మరోసారి వైసీపీకి ఓటు వేయరు

ABN , First Publish Date - 2020-12-03T05:32:57+05:30 IST

ప్రజలు వైసీపీకి మరోసారి ఓట్లు వేసి తప్పు చేయరని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు.

మరోసారి వైసీపీకి ఓటు వేయరు
నందింపల్లెలో వరి పంటను పరిశీలిస్తున్న అఖిలప్రియ

  1. రైతుల పక్షాన మాట్లాడితే సస్పెండ్‌ చేస్తారా?
  2.  మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ


ఆళ్లగడ్డ, డిసెంబరు 2: ప్రజలు వైసీపీకి మరోసారి ఓట్లు వేసి తప్పు చేయరని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. మండలంలోని నందింపల్లె గ్రామంలో నివర్‌ తుఫాన్‌ వల్ల నేల వాలిన వరి పంటను ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఒక్కసారి ఓట్లు వేసి అవకాశం ఇవ్వండనే వైసీపీ ప్రచారాన్ని నమ్మిన ప్రజలు భంగపడ్డారని అన్నారు. ఈ అనుభవంతో రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేసి ప్రజలు మళ్లీ తప్పు చేయరని అన్నారు. శాసన సభ సమావేశాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాట్లాడితే ఆయనతో పాటు టీడీపీ శాసన సభ్యులను సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. రైతుల పక్షాన మాట్లాడితే సస్పెండ్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. అకాల వర్షాలతో రైతులు మూడుసార్లు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు పరిహారం ఇస్తానని చెప్పిన సీఎం ఏడాది దాటినా పట్టించుకోలేదని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు వరిగింది ఏమీ లేదని అన్నారు. సచివాలయాలకు రంగులు వేయడానికి, మార్చడానికి  కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారే తప్ప ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడం లేదన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు రెండు వారాల్లో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే కలెక్టరేట్‌ వద్ద రైతులతో ధర్నా చేస్తామన్నారు. వరి, జొన్న, మినుము, అరటి పంటలు వర్షాలకు ఎన్ని ఎకరాల్లో దెబ్బతిన్నదీ సర్వే చేయాలని కోరారు. వానల వల్ల పంట దిగుబడుల రంగు మారినా ప్రభుత్వమే కొనుగొలు చేయాలని ఆమె డిమాండు చేశారు. ఈమె వెంట టీడీపీ నాయకులు బాచ్చాపురం శేఖర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, హుసేన్‌బాషా, నాగిరెడ్డిపల్లె శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:32:57+05:30 IST