సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-04-07T16:39:50+05:30 IST

బెళ్లందూరు డీ నోటిఫికేషన్‌కు సంబంధించి బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప బుధవారం సుప్రీం

సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి

                                      - వెంటాడుతున్న డీ నోటిఫికేషన్‌ వివాదం


బెంగళూరు: బెళ్లందూరు డీ నోటిఫికేషన్‌కు సంబంధించి బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. డీ నోటిఫికేషన్‌ వివాదంలో యడియూరప్ప రెండో నిందితుడుగా ఉన్నారు. ఈనెల 19న తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని ఇటీవలే ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఐటీ కారిడార్‌ నిర్మాణాల కోసం బెంగళూరు పరిధిలోని బెళ్లందూరు, దేవర బీసనహళ్లి గ్రామాల పరిధిలో 15 ఎకరాల 30 కుంటల భూమిని అక్రమంగా డీ నోటిఫికేషన్‌ చేశారంటూ 2013లో వాసుదేవరెడ్డి అనే వ్యక్తి పిటీషన్‌ దాఖలు చేయగా ప్రత్యేక న్యాయస్థానం విచారణకు తీసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే, యడియూరప్పతో పాటు పది మంది ఉన్నారు. 2015లో కేసు నుంచి ఆర్‌వీ దేశ్‌పాండేను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. కానీ యడియూరప్పపై మాత్రం కేసు పెండింగ్‌లోనే ఉంది. ప్రత్యేక న్యాయస్థానం సదరు కేసును విచారించాలని లోకాయుక్తను ఆదేశించింది. సమగ్ర విచారణ జరిపిన లోకాయుక్త ఆరోపణలలో వాస్తవాలు లేవని కోర్టుకు బీ-రిపోర్టు సమర్పించింది. రెండుసార్లు ఇదే తరహాలో బీ రిపోర్టు ఇవ్వగా వాటిని ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఇందుకు అనుగుణంగానే 2021 నవంబరు 27న రెండో బీ-రిపోర్టును తిరస్కరించి మరోసారి విచారణ జరపనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈనెల 19న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ అయ్యాయి. వీటిపై యడియూరప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2022-04-07T16:39:50+05:30 IST