వానాకాలం సాగుకు సర్వం సన్నద్ధం

ABN , First Publish Date - 2022-05-17T05:30:00+05:30 IST

నైరుతీ రుతుపవనాలు అండమాన్‌ దీవులను తాకి ముందస్తు వర్షాలకు సంకేతాలిసున్నాయి.

వానాకాలం సాగుకు సర్వం సన్నద్ధం

- 3.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు

- వరిసాగు విస్తీర్ణం 2.45 లక్షల ఎకరాలు

- 57 వేల ఎకరాల్లో పత్తి, 28 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు

- పత్తి, పప్పు దినుసుల సాగుపై ప్రత్యేక దృష్టి

- ప్రయోగాత్మకంగా ఒకేసారి ఏరే పత్తి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

నైరుతీ రుతుపవనాలు అండమాన్‌ దీవులను తాకి ముందస్తు వర్షాలకు సంకేతాలిసున్నాయి. ఈ నేపథ్యంలో  జిల్లా వ్యవసాయశాఖ వానాకాలం సాగుకు ఏర్పాట్లు చేసింది. 3 లక్షల 40 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలపైనే దృష్టి సారిస్తుండగా వ్యవసాయ శాఖ మాత్రం పత్తి, పప్పు దినుసుల సాగును ప్రోత్సహించాలని భావిస్తున్నది. జిల్లాలో ఈసారి ప్రయోగాత్మకంగా 500 ఎకరాల్లో ఒకేసారి ఏరే పత్తిని సాగు చేయాలని నిర్ణయించి అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నది. రైతులలో ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్ల వారీగా నాలుగు ప్రయోగాలు చేసేందుకు ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 2021 వానాకాలంలో 3,29,176 ఎకరాల్లో, అంతకు ముందు వానాకాలంలో 3 లక్షల 50 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ఈసారి 3 లక్షల 40 వేల ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళిక రూపొందించింది. 2 లక్షల 45 వేల ఎకరాల్లో వరి, 57 వేల ఎకరాల్లో పత్తి, 28 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 5 వేల ఎకరాల్లో పప్పుదినుసుల పంటలను సాగు చేయాలని నిర్ణయించింది. ఈ నాలుగు పంటల సాగు విస్తీర్ణం 3 లక్షల 35 వేల ఎకరాలు కాగా మరో 5 వేల ఎకరాల్లో వేరుశెనగ, పసుపు, మిర్చి, పొగాకు, కూరగాయలు, తదితర పంటలు సాగు చేయాలని భావిస్తున్నారు. 

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

వరిసాగు విస్తీర్ణాన్ని తగ్గించి డిమాండ్‌ ఉన్న పత్తి, పప్పు దినుసుల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ భావిస్తున్నది. ప్రయోగాత్మకంగా 500 ఎకరాల్లో సింగిల్‌ పికింగ్‌ పత్తిని సాగు చేయించాలని నిర్ణయించింది. ఈ పత్తి సాగుతో విత్తన మోతాదు పెరిగినా పత్తి ఏరడానికి యంత్రాలను వినియోగించుకునే అవకాశం ఉండడంతో లేబర్‌ సమస్య కూడా ఉండదు. మొక్కకు మొక్కకు మధ్య గతంలో 50 నుంచి 70 సెంటీమీటర్ల దూరం ఉండాల్సి ఉండగా, ప్రస్తుత పద్ధతిలో 15 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. దీంతో మొక్కలు ఎక్కువగా వచ్చి ఒకే పికింగ్‌ చేసినా 9 క్వింటాళ్ల మేరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. నవంబర్‌లోగానే పత్తి ఏరడం పూర్తవడంతో వెంటనే రెండో పంట సాగుకు రైతు సన్నద్ధం అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ఈ విషయాన్ని వ్యవసాయాధికారులు జిల్లాలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను చైతన్యం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పప్పు దినుసులకు డిమాండ్‌ ఉండడంతో కంది ఎక్కువగా సాగు చేయాలని సూచిస్తున్నారు. 

ఎరువుల అవసరాలు.. అందుబాటు..

వానాకాలం సాగు కోసం 42,025 టన్నుల యూరియా, 26,236 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 10,852 టన్నుల ఎంవోపీ, 6806 టన్నుల డీఏపీ అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో 15,665 టన్నుల యూరియా, 3,632 టన్నుల డీఏపీ, 669 టన్నుల ఎంవోపీ, 21,274 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉంచారు. 

ప్రదర్శన క్షేత్రాలు...

జిల్లా వ్యాప్తంగా 76 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా ఆయా క్లస్టర్లలో నాలుగు రకాల ప్రత్యేక ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని వ్యవసాయశాఖ భావిస్తున్నది. తడి, పొడి పద్ధతిలో వరిసాగు చేపట్టేందుకు అవగాహన కల్పించాలని, ప్రతి క్లస్టర్‌లో 25 మంది రైతులను ఎంపిక చేసి 50 ఎకరాలలో ఆ సాగు చేపట్టాలని భావిస్తున్నది. భూమిలో ఉన్న భాస్వారాన్ని కరిగించి మొక్కకు అందుబాటులోకి తెచ్చేందుకు పీఎస్‌బీ పద్ధతిని ప్రచారం చేస్తున్నది. ప్రతి క్లస్టర్‌లో 50 మంది రైతులతో వంద ఎకరాలలో ఈ ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. యూరియాను ఒకేసారి కాకుండా దఫాలుగా వారిగా వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు 50 మంది రైతులను ఎంపిక చేసి వంద ఎకరాలలో క్లస్టర్ల వారీగా అవగాహన కల్పించనున్నారు. ప్రతి క్లస్టర్‌ పరిధిలో 30 మంది రైతులను ఎంపిక చేసి వారిచే 150 ఎకరాల్లో పచ్చిరొట్ట సాగుకు ప్రోత్సహిస్తారు. ఇందుకోసం జీలుగ, జనుము పంటలకు చెందిన 8,500 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచారు. 

వానాకాలం సాగుకు ఏర్పాట్లు పూర్తి చేశాం

- జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్‌

ముందస్తు వర్షాలు వచ్చినా వానాకాలం సాగుకు జిల్లా వ్యవసాయశాఖను ఇప్పటికే సన్నద్ధం చేశాం. అన్ని క్లస్టర్లలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పత్తి, పప్పు దినుసుల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, తదితర అంశాలపై అవగాహన కల్పించాం. వీలైనంత వరకు పత్తి, కంది పంటలను రైతులు ఎక్కువగా సాగు చేసేలా చూస్తాం. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత ఉండకుండా చూస్తున్నాం. పకడ్బందీ ప్రణాళికతో విత్తనాలు, ఎరువులు అవసరానికి తగినంతగా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశాం. జిల్లావ్యాప్తంగా తడి, పొడి వరి సాగు, పచ్చిరొట్ట సాగు, దఫాల వారీగా యూరియా వినియోగం, పీఎస్‌బీ ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు క్లస్టర్ల వారీగా రైతులను ఎంపిక చేసేందుకు వ్యవసాయాధికారులకు ఆదేశాలిచ్చాం. 

Updated Date - 2022-05-17T05:30:00+05:30 IST