మహిళలను కించపరచడం దిగజారుడుతనం

ABN , First Publish Date - 2021-12-02T06:02:06+05:30 IST

పార్టీకి ఎటుంటి సంబంధంలేని మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారంటే ఇంతకన్న దిగజారుడుతనం మరొకటి లేదని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు.

మహిళలను కించపరచడం దిగజారుడుతనం
మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు

మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు 

వేమూరు, డిసెంబరు 1: పార్టీకి ఎటుంటి సంబంధంలేని మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారంటే ఇంతకన్న దిగజారుడుతనం మరొకటి లేదని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. బుధవారం పట్టణంలోని కొత్తపేట టీడీపీ కార్యాలయంలో వేమూరు నియోజకవర్గ తెలుగు మహిళా ఆత్మగౌరవసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించడం మన సంప్రదాయమన్నారు. రాష్ట్రంలో అక్రమ గంజాయి సాగుపై మాట్లాడినందుకు ఓ మాజీమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా అర్ధరాత్రి తన ఇంటిపై పోలీసులను పంపారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను గురించి పట్టాభి మాట్లాడితే వైసీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై  దాడి చేశారన్నారు. వివేక హత్య ఉదంతం విచారణలో బయటకు పడ్డాక వాళ్ల ఇంటి సమస్యలతో ఆస్తి తగాదాలతో జరిగిందని వైసీపీ నాయకులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడుకి మళ్ళీ సీఎం కావాలని తాపత్రయం లేదని ఆంధ్రప్రదేశ్‌ ఏమైపోతుందోనన్న ఆవేదన ఆయన హృదయంలో ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను టీడీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి చైతన్యవంతులను చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలుగు మహిళా బాపట్ల పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పల్లం సరోజని, వేమూరు నియోజక వర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గంటా స్వాతి, భట్టిప్రోలు మాజీ ఎంపీపీ వాకా సుధ, వేమూరు నియోజకవర్గ 5 మండలాల తెలుగుమహిళలు పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-02T06:02:06+05:30 IST