6వ సారి పెళ్లి చేసుకోబోయిన మాజీ మంత్రి.. పోలీసుల రంగప్రవేశంతో సీన్ రివర్స్

ABN , First Publish Date - 2021-08-03T10:52:56+05:30 IST

మాజీ మంత్రి 6వ సారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే మూడో భార్య ఫిర్యాదుతో అతడి బండారం..

6వ సారి పెళ్లి చేసుకోబోయిన మాజీ మంత్రి.. పోలీసుల రంగప్రవేశంతో సీన్ రివర్స్

లక్నో: ఓ మాజీ మంత్రి 6వ సారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే మూడో భార్య ఫిర్యాదుతో అతడి బండారం బయటపడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ పెళ్లిని ఆపడంతో పాటు సదరు మంత్రిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. సదరు మంత్రి యూపీలోని ప్రముఖ రాజకీయ పక్షం సమాజ్ వాదీ పార్టీ నేత చౌధరి బషిర్.


ఆగ్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌధరి బషిర్‌‌ 6వ సారి పెళ్లి చేసుకోబోతుండడంతో అతడి మూడో భార్య నగ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగ్మ ఫిర్యాదుతో పెళ్లిని అడ్డుకుని బషిర్‌పై కేసు నమోదు చేశారు. ముస్లిం మహిళా వివాహ చట్టం 2019 సెక్షన్ 3 ప్రకారం, అలాగే ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


కాగా.. బషీర్ మూడో భార్య నగ్మ మాట్లాడుతూ.. గత నెల 23న తనకు షైస్ట అనే అమ్మాయిని బషీర్ 6వ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసిందని, తాను ఆ పెళ్లిని వ్యతిరేకించడంతో తనను దుర్భాషలాడి దారుణంగా హించారని ఆరోపించారు. అంతేకాకుండా త్రిపుల్ తలాక్ విధానంలో విడాకులు కూడా ఇచ్చి ఇంటి నుంచి గెంటేశారని చెప్పారు. 


‘ఎంతోమంది మహిళలతో బషీర్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడు. 2012లో బషీర్‌తో వివాహం జరిగింది. వివాహం తరువాత బషీర్ నన్ను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. అనేకసార్లు ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకోనేలా కూడా బలవంతం చేశాడం’టూ సంచలన ఆరోపణలు చేశారు. దీనితో పాటు సోషల్ మీడియాలో కూడా బషీర్‌పై మరింత సంచలన ఆరోపణలు చేస్తూ నగ్మా ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. తనకు పోలీసులే సాయం చేయాలని కోరారు.


ఇదిలా ఉంటే చౌధరి బషీర్ తొలుత బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నేతగా మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలోకి మారిపోయారు. కానీ ఆ తర్వాత ఆ పార్టీ నుంచి కూడా బయటకొచ్చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా ఏ పార్టీలోనూ లేరు. కాగా.. బషీర్‌పై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఓ కేసులో ఏకంగా 23 రోజుల జైలు శిక్ష కూడా అనుభవించారు.

Updated Date - 2021-08-03T10:52:56+05:30 IST