సాక్ష్యాలుంటే బయటపెట్టు..

ABN , First Publish Date - 2022-05-13T08:02:45+05:30 IST

మంత్రి కేటీఆర్‌ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్‌ విద్యార్థులు మరణించారని, దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి కనీస స్పందన లేదని బండి సంజయ్‌ చేసిన..

సాక్ష్యాలుంటే బయటపెట్టు..

లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి

నిరాధారమైన ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవు 

బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, మే 12(ఆంధ్రజ్యోతి): మంత్రి కేటీఆర్‌ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్‌ విద్యార్థులు మరణించారని, దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి కనీస స్పందన లేదని బండి సంజయ్‌ చేసిన ఆరోపణలపై కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా విరుచుకుపడ్డారు. హాస్యాస్పదమైన, నిరాధారమైన, బాధ్యతారహితమైన ఆరోపణలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హెచ్చరించారు. ఆరోపణలు రుజువు చేసే సాక్ష్యాలుంటే వాటిని బహిర్గతం చేయాలని, లేదంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలని సంజయ్‌ను డిమాండ్‌ చేస్తూ కేటీఆర్‌ గురువారం ట్వీట్‌ చేశారు. రాష్ట్రానికి వైద్య కళాశాలల కేటాయింపు అంశంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గుజరాత్‌లోని వైద్య కళాశాలల విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘‘ మోదీ జీ మీరు గుజరాత్‌కే కాదు దేశానికే ప్రధాని. డాక్టర్‌ కావాలన్న తెలంగాణకు చెందిన లక్షలాది మంది బాల బాలికల కలల సంగతేంటి ? గత ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా మంజూరు చేయకుండా మీరు వారికి అవకాశం లేకుండా చేశారు’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Read more