మరో మాజీమంత్రి ఇంట్లో ACB తనిఖీలు

ABN , First Publish Date - 2022-01-21T15:10:33+05:30 IST

ఆదాయానికి మించి అక్రమార్జనలకు పాల్పడ్డారనే నేరారోపణలపై ధర్మపురి జిల్లాకు చెందిన అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌ నివాసాలు, కార్యాలయాల్లో గురువారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు

మరో మాజీమంత్రి ఇంట్లో ACB తనిఖీలు

- కేపీ అన్బళగన్‌ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో తనిఖీలు

- 57 చోట్ల కొనసాగిన సోదాలు


చెన్నై: ఆదాయానికి మించి అక్రమార్జనలకు పాల్పడ్డారనే నేరారోపణలపై ధర్మపురి జిల్లాకు చెందిన అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌ నివాసాలు, కార్యాలయాల్లో గురువారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నాడీ ఎంకేకు చెందిన మాజీ మంత్రుల అక్రమార్జనపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు ఎంఆర్‌ విజయభాస్కర్‌, తంగమణి, వేలుమణి, డాక్టర్‌ సి.విజయభాస్కర్‌, ఎంఆర్‌ విజయభాస్కర్‌ తదితరులపై ఏసీబీ అధికారులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై, ధర్మపురి, సేలం తదితర ప్రాంతాల్లో వంద మందికిపై ఏసీబీ అధికారులు మాజీ మంత్రి అన్బళగన్‌కు చెందిన 57 చోట్ల సోదాలు జరిపారు. ధర్మపురి జిల్లా కొరకోటహళ్ళి గ్రామంలోని అన్బళగన్‌ నివాసంలో గురువారం ఉదయం ఏడుగంటలకు ఏసీబీ అధికారులు పోలీసులతో వెళ్లి తనిఖీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ నివాసంలోని వ్యక్తులను బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. అన్బళగన్‌ నివాసంలోని అన్ని గదుల్లో ఏసీబీ అధికారులు, పోలీసులు తనిఖీలు చేసి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో 2016 నుంచి 2021 వరకు అన్బళగన్‌ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా అక్రమార్జనకు పాల్పడ్డారని, స్థిర, చరాస్తులను భారీగా కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ మేరకు అన్బళగన్‌, ఆయన భార్య మల్లిక, కుమారులు శశిమోహన్‌, చంద్రమోహన్‌, కోడలు వైష్ణవి (చంద్రమోహన్‌ భార్య) తదితరులపై కేసులు కూడా నమోదు చేశారు. వీటి ఆధారంగానే ఈ దాడులు జరిగాయి. చంద్రమోహన్‌ నివాసంలో పదిమందికిపైగా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కొరకోటహళ్ళిలోనే ఉన్న అన్బళగన్‌ బంధువులు చంద్రశేఖర్‌, సంపత్‌, షణ్ముగం, మహేష్‌కుమార్‌ నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదే విధంగా కారియమంగళం ఈస్ట్‌ అన్నాడీఎంకే శాఖ కార్యదర్శి సెంథిల్‌కుమార్‌, మాజీ అధ్యక్షుడు మాణిక్కం ఇళ్లలోనూ సోదాలు చేశారు. పాలకోడులోని అన్బళగన్‌ అనుచరులకు చెందిన ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి.. ధర్మపురి పెరియాంబట్టి సమీపంలోని రాళ్ళ క్వారీ, రెడీమిక్స్‌ ఫ్యాక్టరీ, కారియమంగళం కామరాజ్‌నగర్‌లోని ఆస్పత్రి, పాఠశాల తదితర సంస్థల్లోనూ తనిఖీలు జరిపారు. అన్బళగన్‌ కుడిభుజంగా వ్యవహరిస్తున్న పాపిరెడ్డిపెట్టి నియోజకవర్గం ఎమ్మెల్యే గోవిందసామి నివాసంలో పదిమందికి పైగా ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి తనిఖీలు ప్రారంభించారు. ధర్మపురి కలెక్టర్‌ కార్యాలయం సమీపంలోని అన్బళగన్‌ సహాయకుడు పొన్నువేల్‌ ఇల్లు, అన్నాడీఎంకే ధర్మపురి నగర శాఖ కార్యదర్శి పూక్కడై రవి నివాసం సహా మొత్తం 41 చోట్ల ఈ తనిఖీలు కొనసాగాయి.  


చెన్నైలో 3 చోట్ల... : రాజధాని నగరం చెన్నైలో మూడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోపాలపురం అవ్వై షణ్ముగం సాలైలోని కార్యాలయం, నుంగంబాక్కం కతీడ్రల్‌ గార్డెన్‌ లైన్‌, అడయార్‌ గాంధీనగర్‌ మెయిన్‌రోడ్డు లోని అన్బళగన్‌ అనుచరుడు శివకుమార్‌కు చెందిన కార్యాలయాల్లోనూ తనిఖీలు జరిగాయి. గోపాలపురంలో గణేష్‌ గ్రానైట్‌ కంపెనీ కార్యాలయంలో ఐదుగురు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 


కరీంనగర్‌లో... : తెలంగాణా రాష్ట్రం కరీంనగర్‌లో అన్బళగన్‌కు చెందిన స్థలాల్లోనూ చెన్నై నుంచి వెళ్ళిన ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి, చెన్నై, కరీంనగర్‌ సహా 57 చోట్ల నిర్వహించిన ఈ సోదాలలో కోట్లాదిరూపాయల విలువచేసే బంగారు నగలు, నగదు, చర, స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.


రూ.21 కోట్ల ఆస్తుల కొనుగోలు...

ఏసీబీ అధికారుల ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం మాజీ మంత్రి అన్బళగన్‌ పదేళ్లలో రూ.21 కోట్లకు పైగా ఆస్తులు కొనుగోలు చేశారు. ఇది ఆయన సంపాదన కంటే రూ.11.32 కోట్లు అధికంగా ఉన్నట్లు విచారణలో కనుగొన్నారు. కుటుంబీకులతో కలిసి ‘స్టయిల్‌ ఆఫ్‌ అన్బు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి’ని నడుపుతున్నారు. ఆ ఆస్పత్రి నిర్మాణంలో అవకతవకలు జరి గాయని, ఆసుపత్రి పేరిట అక్రమ నగదు లావాదేవీలు చేరనే ఆరోపణలు ఉన్నాయి. అన్బళగన్‌, ఆయన కుటుంబీకులు రూ.1.60 కోట్ల మేర వివిధ సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టారని ఏసీబీ విచారణలో గుర్తించారు. వీరందరూ పలు కంపెనీలకు షేర్‌ హోల్డర్లుగాను ఉన్నారు. ఈ అక్రమార్జన కేసుల్లో అన్బళగన్‌ తర్వాత ఆయన సతీమణి మల్లిక, చిన్నకుమారుడు చంద్రమోహన్‌, పెద్దకుమారుడు నిందితులుగా పేర్కొన్నారు. చంద్రమోహన్‌ భార్య వైష్ణవిని ఐదొ నిందితురాలిగా చేర్చారు. మాజీ మంత్రి అన్బళగన్‌ ఆయన కుటుంబీకుల అక్రమార్జనలపై విచారణ జరపాలంటూ కృష్ణమూర్తి అనే వ్యక్తి హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సమగ్రంగా దర్యాప్తు జరుపమంటూ ప్రభుత్వానికి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఏసీబీ అధికారులు గురువారం దాడులు జరిపారు.


తనిఖీలతో నోరు మూయించలేరు...

మాజీ మంత్రి అన్బళగన్‌ నివాసాల్లో ఏసీబీ దాడిపై అన్నా డీఎంకే డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి స్పందిస్తూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందుకే మాజీ మంత్రులపై ఏసీబీ కేసులు పెట్టి తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణగిరిలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రజల కిచ్చిన హామీలు నెరవేర్చని డీఎంకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోనే ఈ దాడులు చేయిస్తోందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి అన్బళగన్‌ కుటుంబీకులంతా దశాబ్దాలుగా వ్యాపారాలుచేస్తున్నారని, ఎలాంటి అక్రమార్జనలకు పాల్పడలేదన్నారు. ఏసీబీ దాడులతో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే నోరు మూయించలేరని ఆయన చెప్పారు. మాజీ మంత్రి డి. జయకుమార్‌ చెన్నైలో మీడియాఆతో మాట్లాడుతూ ఏసీబీ దాడులతో అన్నాడీఎంకేని ఎవరూ నాశనం చేయలేరన్నారు. తమకిచ్చిన హామీలను నెరవేర్చలేదని డీఎంకే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజల దృష్టిని మరల్చడానికే అన్నాడీఎంకే మాజీ మంత్రులపై తప్పుడు అవినీతి కేసులు బనాయించి తనిఖీలు చేయిస్తున్నారని ఆరోపించారు.


రూ.2.87 కోట్ల నగదు, 6.6 కేజీల బంగారం స్వాధీనం

అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌, ఆయన బంధువులు, స్నేహితుల నివాసాలు సహా 57 చోట్ల  నిర్వహించిన తనిఖీల్లో లెక్కలో చూపని రూ.2.87 కోట్ల నగదు, 6.6 కేజీల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ తనిఖీల్లో 13.85 కేజీల వెండి సామగ్రి కూడా పట్టుబడినట్టు పేర్కొన్నారు. త్వరలో అన్బళగన్‌, కుటుంబీకులకు సంబంధించిన బ్యాంక్‌ లాకర్లను కూడా తెరచి తనిఖీ చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-01-21T15:10:33+05:30 IST