మహారాష్ట్ర మాజీ సీఎం ఫఢణవీస్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-09-28T14:01:16+05:30 IST

మహారాష్ట్ర సర్కారు మనుగడపై మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు....

మహారాష్ట్ర మాజీ సీఎం ఫఢణవీస్ సంచలన వ్యాఖ్యలు

 ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్ర సర్కారు మనుగడపై మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందని, వారిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు. మహావికాస్ ఆఘాదీ సర్కారు వారి సొంత వైరుధ్యాల కారణంగా పడిపోతుందని, అప్పుడు తామేం చేయాలో చూస్తామని ఫడణవీస్ చెప్పారు. శివసేనతో కలిసి బీజేపీ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుపై ఎలాంటి చర్చ జరగలేదని మాజీ సీఎం స్పష్టం చేశారు. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో భేటీ అయిన అనంతరం మహారాష్ట్ర సర్కారుపై పలు రకాల అనుమానాలు రేకెత్తాయి. 



మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి రావడానికి శివసేనతో చేతులు కలపడానికి బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేయలేదని ఫడణవీస్ చెప్పారు. తాను శివసేన ఎంపీ రౌత్ తో జరిగిన సమావేశానికి రాజకీయంగా అపాదించవద్దని, తాము తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తాము తొందరపడేది లేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీగా స్థిరపడిందని ఫడణవీస్ చెప్పారు. 



మహారాష్ట్ర సమస్యల గురించి ఫడణవీస్‌తో మాట్లాడేందుకే ఆయనను కలిశానని రౌత్‌ తెలిపారు. తమ మధ్య సైద్ధాంతిక విభేదాలే తప్ప శత్రుత్వం లేదని పేర్కొన్నారు.‘‘ఫడణవీస్‌ మాజీ సీఎం. అంతేకాకుండా ప్రతిపక్ష నేత. సామ్నా పత్రిక కోసం ఆయనను ఇంటర్వ్యూ చేయాలని ఇంతకుముందు నిర్ణయించాం. కరో నా కారణంగా ఆ ఇంటర్వ్యూ జరగలేదు. మా భేటీ గురించి సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు తెలుసు.’’ అని రౌత్‌ వెల్లడించారు. శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం కానీ, ఉద్ధవ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం కానీ తమకు లేదని మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. 


Updated Date - 2020-09-28T14:01:16+05:30 IST