అంతా సెపరేటు

ABN , First Publish Date - 2022-07-01T06:24:52+05:30 IST

కర్నూలు నగర పాలక సంస్థలో అవినీతి ఊడలు ఏ స్థాయిలో విస్తరించాయో తెలియడానికి ఇన్‌చార్జి ఎస్‌ఈ సురేంద్రబాబు ఉదంతమే పెద్ద ఉదాహరణ.

అంతా సెపరేటు

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్‌చార్జి ఎస్‌ఈ సురేంద్రబాబు

కార్పొరేషన్‌లో అవినీతి జలగలు

లంచం ఇస్తేనే ఫైళ్ల కదలిక

బిల్లు కావాలంటే అధికారులకు వాటా ఇవ్వాల్సిందే


కర్నూలు నగర పాలక సంస్థలో అవినీతి ఊడలు ఏ స్థాయిలో విస్తరించాయో తెలియడానికి ఇన్‌చార్జి ఎస్‌ఈ సురేంద్రబాబు ఉదంతమే పెద్ద ఉదాహరణ. రూ.వందో.. వెయ్యో.. కాదు. ఏకంగా రూ.15 లక్షలు లంచం డిమాండ్‌ చేయడాన్ని బట్టి అధికారులు ఎంతగా అక్రమాలకు అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు.  సురేంద్రబాబు కాంట్రాక్టర్‌ నుంచి గురువారం భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. ఈ ఘటనతో కార్పొరేషన్‌ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. 


(కర్నూలు-ఆంధ్రజ్యోతి):


కర్నూలు నగర పాలక సంస్థలో లంచం వ్యవహారం సంచలనం సృష్టించింది. అది కూడా రూ.15 లక్షలు.. తీసుకున్నది ఉన్నత స్థాయి అధికారి కావడంతో కార్పొరేషన్‌లోని అధికారులే ఆశ్చర్యపోతున్నారు. అమృత్‌ పథకం సబ్‌ కంట్రాక్టర్‌ శ్రీనివాసరెడ్డి నుంచి ఇన్‌చార్జి ఎస్‌ఈ ఇ. సురేంద్రబాబు రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. చివరి బిల్లు రూ.1.52 కోట్లు చెల్లించడానికి రూ.35 లక్షలు లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. అంటే.. నగర పాలక, పురపాలక సంఘాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. ప్రధానంగా ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళిక విభాగాల్లో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దిగువ స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు 15 శాతం వరకు పర్సెంటేజీలు ఇస్తేనే పనులకు బిల్లులు మంజూరు చేస్తారు. లేదంటే ఫైలు కదలదని ఓ కాంట్రాక్టరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. చేయని పనులకు కూడా బిల్లులు మంజూరయ్యాయనే ఆరోపణలూ లేకపోలేదు. కర్నూలు కార్పొరేషన్‌లో ఐదారేళ్లుగా చేసిన పనులు... కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేస్తే భారీ కుంభకోణం వెలుగు చేసే అవకాశం ఉంది. 


పైపుల కథ బయట పడిన వెంటనే...


 తుంగభద్ర పుష్కరాలు 2020 నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు జరిగాయి. రూ.30 కోట్లతో మునగలపాడు, మసామసీద్‌ సమీపంలోని పంప్‌హౌస్‌, సంకల్బాగ్‌, నాగసాయిబాబా, దక్షిణ షిరిడి సాయిబాబా, నగరేశ్వర స్వామి దేవాలయం, రాఘవేంద్ర స్వామి మఠం, రాంభొట్ల దేవాలయాల వద్ద పుష్కర ఘాట్లు... నగర సుందరీకరణ, రోడ్ల నిర్మాణం వంటి పనులు కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం పర్యవేక్షణలో చేశారు. స్నానాల ఘాట్ల నుంచి మురుగునీటిని దూరంగా మళ్లించేందుకు రూ.6 కోట్లు మంజూరు చేశారు. అందులో దాదాపు రూ.4 కోట్ల విలువైన హైడెన్సిటీ (హెచ్‌డీ) ప్రెజర్‌ పైపులు కొన్నారు. పుష్కరాల అనంతరం ఆ పైపులను వీకర్‌ సెక్షన్‌ కాలనీ పార్కులో నిల్వ చేస్తే.. అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని ఇంజనీర్లు అంటున్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో రూ.28 లక్షల పైపులే చూపారు. అక్కడ పైపులు భద్రపరిచినట్లు స్టాక్‌ రిజిస్టర్‌లోనూ నమోదు చేయలేదు. దీనిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ చేయించాలని ఇటీవల నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో 12వ వార్డు కార్పొరేటర్‌ క్రాంతికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆ పైపుల విలువ రూ.4 కోట్లు ఉందని... స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయలేదని ఆ రోజు ఎస్‌ఈ హోదాలో సురేంద్రబాబు వివరణ ఇచ్చారు. ఆయన వివరణ కొందరు అధికారులు, ప్రజా ప్రతినిధులకు నచ్చలేదు. సమావేశం జరిగిన కొద్దిరోజులకే ఎస్‌ఈ ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. పుష్కర పనులు, కొనుగోళ్లపై థర్డ్‌ పార్టీతో విచారణ చేయిస్తే భారీ కుంభకోణం వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 


పర్సంటేజీలకే సరి...


కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డులు ఉన్నాయి. ఆరు లక్షలకు పైగా జనాభా ఉంది. 2022-23 కార్పొరేషన్‌ బడ్జెట్‌ రూ.219 కోట్లు. గత ఐదారేళ్లుగా బడ్జెట్‌ను పరిశీలిస్తే సగటున రూ.175 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ప్రవేశ పెడుతున్నారు. జీతాలు, స్టేషనరీ, శానిటేషన్‌ కొనుగోళ్లు పోను రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్లు నిర్మాణాలు, మరమ్మతులు, తాగునీటి పైపులైన్‌ వంటి పనులకు ఏటా సుమారుగా రూ.75 కోట్లకు పైగా పనులు చేస్తున్నారు. కాంట్రాక్టరుకు బిల్లు మంజూరు కావాలంటే దిగువ స్థాయి నుంచి పైస్థాయి ఇంజనీరింగ్‌ అధికారి సహా డ్రాయింగ్‌ విభాగం అధికారుల వరకు ఒక్కొక్కరికి 2 నుంచి 15 శాతం వరకు పర్సంటేజీలు సమర్పించుకోవలసిందేనని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన కార్పొరేషన్‌లో జరిగే పనులపై ఏటా సగటున రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ వివిధ స్థాయిల్లో వాటాల రూపంలో వెళ్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే అమృత్‌ పథకం ఫైనల్‌ బిల్లుకు ఇన్‌చార్జి ఎస్‌ఈ సురేంద్ర బాబు రూ.35 లక్షలు డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టరు నుంచి రూ.15 లక్షలు తీసుకుంటుండగా... ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 


 మరి కొందరికీ వాటా..

 

గత టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి కుళాయి మంజూరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. అమృత్‌ పథకం ద్వారా 15 వేల కుళాయిలు...వాటి ఏర్పాటుకు 430 కి.మీ. పైపులైన్‌ నిర్మాణ పనులు రూ.68 కోట్లతో చేపట్టారు. వీటిని హైదరాబాదుకు చెందిన హ్యూంపైప్స్‌ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ నుంచి కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రూ.9కోట్ల నుంచి రూ.10 కోట్లు బిల్లులు చెల్లింపునకు అధికారులతో పాటు ముగ్గురు కీలకమైన ప్రజాప్రతినిధులకు కూడా భారీ మొత్తంలో వాటాలు అందాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. చివరి బిల్లు రూ.1.52 కోట్లు మంజూరు చేయడానికి ఇన్‌చార్జి ఎస్‌ఈ ఈ. సురేంద్రబాబు రూ.35 లక్షలు డిమాండ్‌ చేశారని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. అప్పటికే వివిధ దశల్లో బిల్లులు చెల్లింపునకు భారీగా వాటాలు ఇచ్చిన కాంట్రాక్టర్‌ చివరికి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. సురేంద్రబాబుపై అనంతపురం జిల్లాలో పని చేసిన సమయంలో కూడా ఏసీబీ కేసు నమోదైనట్టు తెలుస్తోంది.


 కమిషనర్‌గా ఐఏఎస్‌ అఽధికారిని నియమించినా ..


 నగర పాలక సంస్థ బడ్జెట్‌ ఏటా రూ.219 కోట్లు. ప్రభుత్వ గ్రాంట్లు సరేసరి. అవినీతి... అక్రమాలకు ఆస్కారం లేని పాలన అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారిని కమిషనర్‌గా నియమిస్తూ వస్తోంది. గత కమిషనర్‌ డీకే బాలాజీ, ప్రస్తుత కమిషనర్‌ ఎ. భార్గవ్‌తేజ ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులే. అయినా.. ఇంజనీరింగ్‌ విభాగం, పట్టణ ప్రణాళిక విభాగాల్లో భారీగా అవినీతి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నగర పాలనపై కమిషనర్‌ పర్యవేక్షణ కొరవడిందా..? రాజకీయ జోక్యం పెరగడంతో చూసీచూడనట్లు వెళ్తున్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్‌ తరువాత అత్యంత కీలకమైన ఇంజనీరింగ్‌ విభాగం ఇన్‌చార్జి ఎస్‌ఈ సురేంద్రబాబు కాంట్రాక్టరు నుంచి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం చూస్తే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. ఇప్పటికైనా కమిషనర్‌ భార్గవ్‌తేజ పాలనపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య విభాగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని.. తద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-01T06:24:52+05:30 IST