్‌లో తనిఖీలు జరిగాయి. నుంగంబాక్కం మోహనకుమారమంగళం వీథిలోని పీఎస్టీ ఇంజనీరింగ్‌ కట్టడ నిర్మాణ సంస్థ, మధురవాయల్‌ తిరుకుమరన్‌నగర్‌ సెకెండ్‌ మెయిన్‌ రోడ్డులో ఉన్న తరుణ్‌ కట్టడ నిర్మాణ సంస్థలో, ఎగ్మూరు ఖాజామొయుద్దీన్‌ రోడ్డులో ఉన్న ఆనంద్‌ వడివేల్‌ నివాసగృహంలో ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. చెన్నైలోని ట్రావెలర్స్‌ సంస్థ నిర్వాహకులు విశాలాక్షి నివాసగృహం, అరుంబాక్కం రాధాకృష్ణన్‌ నగర్‌లోని కట్టడ నిర్మాణ సంస్థ, అరుంబాక్కం ఈవీఆర్‌ పెరియార్‌ రోడ్డులోని ప్లైవుడ్‌ సంస్థ, కోయంబేడులోని దక్షిణాసియా క్రీడాగ్రామంలోని జనార్దనన్‌ అనే ప్రముఖుడి (ఫ్లైవుడ్‌ సంస్థ భాగస్వామి) నివాసగృహంలో ఏసీబీ అధికారులు ముమ్మర తనీఖీలు జరిపారు. ఇదేవిధంగా వెంకటనారాయణ రోడ్డులోని స్వాతి కాంప్లెక్స్‌లో ఉన్న ఖనిజాల సంస్థ, షెనాయర్‌నగర్‌లోని వెంకటాచలం నివాసగృహంలోనూ అధికారులు సోదాలు జరిపారు.


ఎఫ్‌ఐఆర్‌లో...

అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో తంగమణి రెవెన్యూశాఖ, పరిశ్రమల శాఖ, విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారపాళయం అన్నాడీఎంకే శాసనసభ్యుడిగా ఉన్నారు. తంగమణి, ఆయన సతీమణి శాంతి, కుమారుడు ధరణీధరన్‌పై ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు సంపాదించారంటూ నామక్కల్‌లోని అవినీతి నిరోధక విభాగం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదివరకే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు ఎంఆర్‌ విజయభాస్కర్‌, ఎస్పీవేలుమణి, డాక్టర్‌ సి. విజయభాస్కర్‌, కేసీ వీరమణి నివాసగృహాలు, బంధువులు, స్నేహితుల కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించారు. తాజాగా మంత్రి తంగమణి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, స్నేహితుల నివాస గృహాలు, కార్యాల యాల్లో సోదాలు జరిపారు. 2016 నుంచి 2021 వరకు తంగమణి, ఆయన కుటుంబీకులు ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు సంపాదించారని నామక్కల్‌ ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. 2016 శాసనసభ ఎన్నికల సందర్భంగా తంగమణి నామినేషన్‌తో జతచేసిన ఆస్తుల వివరాల పట్టికను పోల్చిచూస్తే ప్రస్తుతం ఆయన, కుటుంబీకుల ఆదాయం విపరీతంగా పెరిగిందని ఏసీబీ అధికారులు ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఆరోపించారు. సుమారు రూ.4.85 కోట్ల మేరకు తంగమణి, ఆయన కుటుంబ సభ్యులు అక్రమార్జనకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.


క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి

మాజీ మంత్రి తంగమణి, ఆయన కుటుంబీకులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిగా డిపాజిట్‌ చేశారని తనిఖీలలో వెల్లడైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. 2016 నుండి 2020 వరకు ఆదాయానికి మించి రూ.7 కోట్ల మేరకు సంపాదించారని, అందులో అధిక శాతాన్ని క్రిప్టో కరెన్సీకి తరలించినట్టు తెలిపారు. ఈ మేరకు తనిఖీలలో కీలకమైన దస్తావేజులు కూడా లభించినట్టు చెప్పారు.


రూ.2.16 కోట్ల నగదు స్వాధీనం

ఇదిలా ఉండగా మాజీ మంత్రి తంగమణి నివాసగృహాలు, కుటుంబీకులు, సన్నిహితుల నివాసగృహాలు, కార్యాలయాలలో నిర్వహించిన తనిఖీలలో రూ.2.16 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఓ ప్రకటన జారీ చేశారు. ఈ తనిఖీలలో కేజీ బంగారు నగలు, 49 కేజీల వెండి ఆభరణాలతోపాటు కీలకమైన దస్తావేజులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో సెల్‌ఫోన్లు, బ్యాంక్‌ లాకర్లకు సంబంధించిన తాళాలు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు కూడా స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-12-16T14:40:52+05:30 IST