ఆ బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేసియా... 11 ఏళ్ల నాటి కేసులో ఒడిశా హైకోర్ట్ కీలక ఆదేశాలు..

ABN , First Publish Date - 2022-06-30T18:08:34+05:30 IST

తీవ్ర జ్వరంతో హాస్టల్ నుంచి ఇంటికి నడిచి వెళ్తూ మరణించిన ఏడేళ్ల బాలిక కేసులో.. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని

ఆ బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేసియా... 11 ఏళ్ల నాటి కేసులో ఒడిశా హైకోర్ట్ కీలక ఆదేశాలు..

భువనేశ్వర్ : తీవ్ర జ్వరంతో హాస్టల్ నుంచి ఇంటికి నడిచి వెళ్తూ మరణించిన ఏడేళ్ల బాలిక(Girl) కేసులో.. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా(Ex gratia) చెల్లించాలని ఒడిశా ప్రభుత్వాన్ని(Odisha Govt) ఆ రాష్ట్ర హైకోర్ట్(Odisha High court) ఆదేశించింది. ఘటన జరిగిన దాదాపు 11 ఏళ్ల తర్వాత చీఫ్ జస్టిస్ ఎస్ మురళీధర్, జడ్జి ఆర్‌కే పట్నాయక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చనిపోయిన బాలిక జాస్మిన్ మల్లిక్ తండ్రి బిచ్చందా మల్లిక్‌కు ఈ ఎక్స్‌గ్రేసియాను అందివ్వాలని బెంచ్ స్పష్టం చేసింది.


కంధామాల్ జిల్లా ఖజురిపాద బ్లాక్‌లోని గినానిండా గ్రామానికి చెందిన జాస్మిన్ మల్లిక్ తన ఊరుకి సమీపంలోని బిలాబడీలో ఉన్న సేవాశ్రమ్ స్కూల్, అనుబంధ  హాస్టల్‌లో చేరింది. 21 ఏప్రిల్ 2011 రాత్రి బాలికకు జ్వరమొచ్చింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను వార్డెన్ బ్రహ్మకుమార్ బెహెరా.. హాస్పిటల్‌కి తీసుకెళ్లలేదు. మరుసటి రోజు ఇంటికి నడిచి వెళ్లాలని వార్డెన్ సూచించారు. మరో నలుగురు బాలికలను బాలికకి తోడిచ్చి పంపించారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి నడుస్తూ.. మార్గమధ్యంలోనే  బాలిక కన్నుమూసింది. ఈ ఘటనపై బాలిక జాస్మిన్ మల్లిక్ తండ్రి బిచ్చందా మల్లిక్‌ హైకోర్టులో పిటిషన్ వేశాడు. న్యాయవాది, మానవహక్కుల ఉద్యమకారుడు ప్రబిర్ కుమార్ దాస్ కోర్టులో వాదనలు వినిపించారు.


తాజా ఆదేశాల నేపథ్యంలో బాలిక తండ్రిని సంప్రదించేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. సన్నకారు రైతు అయిన అతడి వద్ద సెల్‌ఫోన్ లేకపోవడం దీనికి కారణం. 11 ఏళ్లనాడు జరిగిన ఈ ఘటనలో బాధిత బాలిక రోడ్డుమీదే చనిపోయిందని స్థానిక సర్పంచ్ వివరించాడు. అదే దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి బాలిక మృతదేహాన్ని ఇంటికి చేర్చాడు. బాలిక మరణంపై జిల్లా సాంఘీక సంక్షేమ ఆఫీసర్ దర్యాప్తు జరిపారు. స్కూల్ హెడ్‌మాస్టార్‌‌దే తప్పిదంగా తేలింది. జిల్లా పాలనా విభాగం రూ.50 వేల పరిహారం అందించింది. అయితే ఏడాది తర్వాత బాలిక తండ్రి హైకోర్ట్‌లో కేసు వేశాడని స్థానిక సర్పంచ్ మృత్యుంజయ్ కన్హర్ తెలిపాడు.


కాగా ఒడిశాలో ప్రభుత్వ రెసిడెన్సియల్ ‘సేవాశ్రమ్ స్కూల్స్’ గిరిజన బాలబాలికలకు సెకండరీ ఎడ్యుకేషన్ వరకు విద్యను అందిస్తున్నాయి. అయితే హాస్టల్స్‌‌లో వెలుగుచూస్తున్న ఘటనలు వివాదాస్పదమవుతున్నాయి.

Updated Date - 2022-06-30T18:08:34+05:30 IST