పాదయాత్రతో ఒరిగేది ఏమీలేదు...

ABN , First Publish Date - 2022-03-10T17:33:40+05:30 IST

మేకెదాటు పాదయాత్రతో ఒరిగేది శూన్యమేనని కాంగ్రెస్‌ పార్టీపై జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ‘నమ్మ నీరు

పాదయాత్రతో ఒరిగేది ఏమీలేదు...

                 - Congressపై కుమారస్వామి ఆగ్రహం


బెంగళూరు: మేకెదాటు పాదయాత్రతో ఒరిగేది శూన్యమేనని కాంగ్రెస్‌ పార్టీపై జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ‘నమ్మ నీరు - నమ్మ హక్కు’ నినాదంతో కాంగ్రెస్‌ చేపట్టిన పాదయాత్ర ఎందుకోసమని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కోణం మినహా యాత్ర ద్వారా ఒరిగేది ఉండదన్నారు. 2017లో హుబ్బళ్లి - ధారవాడ జిల్లాలకు చెందిన రైతులు మహదాయి నీటి కోసం శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులు చితకబాదలేదా అని నిలదీశారు. అప్పుడు ‘నమ్మ నీరు-నమ్మ హక్కు’ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడే ఎందుకు ఆలోచన వచ్చిందని ప్రశ్నించారు. డీపీఆర్‌లో ఎక్కువ నీటిని వినియోగించేలా నివేదిక రూపొందించారని, అందుకే తమిళనాడు అభ్యంతరం తెలిపిందన్నారు. తమిళనాడుతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని కేంద్ర మంత్రి ఇటీవలే బెంగళూరు పర్యటనలో సూచించారని గుర్తు చేశారు. సుప్రీం ముందు తమిళనాడు ఇప్పటికే డ్యాం నిర్మించేందుకు అభ్యంతరం లేదని చెప్పిందని ముఖ్యమంత్రి బొమ్మై ముందుకెళ్లాలని సూచించారు. ఎవరి కంచుకోట కోసమో యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సందర్భంలో గోవధ నిషేధం రైతులకు ఇబ్బందికరమన్నారు. జేడీఎస్‌ అంటే కొందరికి గిట్టదని, అందుకే బీ-టీమ్‌ అంటూ విమర్శిస్తారన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందుకు దీటుగా జేడీఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. జేడీఎస్‌కు మద్దతుగా బీజేపీ సభ్యులు జోక్యం చేసుకున్నారు. ప్రతిపక్ష ఉపనాయకుడు యూటీ ఖాదర్‌ మాట్లాడుతూ బడ్జెట్‌పై కాకుండా ప్రతిపక్షనేత సిద్దరామయ్య వ్యాఖ్యలపై ఎందుకు స్పందిస్తారని ప్రశ్నించారు. సభలో సుమారు పదినిమిషాలకు పైగా గందరగోళం చోటుచేసుకుంది.

Updated Date - 2022-03-10T17:33:40+05:30 IST