కలెక్టర్ గానే ఉంటావా? రాజకీయాల్లోకి వస్తావా? అజిత్‌ జోగిని మార్చేసిన ఫోన్ కాల్

ABN , First Publish Date - 2020-05-29T22:46:25+05:30 IST

మెకానికల్ ఇంజినీర్లో గోల్డ్ మెడలిస్ట్ పొందిన అజిత్ జోగి... ఐపీఎస్ లో విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత ఐఏఎస్ సాధించారు కూడా.

కలెక్టర్ గానే ఉంటావా? రాజకీయాల్లోకి వస్తావా? అజిత్‌ జోగిని మార్చేసిన ఫోన్ కాల్

న్యూఢిల్లీ :  మెకానికల్ ఇంజినీర్లో గోల్డ్ మెడల్ పొందిన అజిత్ జోగి... ఐపీఎస్ లో విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత ఐఏఎస్ సాధించారు కూడా. అజిత్ జోగి సీఎం కావడంలో ఆయన బద్ధ విరోధి, కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కారణమయ్యారు. అది 1985.... కలెక్టర్ బంగ్లాలో అనుకోకుండా ఓ ఫోన్ మోగింది. బంగ్లాలో పనిచేసే వారు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి కలెక్టర్ గారు పడుకున్నారు అని సమాధామిస్తారు. అయితే వెంటనే ఆయన్ను నిద్ర లేపండి అని అవతలి వ్యక్తి ఆదేశం.


‘‘మీ దగ్గర గంటన్నర సమయం ఉంది. రాజకీయాల్లోకి వస్తారా? లేదా కలెక్టర్ గిరీనే చేస్తారా? మా నేత దిగ్విజయ్ సింగ్ మీ దగ్గరికి వచ్చి మొత్తం వివరంగా మాట్లాడుతారు’’ అని ఫోన్ పెట్టేశారు. ఆ ఫోన్... ఎవరిదంటే అప్పటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పీఏ. విల్సన్ జార్జ్‌ది. ఆ ఫోన్లో మాట్లాడింది ఎవరో కాదు... మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి. అప్పట్లో ఆయన కలెక్టర్.


వెంటనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. దిగ్విజయ్ కలెక్టర్ బంగ్లాకు చేరి పూర్తి వివరంగా మాట్లాడుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆయన్ను జాతీయ కాంగ్రెస్ ట్రైబల్ వెల్‌ఫేర్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పేశారు. కొన్ని రోజుల తర్వాత పని తీరును అంచనా వేసి రాజ్యసభకు కూడా పంపించారు. రాజీవ్ గాంధీ స్వయంగా ఆహ్వానించడంతోనే అజిత్ జోగి రాజకీయాల్లోకి వచ్చారు. 


వృద్ధ జంబుకాలను తప్పించి, యువతరం నేతలకు ఛాన్స్ ఇవ్వాలని రాజీవ్ తలపోశారు. మధ్యప్రదేశ్ నుంచి డిగ్గీరాజా కాగా... అత్యంత వెనుకబడిన ఛత్తీస్ గఢ్ నుంచి అజిత్ జోగిని ఎంచుకున్నారు రాజీవ్. అతి తక్కువ మాట్లాడటం... ఎక్కువగా పనిచేయడం ఈ లక్షణమే రాజీవ్.. జోగి వైపు మొగ్గు చూపేలా చేసిందని అప్పట్లో కాంగ్రెస్ నేతల భావన. అప్పట్లో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో శుక్లా బ్రదర్స్ చక్రం తిప్పుతున్నారు. అడ్డుకునే వారే లేరు. వారికి అడ్డు వేయడానికి జోగిని రాజీవ్ తెరపైకి తెచ్చారు.


ఇక అప్పటి నుంచి గాంధీ కుటుంబానికి జోగి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం డిగ్గీరాజాను తెరపైకి తెచ్చింది. అజిత్ జోగి పేరు కూడా వచ్చింది. అందుకు ఆయనా రెడీ అయిపోయారు. అయితే తనను రాజకీయాల్లోకి తెచ్చిన డిగ్గీ రాజాను శత్రువుగా భావించాల్సిన తరుణం వచ్చింది. జోగి అలాగే భావించాడు కూడా. 


తర్వాత మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్‌ను విభజిస్తూ అప్పటి వాజ్‌పాయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. శ్యామా చరణ్ శుక్లా, విద్యాచరణ్ శుక్లా, రాజేంద్ర శుక్లా, మోతీలాల్ వోరా ఇలా రాజకీయ దిగ్గజాలు రంగంలోకి దిగాయి. చివరికి వీసీ శుక్లా బీజేపీ మద్దతుతో ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న వార్తలొచ్చాయి. మరోవైపు మోతీలాల్ వోరా.... ఇలా కుమ్ములాడుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం అజిత్ జోగిని తెరపైకి తెచ్చింది.


అత్యంత వెనుకబడిన తరగతుల నేతగా గుర్తింపు పొందిన జోగి సీఎం అని ప్రకటించింది.31 అక్టోబర్ 2000 లో ఈయన ఛత్తీస్‌గఢ్ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఆదివాసిత్వంపై కోర్టులో అనేక కేసులు కూడా నడిచాయి. చివరికి సుప్రీం ఈయన ఆదివాసియేనని ధృవీకరించడంతో వివాదం సద్దుమణిగింది. 


కూతురు అనుష అంటే పంచ ప్రాణాలు

అజిత్ జోగికి కూతురంటే పంచ ప్రాణాలు. అయితే కూతురు అనుష ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు జోగి కుటుంబీకులు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశంలో ఉన్నారు. అయితే కూతురు పార్థివ శరీరాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే అధికారుల అనుమతి లభించలేదు. ఆ సమయంలో జోగి ఢిల్లీలో ఉన్నారు. వెంటనే స్థానిక అధికారులతో మాట్లాడి అనుమతి పొందారు. ఆ తర్వాత క్రైస్తవ సంప్రదాయంలో అంత్యక్రియలు జరిగాయి. ఇదే విషాదం ఆయన్ను తీవ్రంగా వెంటాడేదని ఆంతరంగీకులు పేర్కొంటారు. 

వెంటాడిన ఫిర్యాదులు... అభయమిచ్చిన సోనియా...

2003 ..... ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వేళ వచ్చేసింది. కాంగ్రెస్ దగ్గర కేవలం 37 సీట్లే. బీజేపీ వద్ద 50 సీట్లున్నాయి. డబ్బులతో బీజేపీ సభ్యులను ఆయన వైపు తిప్పుకున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చాయి. అందరూ ఆయనను తొలగించాలని డిమాండ్ తలెత్తినా... సోనియా గాంధీ అందుకు ఏమాత్రం ఒప్పుకోకుండా జోగివైపే నిలబడ్డారు. ఆ తర్వాత సీబీఐ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. 


ఘోర రోడ్డు ప్రమాదం... వీల్‌ఛైర్‌కే పరిమితమైన జోగి

20 ఏప్రిల్... 2004 లో మహాసమున్న్ నుంచి ఎంపీగా బరిలోకి దిగనున్నారు. ప్రచారంలో భాగంగా మరో నేత మెహతర్ లాలూ సాహూతో కారులో బయల్దేరారు. ఇంతలోనే ఓ చెట్టుకు కారు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జోగి కాలుతో పాటు నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యారు.

కాంగ్రెస్ నుంచి బహిష్కరణ... కొత్త పార్టీ ప్రారంభం

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ ఆయన్ను, ఆయన కుమారుడు అమిత్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. అయినా ఆయన చెక్కు చెదరలేదు. అదే వీల్‌ఛైర్‌లో రాజకీయం చేశారు.  2016 జూన్ 6న ఆయన ‘జనతా కాంగ్రెస్’ అనే సొంత పార్టీని స్థాపించి ఛత్తీస్ గఢ్ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేశారు. వీల్‌ఛైర్‌కే పరిమితమైనా... ఏనాడు ధైర్యాన్ని కోల్పోని ధీశాలి అజిత్ జోగి. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన జోగి..... శుక్రవారం సాయంత్రం కన్ను మూశారు. 



Updated Date - 2020-05-29T22:46:25+05:30 IST