- మాజీ మంత్రి జయకుమార్
ప్యారీస్(చెన్నై): డీఎంకే పాలనలో భావప్రకటనా స్వేచ్ఛకు అవకాశం లేదని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్ విమర్శించారు. స్థానిక మాంగాడు ప్రాంతంలో అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేయదలచిన కార్యకర్తల నుంచి మంగళవారం జయకుమార్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయ రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజాసంక్షేమం కోసం పలు మంచి పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆ పథకాల వల్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. ప్రతిపక్ష పార్టీగా డీఎంకే వ్యవహరించిన సమయంలో ప్రభుత్వపై బురద చల్లేలా విమర్శలు చేసిందన్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక్క కేసు కూడా అప్పటి ప్రభుత్వం నమోదు చేయలేదని, అయితే ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.