సర్వం సన్నద్ధం

ABN , First Publish Date - 2022-05-02T05:17:16+05:30 IST

ఈ నెల 6 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

సర్వం సన్నద్ధం
వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రం


  • ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
  • ఎగ్జామ్‌ రాయనున్న 17,565 మంది విద్యార్థులు
  • జిల్లా వ్యాప్తంగా 32 సెంటర్లు
  • ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష
  • ఫీజు కట్టలేదని హాల్‌ టికెట్‌ ఇవ్వకుంటే చర్యలు

 ఈ నెల 6 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 32 సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, ఫర్నిచర్‌ తదితర మౌలిక వసతులు కల్పిస్తారు. విద్యార్థుల కోసం గ్రామాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఇదిలా ఉంటే ఫీజు కట్టలేదనే సాకుతో ప్రైవేటు కాలేజీలు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్య నోడల్‌ అఽధికారి శంకర్‌నాయక్‌ పేర్కొన్నారు.

వికారాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు జిల్లాలో ఇంటర్‌ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షలకు వికారాబాద్‌ జిల్లాలో 17,565మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ఫస్టియర్‌ విద్యార్థులు 9,350 మంది, సెకెండియర్‌ విద్యార్థులు 8,215మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వికారాబాద్‌లో 9, తాండూరులో 9, పరిగిలో 5, కొడంగల్‌లో 2, కులకచర్లలో 2, పెద్దేముల్‌, దోమ, మోమిన్‌పేట్‌, నవాబ్‌పేట్‌, మర్పల్లిల్లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారిని నియమించారు. మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు వేయనుంది. ఎగ్జామినేషన్‌ సెంటర్లలో తాగునీటి వసతితో పాటు వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటారు. సెంటర్‌ చుట్టూ వంద మీటర్ల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.  మే 6 నుంచి మే 23వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. 16 ప్రభుత్వ, 16 ప్రైవేట్‌/అన్‌ ఎయిడెడ్‌ కాలేజీల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. అన్ని సబ్జెక్టులకు మూడు సెట్ల క్వశ్చన్‌ పేపర్లు ఉంటాయి. వాటిల్లో ఒక దాన్ని పరీక్షకు కొద్ది సమయం ముందు డ్రా తీసి ఎంపిక చేస్తారు. పరీక్ష పేపర్లు ఆయా పోలీసు స్టేషన్లలో భద్రపరుస్తారు. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థుల్లో 8,000 మంది జనరల్‌, 1,350మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు. సెకెండియర్‌లో 7166 మంది జనరల్‌, 925 మంది ఒకేషనల్‌, 124 మంది ప్రైవేట్‌ విద్యార్థులు ఉన్నారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తేవాలని ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ జిల్లా నోడల్‌ అధికారి, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ(డెక్‌) కన్వీనర్‌ శంకర్‌నాయక్‌ పేర్కొన్నారు. హాల్‌టికెట్‌లో తమ ఫొటో, సబ్జెక్టులు, సంతకం వంటివి సరిగా ఉన్నాయా? లేదా? అనేది విద్యార్థులు చూసుకోవాలని, పొరపాట్లు, తప్పులు ఉంటే వెంటనే వారి కాలేజీ ద్వారా తమ తెలియజేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీఎ్‌సలు, డీవోలు, ఇన్విజిలేటర్లు తమ గుర్తింపు కార్డులను విధిగా ధరించాలని, ఎగ్జామ్‌ సెంటర్లోకి సెల్‌ఫోన్లు ఎవరూ తీసుకువెళ్లకూడదన్నారు. ఫీజు బకాయిల పేరిట హాల్‌ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ సమీక్షిస్తున్నారు. 

నిఘా నీడలో పరీక్షలు

ప్రతీ పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రాల ప్యాకెట్లు తెరవడం, సమాధాన ఆన్సర్‌ షీట్ల ప్యాకెట్లు సీల్‌ చేయడం వంటివి సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. ప్రభుత్వ జూనియర్‌, ప్రైవేట్‌ కళాశాలల్లో ఇది వరకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతంలో సమస్యాత్మక కేంద్రాలుగా ఇంటర్మీడియట్‌ విద్యా మండలిలో నమోదైన పరీక్షా కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేస్తాయి. ఒక ఫ్లయింగ్‌, రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఎగ్జాం సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ తెచ్చారు. హాల్‌ టిక్కెట్‌ నంబర్‌ నమోదు చేస్తే విద్యార్థి ఉన్న ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది, రూట్‌ మ్యాప్‌ ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

ఉదయం 8.30గంటల్లోగా కేంద్రాలకు చేరుకోవాలి

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఉదయం 8.15గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయం కంటే ముందే పరీక్ష రాయడం పూర్తిచేసినా సమయం ముగిసిన తర్వాతే విద్యార్థులను బయటకు పంపుతారు. విద్యార్థులు గ్రామాల నుంచి పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరేందుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. కేంద్రాల్లో తాగునీటి వసతితో పాటు వైద్య సహాయం అందుబాటులో ఉంటుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. పరీక్ష సమయంలో   జిరాక్స్‌, కంప్యూటర్‌ కేంద్రాలు మూసేశ్తారు.

పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు పరీక్షకు ఆలస్యం చేయకుండా కేంద్రాలకు ఉదయం 8.15గంటల్లోగా చేరుకోవాలి. సెంటర్లలో అవసరమైన తాగునీరు, వైద్య సహాయం, ఫర్నిచర్‌ ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి జిల్లాను ఉన్నత స్థానంలో నిలుపుతారనే విశ్వాసం ఉంది. 

                          -ఎన్‌.శంకర్‌నాయక్‌, నోడల్‌ అఽధికారి, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ, వికారాబాద్‌

Updated Date - 2022-05-02T05:17:16+05:30 IST