ప్రజలపై మరిన్ని భారాలు మోపనున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-14T15:58:35+05:30 IST

నిధుల సమీకరణలో విఫలమైన రాష్ట్రప్రభుత్వం విద్యుత్‌, బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై మరిన్ని భారాలు మోపనుందని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, ప్రతిపక్ష నేత

ప్రజలపై మరిన్ని భారాలు మోపనున్న ప్రభుత్వం

                           - ప్రతిపక్ష నేత ఎడప్పాడి 


పెరంబూర్‌(చెన్నై): నిధుల సమీకరణలో విఫలమైన రాష్ట్రప్రభుత్వం విద్యుత్‌, బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై మరిన్ని భారాలు మోపనుందని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు. సేలం జిల్లా ఆతూర్‌ సమీపం బుద్ధిరగౌండంపాళయంలో మురుగన్‌ ఆలయాన్ని శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీలు 70 శాతం డీఎంకే ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే ఆస్తి పన్ను 200 శాతం పెంచిన డీఎంకే, ప్రతి ఏడాది పన్ను పెంచుతామని ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని చెబుతూ త్వరలో విద్యుత్‌, బస్సు ఛార్జీలు పెంపునకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో రోడ్డు రవాణా సౌకర్యం పెరగాలన్న లక్ష్యంతో చెన్నై-సేలం మధ్య ఎనిమిది రహదారులతో కూడిన గ్రీన్‌  హైవే చేపట్టామన్నారు. అప్పడు ఆ ప్రాజెక్ట్‌కు డీఎంకే, ఆ పార్టీ మిత్రపక్షాలు వ్యతిరేకించడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాయని, ప్రస్తుతం అదే ప్రాజెక్ట్‌ డీఎంకే హయాంలో ప్రారంభం కానుండగా మిత్రపక్షాలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువై ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు జీవిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నేరాల అదుపుకు చర్యలు చేపట్టడంతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఈపీఎస్‌ డిమాండ్‌ చేశారు.

Read more