Udaypur ప్రకటన ఎఫెక్ట్‌.. చిదంబరానికి రాజ్యసభ సీటు లభించేనా?

ABN , First Publish Date - 2022-05-15T14:03:22+05:30 IST

కుటుంబంలో ఒకరు మాత్రమే పదవిని కలిగి ఉండాలని రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ప్రారంభమైన ఏఐసీసీ ‘నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’ పార్టీ కొత్త విధివిధానాలకు సంబంధించిన

Udaypur ప్రకటన ఎఫెక్ట్‌.. చిదంబరానికి రాజ్యసభ సీటు లభించేనా?

చెన్నై: కుటుంబంలో ఒకరు మాత్రమే పదవిని కలిగి ఉండాలని రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ప్రారంభమైన ఏఐసీసీ ‘నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’ పార్టీ కొత్త విధివిధానాలకు సంబంధించిన ప్రకటన జారీ చేయనుండటంతో రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం రాజ్యసభ నుంచి ఎంపికకావటం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అధికార డీఎంకే నాలుగు స్థానాలను సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని తన మిత్రపక్షమైన కాంగ్రెస్ కు కేటాయించేందుకు డీఎంకే అధిష్ఠానవర్గం నిర్ణయించింది. ఆ మేరకు కాంగ్రెస్‌ తరఫు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆ సీటుకు పోటీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే పదవి ఉండాలని ఏఐసీసీ కొత్త విధివిధానాలపై ఉదయపూర్‌లో ఆదివారం ప్రకటన జారీ చేయనుంది. ఆ ప్రకటన మేరకు చిదంబరం రాజ్యసభకు పోటీ చేసే అవకాశం ఉండదని స్థానిక కాంగ్రెస్‌ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గీయులు చెబుతున్నారు. ప్రస్తుతం చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఎంపీగా ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం చిదంబరాన్ని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసేందుకు ఎప్పుడో నిర్ణయించిందని, ఈ విషయంలో ఉదయపూర్‌ శిబిరంలో వెలువడనున్న ప్రకటన వర్తించదని ఆయన మద్దతు దారులు నొక్కి వక్కాణిస్తున్నారు. చిదంబరం మళ్ళీ రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే విషయంపై ఏఐసీసీ ఈ వారంలోగా అధికారిక ప్రకటన జారీ చేయనుంది. అప్ప టి వరకూ చిదంబరానికి రాజ్యసభ సీటులభించే విషయంపై సస్పెన్స్‌ కొనసాగనుంది.

Updated Date - 2022-05-15T14:03:22+05:30 IST