- మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
బెంగళూరు: రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతి విఘాత చర్యలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి సత్తా ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ఒకానొక దశలో సీఎంకు మగతనం ఉంటే... అంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదమయింది. రామనగర జిల్లా చెన్నపట్టణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతకాలం ఎన్నో సమస్యలు లేవనెత్తారని, ప్రస్తుతం హలాల్‌కట్, జట్కాకట్ అంటున్నారని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. వీరు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం జరిగితే వీహెచ్‌పీ వారు వస్తారా..? అన్నారు. దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఇన్నేళ్లు తిన్న మాంసం ఇప్పుడేమైందన్నారు. ఇంటింటా కరపత్రాలు పంచుతున్నారని, మాంసం దుకాణాలకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు సత్తా ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు ఇటువంటి అంశాలపై మాట్లాడేందుకు తాహతు లేదని, అయితే తాను మౌనంగా ఉండలేనన్నారు. హిందువుల ఓట్లు వేయరనే భయం లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మీ ఆటలు ఆడుకోవాలన్నారు. కాగా కుమారస్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు కాసేపటికే ప్రకటించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఉద్దేశ్యపూర్వకంగా మగతనం అంశాన్ని మాట్లాడలేదని... సమాజంలో జరుగుతున్న సంఘటనలకు బాధ కలిగి వ్యాఖ్యానించానన్నారు. ఇదే విషయమై ఎయిర్‌పోర్ట్‌లో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను మీడియా అడిగిన ప్రశ్నకు అంతటి పదాలు తాము వాడమని, అది కుమారస్వామికే చెల్లునంటూ దాటవేశారు. కాగా కుమారస్వామి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి బొమ్మై దాటవేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల రక్షణ ప్రభుత్వ ఆశయమన్నారు.
ఇవి కూడా చదవండి