ఇవేం నియామకాలు?

ABN , First Publish Date - 2021-09-16T08:28:58+05:30 IST

దేశవ్యాప్తం గా వివిధ ట్రైబ్యునళ్లలో కేంద్రం నియామకాలు చేపట్టిన తీరుపై సుప్రీంకోర్టు మరోసారి విరుచుకుపడింది.

ఇవేం నియామకాలు?

  • నచ్చినోళ్లను పెట్టుకున్నారు.. 
  • ట్రైబ్యునళ్లలో భర్తీలపై సుప్రీం ఆగ్రహం
  • న్యాయమూర్తులు ఇంటర్వ్యూ చేసి..
  • ఎంపిక చేసినవాళ్లను తీసేశారు
  • వెయిటింగ్‌ లిస్టులోని వారిని తెచ్చారు
  • ప్రస్తుతానికి కేంద్రంపై ‘ధిక్కారం’ ఆపుతున్నాం
  • రెండు వారాల్లో అన్నీ భర్తీ కావాలి
  • లేదంటే మేమే ఆదేశాలు జారీ చేస్తాం
  • చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ స్పష్టీకరణ


న్యాయసభ్యుల నియామకానికి 10 మందితో, సాంకేతిక సభ్యులకు సంబంధించి 11 మందితో జాబితాలిచ్చాం. న్యాయసభ్యుల జాబితాలో నుంచి 1, 3, 5, 7 నంబర్లలో ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ తర్వాత వెయిటింగ్‌ లిస్టు నుంచి సెలెక్ట్‌ చేసుకుంది. ఇవేం ఎంపికలు.. ఇవేం నియామకాలు?

- సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తం గా వివిధ ట్రైబ్యునళ్లలో కేంద్రం నియామకాలు చేపట్టిన తీరుపై సుప్రీంకోర్టు మరోసారి విరుచుకుపడింది. నచ్చినవారిని నియమించుకున్నారని, ఇవేం నియామకాలని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. అటార్నీ జనరల్‌ (ఏజీ) కేకే వేణుగోపాల్‌ను నిలదీశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సారథ్యంలోని ఎంపిక కమిటీలు సిఫారసు చేసిన వారిని పక్కనపెట్టి వెయిటింగ్‌లిస్టులో ఉన్నవారిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. చైర్మ న్లు, ప్రిసైడింగ్‌ అధికారులు, న్యాయ-సాంకేతిక సభ్యు లు లేక ట్రైబ్యునళ్లు పతనావస్థలో ఉన్నాయని..  రెండు వారాల్లో అన్ని ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీచేయాలని ఆదేశించారు. తామెంతో సహనంతో ఉన్నామని, ఈ ఓర్పును మరో రెండు వారాలు కొనసాగిస్తామన్నారు. కేంద్రంపై ధిక్కార చర్యలు ప్రారంభించకుండా ప్రస్తుతానికి ఆపుతున్నామని.. రెండు వారాల్లో నియామకాలు జరపకుంటే తామే ఆదేశాలు జారీచేయాల్సి ఉం టుందని చెప్పారు. న్యాయమూర్తులు సిఫారసు చేసిన జాబితాల నుంచి ఎవరి పేర్లయినా తొలగిస్తే.. కారణాలేంటో తమకు నివేదించాలని తేల్చిచెప్పారు. 


నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ), నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ), ఆదాయపన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఐటీఏటీ), సెంట్రల్‌ గూడ్స్‌ -సర్వీసెస్‌ ట్యాక్స్‌(సీజీఎ్‌సటీ) ట్రైబ్యునల్‌ ఏర్పాటు, సాయుధ దళాల ట్రైబ్యునల్‌(ఏఎ్‌ఫటీ) సహా పలు ట్రైబ్యునళ్లలో 250 ఖాళీలను కేంద్రం భర్తీ చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై చీఫ్‌ జస్టిస్‌ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావుల ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13లోగా ఖాళీలు భర్తీ చేయకుంటే తామే నియామకాలు జరుపుతామని ఈనెల 6న ధర్మాసనం హెచ్చరించింది. దీంతో కేంద్రం హడావుడిగా కొన్ని పోస్టులను భర్తీ చేసింది. బుధవారం ఆయా వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం సదరు నియామకాల తీరును తప్పుబట్టింది. 


‘ఖాళీలు భర్తీచేయకపోవడంతో ట్రైబ్యునళ్ల తీరు దయనీయంగా ఉంది. న్యాయసభ్యుల నియామకానికి 534 మందిని, సాంకేతిక సభ్యుల కోసం 400 మందికిపైగా ఇంటర్వ్యూ చేశాం. ఇందులో 10 మంది న్యాయసభ్యుల జాబితా, 11 మంది సాంకేతిక సభ్యుల జాబితా ఇచ్చాం. న్యాయసభ్యుల జాబితాలో నుంచి 1, 3, 5, 7 నంబర్లలో ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ తర్వాత వెయిటింగ్‌ లిస్టు నుంచి సెలెక్ట్‌ చేసుకుంది. ఐటీఏటీ నియామకాల్లోనూ ఇదే తీరు. సర్వీస్‌ లా ప్రకారం.. ఎంపిక చేసిన జాబితాను నిర్లక్ష్యం చేసి వెయిటింగ్‌ లిస్టులోకి వెళ్లడానికి వీల్లేదు. ఇవేం నియామకాలు’ అని ఏజీని చీఫ్‌ జస్టిస్‌ ప్రశ్నించారు. ఐటీఏటీలో ఖాళీల భర్తీకి సెలెక్షన్‌ కమిటీ 41 మందిని ఎంపిక చేస్తే.. వారిలో ప్రభుత్వం 13 మందినే ఎంచుకుందని.. దీనికి కారణమేంటో తెలియదని మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దాతార్‌ ఈ సందర్భంగా అన్నారు. కాగా, సిబ్బంది లేరనే కారణంతో ట్రైబ్యునళ్ల పరిధిని మార్చడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని  ప్రజలు ఇంతింత దూరం వెళ్లి ట్రైబ్యునళ్లను ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించింది.


ఏమిటీ హడావుడి నియామకం?

ఎన్‌సీఎల్‌ఏటీ యాక్టింగ్‌ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ ఎం.వేణుగోపాల్‌ను కేంద్రం హడావుడిగా నియమించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ‘జస్టిస్‌ చీమా ఎన్‌సీఎల్‌టీ చైర్మన్‌గా ఉన్నారు. 10రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. కానీ, ఆయన స్థానంలో జస్టిస్‌ వేణుగోపాల్‌ను నియమించడం చూస్తే చీమాను ముందుగానే విరమణ చేయించినట్లుగా కనిపిస్తోంది. దీనిపై గురువారం విచారణ జరుపుతాం. మీరు తప్పకుండా హాజరు కావాలి’ అని ఏజీని ఆదేశించింది. అలాగే ఒడిశా పరిపాలనా ట్రైబ్యునల్‌ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు, ఒడిశా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిం ది. 8 వారాల్లో సమాధానం చెప్పాలని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ల బెంచ్‌ ఆదేశించింది.


6 ట్రైబ్యునళ్లలో 84 నియామకాలు సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌

ఎన్‌సీఎల్‌టీ, ఐటీఏటీ సహా ఆరు ట్రైబ్యునళ్లలో 84 నియామకాలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. సెర్చ్‌ కమ్‌ సెలెక్షన్‌ కమిటీ(ఎస్‌సీఎస్‌సీ) చేసిన సిఫారసులేవీ పెండింగ్‌లో లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ అరవింద్‌ శరణ్‌ సుప్రీంకోర్టులో మంగళవారమే అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆరు ట్రైబ్యునళ్లలో 2020, 21 సంవత్సరాల్లో చేపట్టిన నియామకాల చార్టును కూడా దానికి జతచేశారు. వాటిలో మిగిలి ఉన్న ఖాళీలను కూడా ప్రస్తావించారు.

Updated Date - 2021-09-16T08:28:58+05:30 IST