నోటీసుల.. హైడ్రామా

ABN , First Publish Date - 2021-10-20T06:19:09+05:30 IST

సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు గుంటూరు వసంతరాయపురంలోని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది.

నోటీసుల.. హైడ్రామా
ఆనందబాబుతో మాట్లాడుతున్న నర్సీపట్నం పోలీసులు

ఆనందబాబు ఇంటి వద్ద ఉదృక్తత

నర్సీపట్నం నుంచి అర్ధరాత్రి వచ్చిన పోలీసులు

గంజాయి వాఖ్యలకు ఆధారాలు చూపమన్న పోలీసులు


గుంటూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు గుంటూరు వసంతరాయపురంలోని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. విశాఖ మన్యం నుంచి గంజాయి రవాణాపై సోమవారం ఆనందబాబు మీడియా సమావేశంలో చేసిన వాఖ్యలకు ఆధారాలు చూపమని విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు సోమవారం అర్ధరాత్రి ఆనందబాబు ఇంటికి వచ్చారు. దీంతో ఆయన అర్ధరాత్రి సమయంలో ఇదంతా ఏమిటంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, గుంటూరు తూర్పు, పశ్చిమ ఇన్‌చార్జిలు మహ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్రలతో పాటు పలువురు ముఖ్యనేతలు అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. నోటీసు తీసుకునేందుకు ఆనందబాబు నిరాకరించడంతో మంగళవారం ఉదయం వస్తామని వెళ్లిపోయారు.  మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఆనందబాబు క్యాంపు కార్యాలయానికి పోలీసులు వచ్చారు. అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడకి చేరుకున్న టీడీపీ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు హైడ్రామా నడుమ ఆనందబాబు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.  అయితే సరైన వివరణ ఇవ్వలేదని నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. నోటీసులు ఇస్తే తాను తీసుకుంటానని ఆనందబాబు తెలిపారు. కాని పోలీసులు చేతికి ఇవ్వకుండా ఇంటికి అంటిస్తామనడంతో  కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించగా.. టీడీపీ శ్రేణులు కూడా చేరుకున్నాయి. స్టేట్‌మెంట్‌లో పూర్తి స్థాయి వివరాలు వెల్లడించలేదని, 91 సీఆర్పీసీ కింద నోటీసులిస్తామంటే తీసుకోలేదని సీఐ శ్రీనివాస్‌ చెప్పారు.


ప్రశ్నిస్తే నోటీసులిస్తారా : ఆనందబాబు

పల్నాడులో నాటు సారా ఏరులై పారుతుంది.. మద్య నిషేధమని చెప్పిన వాళ్లే మద్యాన్ని అమ్ముతున్నారని ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తున్నారని ఆనందబాబు విలేకర్ల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంతో పాటు గంజాయి అలవాటు చేసి యువతను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. గంజాయి రవాణాకు సంబంధించిన ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే ఆధారాలు ఇవ్వాలని ఆడుగుతారా అని ప్రశ్నించారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తెనాలి శ్రావణ్‌ కుమార్‌ తదితరులు ఆనందబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును వారు తప్పు పట్టారు. 



Updated Date - 2021-10-20T06:19:09+05:30 IST