సర్వం ‘స్వామి’మయం!

ABN , First Publish Date - 2022-08-07T10:53:59+05:30 IST

రూ.వేల కోట్ల ఆస్తులు... వందల కోట్ల ఆదాయం ఉన్న దేవదాయ శాఖను ప్రభుత్వం ఓ ప్రముఖ స్వామిజీకి ధారాదత్తం చేసింది. ఆ శాఖను నేరుగా తీసుకువెళ్లి ఆయన చేతుల్లో పెట్టేసింది. ఆయన ఏం చెబితే అదే చేయండి.

సర్వం ‘స్వామి’మయం!

  • దేవదాయ శాఖలో చక్రం తిప్పుతున్న స్వామీజీ 
  • శాఖకు ఆయనే  మంత్రి.. ఆయనే కమిషనర్‌ 
  • ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే
  • శాఖ ఆడ్మినిస్ట్రేషన్‌ మొత్తం స్వామి కనుసన్నల్లోనే 
  • మంత్రి, కమిషనర్‌ ప్రతి వారం క్యూలో


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రూ.వేల కోట్ల ఆస్తులు... వందల కోట్ల ఆదాయం ఉన్న దేవదాయ శాఖను ప్రభుత్వం ఓ ప్రముఖ స్వామిజీకి ధారాదత్తం చేసింది. ఆ శాఖను నేరుగా తీసుకువెళ్లి ఆయన చేతుల్లో పెట్టేసింది. ఆయన ఏం చెబితే అదే చేయండి... అంటూ అనధికార ఆదేశం ఇచ్చింది. అప్పటినుంచి సదరు స్వామిజీ వేలు పెట్టని అంశం లేదు. శాఖకు అనధికార మంత్రిగా వ్యవహరిస్తూ పాలన మొత్తం తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. ట్రస్ట్‌ బోర్డుల నియామకం దగ్గర నుంచి అధికారుల పోస్టింగ్‌లు, పదోన్నతులు ఇలా అన్నీ ఆయన సలహాలు, సూచనలతోనే జరుగుతున్నాయి. సాక్షాత్తూ సీఎం చెప్పినా పని అవుతుందో, లేదో కానీ ఆ స్వామివారు ఆదేశిస్తే మాత్రం క్షణాల్లో జరిగిపోవాల్సిందేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన లెటర్‌కు అంత పవర్‌ ఉంది. శాఖకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ స్వామి అనుగ్రహం తప్పనిసరి. వారానికి కనీసం ఒకసారి, కుదిరితే రెండుసార్లు దేవదాయ శాఖ మంత్రి, కమిషనర్‌ ఆయన్ను కలవాల్సిందే. ఇలా శాఖను తన స్వాధీనంలోకి తీసుకుని మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. స్వామి అనుగ్రహంతో ఇటీవల దేవదాయ శాఖలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలివీ... 


తొలిసారిగా సలహాదారు నియామకం 

అనంతపురానికి చెందిన ఓ వ్యక్తిని ప్రభుత్వం శుక్రవారం దేవదాయ శాఖ సలహాదారుగా నియమించింది. ఆ శాఖలో ఇంతవరకూ సలహాదారు అనే పదం లేదు. అలాంటి వ్యక్తులూ లేరు. కానీ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వం జీతం ఇచ్చి మరీ దేవదాయ శాఖకు సలహాదారును నియమించింది. మరి ఆయన విధులేమిటో... ఏం సలహాలు ఇస్తారో... దేవదాయ శాఖ అధికారులే చెప్పాలి. దీని వెనుక స్వామి అనుగ్రహమే ఉందని తెలుస్తోంది. ఆయన ఆదేశాల మేరకే సలహదారు నియామకం జరిగిందని శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


చట్ట నిబంధనలు గాలికి...

వేద విద్యార్థుల పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఇటీవల రాజమండ్రికి చెందిన ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించారు. దేవదాయ చట్టం ప్రకారం టీటీడీ, దేవదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రయివేటు సంస్థకు బాధ్యత అప్పగించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బ్రాహ్మణ సంఘాల ఆందోళనలతో దేవదాయ శాఖ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు సదరు ప్రయివేటు సంస్థ యాజమాన్యం స్వామీజీని కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఆ సంస్థకు అప్పగించాలన్న ఆదేశాలు వచ్చాయి. దాంతో నిబంధనలు గాలికి వదిలేసిన అధికారులు... ఆ తర్వాత నాలిక కరుచుకుని తాము ఎవ్వరికీ బాధ్యతలు ఇవ్వలేదని వివరణ ఇచ్చుకున్నారు. 


పోస్టింగ్‌ల్లోనూ పాత్ర  

దేవదాయ శాఖలో కొన్ని జిల్లాల్లో కీలకమైన పోస్టులున్నా యి. ప్రతి జోన్‌కు ఒక డిప్యూటీ కమిషనర్‌ ఉంటారు. 6బీ ఆలయాలకు సంబంధించిన పూజలు, కైంకర్యాలు, ఆస్తులు, భూముల లీజులు మొత్తం వీరి పరిధిలోనే ఉంటాయి. విశాఖ, రాజమండ్రి డిప్యూటీ కమిషనర్‌ పోస్టులు కీలకం. ఈ పోస్టుల కు చాలామంది అధికారులు పోటీ పడుతుంటారు. ఈమధ్య కాలంలో ఒక జోన్‌ డీసీ పోస్టులో స్వామీజీ అనుగ్రహం ఉన్న అధికారిని నియమించారు. ఇది ఆ జిల్లా మంత్రికి ఇష్టం లే దు. వెంటనే సదరు మంత్రి కొత్తగా వచ్చిన అధికారికి ఫోన్‌ చేశారు. ‘‘నువ్వు ఆ పోస్టులోకి ఎం దుకు వచ్చావ్‌. మా వాడిని నియమించుకోవాలని అనుకుంటున్నాం. నువ్వు వెంటనే వెన క్కి వెళ్లిపో. లేదంటే నేనే పంపించాల్పి వస్తుంది. కమిషనర్‌కు చెప్పమంటావా..?’’ అంటూ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తర్వాత 30 నిమిషాల్లోనే స్వామీజీ దగ్గరనుంచి మంత్రికి ఫోన్‌ వచ్చింది.


 ‘‘మంత్రిగారూ... ఆతను మనవాడే. నేను చెబితేనే అతనికి అక్కడ పోస్టింగ్‌ ఇచ్చారు. అతను దేవుడి పట్ల తీవ్రమైన నమ్మకం కలిగినవాడు. అతనినే అక్కడ కొనసాగిద్దాం’’ అంటూ చెప్పడంతో మంత్రి డీసీని ఆయన టచ్‌ కూడా చేయలేదు. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే జోన్‌ అది. సదరు డీసీ కూడా భారీగా ముడుపులిచ్చి మరీ రూ.కోట్లు చేతులు మారే ఆ జోన్‌లో పోస్టింగ్‌ వేయించుకున్నారు. ఇలా అనేక పోస్టింగ్‌ల విషయంలో స్వామీజీ పాత్ర ఉంది.  కరోనా సమయంలో నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ కింద అర్చకులకు కేం ద్రం ఆర్ధిక సాయం ప్రకటించింది. రాష్ట్రంలో అర్చకులు, పురోహితులందరికీ రూ.5వేలు చొప్పున అందించాలని ఆదేశించింది. ఈ విషయంలోనూ స్వామీజీ జోక్యం చేసుకున్నారు. రా ష్ట్రంలో ఇప్పటి వరకూ 60శాతం మంది అర్చకులకు మాత్రమే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి నిధులు ఇచ్చారు. అయితే స్వామీజీ ఇచ్చిన జాబితాలో ఉన్న వారందరికీ సాయం అందింది. ఈ మధ్య కాలంలో వంశపారపర్యంపై ఆ శాఖ కొన్ని నిబంధన లు రూపొందించింది. అవి స్వామీజీ దగ్గర నుంచి వచ్చినవేనని అర్చక సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2022-08-07T10:53:59+05:30 IST