పోలింగ్‌కు సర్వం సిద్ధం!

ABN , First Publish Date - 2021-12-09T05:10:54+05:30 IST

మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు శుక్రవారం జరిగే పోలింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

పోలింగ్‌కు సర్వం సిద్ధం!

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 9 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

ఓటేయనున్న 1,026 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌

ఎన్నికల విధులకు 49 మంది సిబ్బంది నియామకం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, డిసెంబరు8: మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు శుక్రవారం జరిగే పోలింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ సామగ్రి తరలింపు నుంచి బ్యాలెట్‌ బాక్సులు స్ర్టాంగ్‌కు చేరే వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నిర్మలా జగ్గారెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,026 మంది ఓటర్లున్నారు. మహిళలు 572 మంది, పురుషులు 454 మంది ఉన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 


తొమ్మిది కేంద్రాలు..

సంగారెడ్డి జిల్లాలో 4, మెదక్‌ జిల్లాలో 3, సిద్దిపేట జిల్లాలో 2 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి టీఎన్‌జీవో భవన్‌ పోలింగ్‌ కేంద్రంలో 251 మంది, అందోల్‌ ఆర్డీవో కార్యాలయంలో 59 మంది, నారాయణఖేడ్‌ ఆర్డీవో కా ర్యాలయంలో 89 మంది, జహీరాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో 85 మంది, మె దక్‌ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేం ద్రంలో 149 మంది, నర్సాపూర్‌ ఆర్డీవో కార్యాలయ పోలింగ్‌ కేంద్రంలో 68 మంది, తూప్రాన్‌ ఆర్డీవో కార్యాలయం పోలింగ్‌ కేంద్రంలో 64 మంది, సిద్దిపేట జిల్లాలోని డిగ్రీ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో 162 మంది, గజ్వేల్‌ డిగ్రీ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో 99 మంది ఓటు వేసే విధంగా ఏర్పాటు  చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ప్రిసైడింగ్‌ అసిస్టెంట్‌, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లతో పాటు మైక్రో అబ్జర్వర్‌, సెక్టోరియల్‌ అధికారిని నియమించారు. 


 క్రాస్‌ ఓటింగ్‌కు ఛాన్స్‌!

మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశం ఉందని రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ప్రాధాన్య క్రమంలో ఓటు వేయాల్సి ఉండడంతో నిరక్షరాస్యులు, అవగాహన లేని వారు ఏవిధంగా ఓటు వేస్తారో..అది ఎవరికి వెళ్తుందోనని భయపడుతున్నారు. స్థానిక సంస్థల నుంచి కొత్తగా గెలిచిన వారు, గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన తండాల నుంచి గెలిచిన ఎంపీటీసీలు, కేవలం తమ పేరు మాత్రమే రాసే అవకాశం ఉన్నవారు ఓటు వేయడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. పేర్లు చదివే అవకాశం లేని ఓటర్లు తమ పార్టీ అభ్యర్థికి బదులుగా మరో అభ్యర్థి ఓటు వేస్తే ఎలా అని ఆలోచనలో పడ్డారు.  ఒక్కోసారి చదువుకున్న వారు కూడా అయోమయానికి గురై ఓటు తప్పుగా వేస్తే అది కాస్తా చెల్లకుండా పోయే ప్రమాదం కూడా ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం హైదరాబాద్‌లో ముఖ్య నేతలు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో ప్రాధాన్య క్రమంలో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించే అవకాశం ఉన్నది. ఒక కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాత్రం తమ ఓటర్లకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టినట్లు లేదు. 


నేటితో క్యాంపు రాజకీయాలకు ముగింపు!

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఓట్లు చీలిపోకుండా తమ నేతలను క్యాంపులకు పంపించింది. నవంబరు 30, డిసెంబరు 1వ తేదీల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 770 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించారు. మెదక్‌ జిల్లాకు చెందిన వారు కుటుంబసభ్యులతో కలిసి బస్సుల్లో బెంగుళూరు, మైసూరు, ఊటీ, గోవా వెళ్లారు. ఇక సంగారెడ్డి, సిద్దిపే జిల్లాలకు చెందిన వారు ఢిల్లీ, కశ్మీర్‌, మధ్యప్రదేశ్‌ వంటి ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో వెళ్లారు. వీరందరూ బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకుంటారు. గురువారం టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు వీరితో సమావేశం అవుతున్నట్లు తెలిసింది. సమావేశంలో ఒక్కో ఓటరుకు ప్యాకేజీ ముట్టజెప్పడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం ఓటర్లందరూ హైదరాబాద్‌ నుంచి నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసే విధంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాత్రం క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తమ ఓటర్లందరూ తమకే ఓటు వేస్తారు అన్న ధీమాతో ఉన్నారు. 




Updated Date - 2021-12-09T05:10:54+05:30 IST