వచ్చే ఎన్నికల్లో మా సత్తా చూపుతాం

ABN , First Publish Date - 2022-04-05T16:58:55+05:30 IST

బీజేపీ ప్రభుత్వం పాపాలతో నిండిందని, ఇక పోరాటంతోనే ఎదుర్కొంటామని హనుమజ్జయంతి నుంచే మా సత్తా ఏంటో చూపుతామని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత

వచ్చే ఎన్నికల్లో మా సత్తా చూపుతాం

                        - మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి 


బెంగళూరు: బీజేపీ ప్రభుత్వం పాపాలతో నిండిందని, ఇక పోరాటంతోనే ఎదుర్కొంటామని హనుమజ్జయంతి నుంచే మా సత్తా ఏంటో చూపుతామని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌ అంటే ఏమిటో 2023 ఎన్నికల్లో చూపుతామన్నారు. 1994 నాటి చరిత్రను తిరగరాస్తామని, మరోసారి అధికారంలోకి వస్తామన్నారు. మిషన్‌ 123 రోడ్‌మ్యాప్‌ సిద్ధమైందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై రోడ్‌మ్యాప్‌ రూపొందించామని, కన్నడిగుల ఆత్మాభిమానం, రైతుల పొలాలకు నీరు అందించే హామీతో మా పోరాటం సాగుతుందన్నారు. కాంగ్రెస్‌ నేతలకు పనిలేకుండా పోయిందన్నారు. మతనియంత్రణ బిల్లులో వెనుకంజ వేశారన్నారు. హిజాబ్‌ నుంచి హలాల్‌ దాకా భావనాత్మక విషయంలో భంగం కలిగేలా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాకు వందశాతం రాయితీ కాదని, ముఖ్యమంత్రి పేషీలో ఫైళ్లకు వందశాతం రాయితీ ఇస్తే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని, సిమెంట్‌, ఇనుము, వంటగ్యాస్‌ ధరలు ఆకాశానికి చేరాయన్నారు. విధానపరిషత్‌ సభాపతి బసవరాజ్‌ హొరట్టి బీజేపీలోకి వెళితే తమకేమీ షాక్‌ కాదన్నారు. ఆయనను సభాపతి చేశామని, పార్టీ అతడికి అన్యాయం చేయలేదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీలోకి వందమంది వెళ్లారని, ఈయన సంఖ్య 101 అవుతుందన్నారు. జమీర్‌ అహ్మద్‌ మరోసారి జేడీఎస్లో వచ్చే ప్రస్తావన లేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రమేశ్‌గౌడ, మాజీ ఎమ్మెల్సీ శరవణ, మాజీ ఎమ్మెల్యే వెంకటశివారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు కుపేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-05T16:58:55+05:30 IST