ఈవీఎంల దుర్వినియోగంపై పోరాడుదాం

ABN , First Publish Date - 2022-08-14T08:40:50+05:30 IST

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సాగిస్తున్న ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ల దుర్వినియోగం మీడియా, మనీపవర్‌లకు..

ఈవీఎంల దుర్వినియోగంపై పోరాడుదాం

మీడియా, మనీపవర్‌పైనా పోరు

11 విపక్ష పార్టీల తీర్మానం


న్యూఢిల్లీ, ఆగస్టు 13: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సాగిస్తున్న ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ల దుర్వినియోగం మీడియా, మనీపవర్‌లకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని కాంగ్రెస్‌ సహా 11 విపక్ష పార్టీలు తీర్మానించాయి. ఈ చర్యలన్నీ ప్రజాస్వామ్యం పాలిట పెనుసవాళ్లు అని విమర్శించాయి. శనివారం ఢిల్లీలో జరిగిన 11 విపక్ష పార్టీల సమావేశంలో దిగ్విజయ్‌ సింగ్‌(కాంగ్రెస్‌), సీతారాం ఏచూరి(సీపీఎం), డి.రాజా(సీపీఐ), మైరాజుద్దీన్‌ అహ్మద్‌(ఆర్‌ఎల్డీ), జితేంద్ర(ఎన్‌సీపీ), సురేశ్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), డానిష్‌ అలీ(బీఎస్పీ), గణశ్యామ్‌ తివారీ(ఎస్పీ), ఇలియా్‌స(వెల్ఫేర్‌ పార్టీ), యోగేంద్ర యాదవ్‌(స్వరాజ్‌ ఇండియా) పాల్గొని.. కేంద్రంలోని బీజేపీ 3ఎం(మెషీన్‌, మనీ, మీడియా)ను దుర్వినియోగం చేస్తున్న తీరుపై పోరాడాలని ముక్తకంఠంతో తీర్మానించారు.


ఓటింగ్‌, వీవీప్యాట్‌లకు సంబంధం లేకుండా ఫలితాలు వస్తున్నాయని ఆరోపించారు. ప్రతి ఓటరు ఓటింగ్‌ను రికార్డ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈవీఎంలు ట్యాంపర్‌ దుర్భేద్యమేమి కావని విమర్శిస్తూ.. వీవీప్యాట్‌ స్లిప్‌ను ఓటర్‌ తీసుకునేలా నిబంధనల్లో మార్పులు చేయాలన్నారు. మనీపవర్‌ గురించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చుపై పరిమితులు ఉన్నా పార్టీల ఖర్చుపై పరిమితి లేదని విమర్శించారు. ఎలక్టోరల్‌ బాండ్‌ పద్ధతిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మీడియాలో తప్పుడు సమాచారం పెరిగిపోయిందని.. రెచ్చగొట్టే పోస్టులు పెరుగుతున్నాయని ఆరోపించారు. భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసినా అమలు కావడం లేదని వాపోయారు. తప్పుడు సమాచార వ్యాప్తిని నియంత్రించడంలో ఈసీఐ విఫలమైందని విమర్శించారు. ఈవీఎంలను విశ్వసించడానికి వీల్లేదన్నారు. బీజేపీ సర్కారు ధనబలంతోపాటు.. ఈడీ, సీబీఐ, ఆదాయపన్నుశాఖ వంటి శాఖలను దుర్వినియోగం చేస్తూ.. విపక్షాలపై ప్రయోగిస్తోందని దుయ్యబట్టారు.

Updated Date - 2022-08-14T08:40:50+05:30 IST