సర్వం.. సంకేతాత్మకం!

ABN , First Publish Date - 2020-08-21T05:52:18+05:30 IST

తొలిపూజలు అందుకొనే ఇలవేలుపు గణపతి. ఆయనను ఆరాధిస్తే సర్వశుభాలూ సిద్ధిస్తాయననేది విశ్వాసం.

సర్వం.. సంకేతాత్మకం!

తొలిపూజలు అందుకొనే ఇలవేలుపు గణపతి. ఆయనను ఆరాధిస్తే సర్వశుభాలూ సిద్ధిస్తాయననేది విశ్వాసం. దేవ గణాలకు అధినేత కనుక గణపతి. విఘ్ననాశకుడు కాబట్టి విఘ్నేశ్వరుడయ్యాడు. వినాయకుడి రూపం ఆద్యంతం 

సంకేతాత్మకం. మంత్ర, జ్యోతిష శాస్త్రాల్లో, వేదాంతంలో గణపతి అవయవాల నుంచి ఆహార్యం వరకూ ప్రతిదానికీ ఒక నిర్వచనం ఉంటుందంటారు పెద్దలు. అవేమిటంటే...


త్రినేత్రం

వినాయకుడి మూడో కన్ను ఆధ్యాత్మిక  జ్ఞానానికి ప్రతీక.


పరశువు

వినాయకుడి చేతిలో పరశువు ఉంటుంది. అది అజ్ఞానాన్ని ఖండిస్తుందంటారు.


అభయ హస్తం

గణేశుడి అభయహస్తం లోకానికి ఆయన రక్షకుడనేది చెబుతుంది.


లంబోదరం

విఘ్నేశ్వరుడి పొట్ట విశ్వానికి చిహ్నం. విశ్వాన్ని తనలో భరించే సామర్థ్యం, సర్దుబాటు తత్వ్తాన్ని లంబోదరుడు ప్రదర్శిస్తున్నాడు. అలాగే, జీవితంలో ఎన్నో విషయాలు ఎదురవుతూ ఉంటాయి. అవి మంచివైనా, చెడువైనా సమానంగా, ప్రశాంతంగా స్వీకరించాలని అది సూచిస్తుంది.


నాగబంధం

విఘ్నేశుడి ఉదరానికి ఉండే నాగబంధం కుండలినీ శక్తికి ప్రతీక. ప్రతి మనిషిలోనూ వెన్నుపూస కింద ఉండే మూలాధార చక్రంలో చుట్టుకున్న సర్పాకారంలో నిద్రాణమై ఉండే శక్తి ‘కుండలిని’ అనీ, ఆ శక్తిని జాగృతం చేసుకోగలిగితే భౌతికమైన బంధాల నుంచి విముక్తి పొంది, పరమాత్మను చేరగలమనీ యోగసాధకులు చెబుతారు. 


ఏకదంతం

ఏకదంతుడిగా వినాయకుడు విఖ్యాతుడు. ఎందుకంటే ఆయన రెండు దంతాల్లో ఒకటి విరిగి ఉంటుంది. పూర్తిగా ఉన్న దంతం వివేకానికీ, విరిగిన దంతం భావోద్వేగాలకూ సూచికలు. భావోద్వేగాలను వివేకంతో గెలవాలని అవి చెబుతాయి.


గజాననం 

వినాయకుడిది ఏనుగు తల. అది అనంతమైన జ్ఞానానికీ, 

యోగశక్తికీ, మేధస్సుకూ, పరిపూర్ణతకూ చిహ్నం.


నేత్రాలు

 చిన్నవిగా ఉండే ఆయన నేత్రాలు ఏకాగ్రతకు చిహ్నాలు. మాయామయమై, తప్పుదోవ పట్టించే లోకాన్ని నిశితంగా పరిశీలించి, ఏది వాస్తవమో దాన్నే పరిశీలించమని చెబుతాయి. 


పాశం

పాశం విఘ్నాలను తొలగిస్తుంది. కోరికలను నిర్మూలిస్తుంది.


పద్మం

తామర పువ్వు మానవ జీవితంలో అత్యంత ఉన్నత స్థితిగా చెప్పే ఆత్మ వివేకానికీ, మోక్షానికీ చిహ్నం.


శూర్పకర్ణం

గణపతి చెవులు పెద్దవిగా, నోరు చిన్నదిగా ఉంటుంది. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. అప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడన్నది దీని వెనుక పరమార్థం. లోకంలోని ఆర్తుల ప్రార్థనలను తన పెద్ద చెవులతో గణపతి ఆలకిస్తాడు. అలాగే ‘శూర్ప’ అంటే చేట. వ్యర్థాలను తొలగించడం చేట చేసే పని. అజ్ఞానాన్ని తొలగించి, కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందించే దైవం గణపతి అని ఇది సూచిస్తుంది.


వక్రతుండం

వంపు తిరిగిన తుండం ఓంకారానికి సంకేతం. మానవాళికి భ్రాంతి కలిగించే మాయకు వక్రమని పేరు. చెడు సంస్కారాలకు కూడా అది చిహ్నం. వాటిని నిర్మూలించేవాడు గణపతి.


మూషిక వాహనం

సమదర్శనానికీ చిహ్నం. అలాగే ఎలుకను కోరికలకు ప్రతీకగా చెబుతారు. కోరికలను అదుపులో పెట్టాలి తప్ప అవి మనమీద స్వారీ చేయకూడదనేది మూషికవాహనంలోని సందేశం.


మోదకం

సాధన చేస్తే ఫలం లభిస్తుందని మోదకంతో ఉన్న హస్తం చెబుతుంది.


జపమాల

 గజాననుడి చేతిలోని జపమాల జ్ఞాన  సంపాదనకు సంకేతం.


Updated Date - 2020-08-21T05:52:18+05:30 IST