అంతా మా ఇష్టం!

ABN , First Publish Date - 2022-04-27T04:51:29+05:30 IST

జిల్లా కేంద్రం నడిబొడ్డున నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణం పనుల్లో నాణ్యత నగుబాటుగానే మారుతోంది. రూ.7.10కోట్ల నిధుల పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతూ అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

అంతా మా ఇష్టం!
సమీకృత మార్కెట్‌ పునాదుల్లో చదును చేసిన మొరం మట్టి

అడ్డగోలుగా సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు

మొరం తవ్వకాలతో ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్‌కు ముప్పు

ఇసుక మాఫియాకు అడ్డాగా మారిన సాత్నాల క్వార్టర్స్‌

పట్టించుకోని మున్సిపల్‌, ఇంజనీరింగ్‌ అధికారులు

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌26 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రం నడిబొడ్డున నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణం పనుల్లో నాణ్యత నగుబాటుగానే మారుతోంది. రూ.7.10కోట్ల నిధుల పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతూ అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పట్టణ వాసులకు సకల సౌకర్యాలను ఒకే చోట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమీకృత మార్కెట్‌యార్డును మంజూరు చేసింది. దీంతో రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి వెనుకాల సాత్నాల క్వార్టర్స్‌లో ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం పనులు చేపట్టారు. మొత్తం 5.74 గుంటల భూమి ఉండగా ఇందులో నుంచి 3.71 గుంటల భూమిని నీటిపారుదల శాఖ మున్సిపాలిటికీ అప్పగించింది. ఇందులో దాదాపు రెండు ఎకరాల్లో మార్కెట్‌యార్డు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మిగతా స్థలాన్ని పార్కింగ్‌ స్థలంగా వదిలేశారు. నిర్మాణం పనుల పర్యవేక్షణ బాధ్యత మున్సిపల్‌ అధికారులకు అప్పగించారు. దీంతో అడుగడుగునా అవకతవకలు, అక్రమాలే చోటు చేసుకుంటున్నాయి. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనులపై పర్యవేక్షణ లేక పోవడంతో సందేహాలే వ్యక్తమవుతున్నాయి. దీంతో కాంట్రాక్టర్‌ చెప్పిందే లెక్కగా మారుతోంది. ఎక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించినట్లు కనిపించడం లేదు. సిమెంట్‌ పనుల్లో ఇసుకకు బదులు అధిక మొత్తంలో డస్ట్‌తో పాటు నాసిరకమైన ఇసుకను వాడడంతో అప్పుడే పునాదులు పగుళ్లువారి కనిపిస్తున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనులు చేపడుతున్న అధికారులు మాత్రం అభ్యంతరం చెప్పడం లేదు. కాంట్రాక్టర్‌, అధికారులు కుమ్మక్కై అడ్డగోలుగా పనులు చేపడుతున్న అడిగే నాథుడే కరువవుతున్నాడు. 

అడ్డగోలుగా తవ్వకాలు..

సమీకృత మార్కెట్‌యార్డు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ప్రభుత్వ స్థలంలోనే అడ్డగోలుగా తవ్వేస్తూ అక్రమంగా మొరాన్ని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పగలంతా మార్కెట్‌యార్డు నిర్మాణానికి మొరాన్ని తరలిస్తూ, రాత్రి వేళల్లో అధికారుల కళ్లుగప్పి అమ్మేస్తున్నారు. పక్కనే ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్‌కు ప్రమాదం పొంచి ఉందని ఆ శాఖ డీఈ అభ్యంతరం చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు కూడా అడిగేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ స్థలంలో మొరం తవ్వకాలు చేపడుతూ బిల్లులను జేబులో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిబంధనల ప్రకారం 10కి.మీల దూరం నుంచి మొరం మట్టిని తరలించాల్సి ఉంటుందని ఎస్టిమేషన్‌లో చూపినా నాలుగు అడుగుల దూరంలోనే మొరాన్ని తరలిస్తూ మార్కెట్‌యార్డు పునాదులను చదును చేస్తున్నారు. అయినా అడ్డు చెప్పే వారే కనిపించడం లేదు. 

ఇసుక మాఫియా ఇష్టారాజ్యం..

సమీకృత మార్కెట్‌యార్డు పేరిట ఇసుకను తరలిస్తున్న కాంట్రాక్టర్‌ అక్కడి నుంచి రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మేసుకుంటున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు ఇక్కడి నుంచి ఇసుకను తరలించుకు పోతున్నారు. ఇదేమిటని అడిగితే మార్కెట్‌ నిర్మాణం పనుల కోసం ఇసుకను తరలిస్తున్నామని చెబుతూ తప్పించుకుంటున్నారు. రాత్రంతా ఇసుకమాఫియాకు అడ్డగా మారుతున్న సాత్నాల క్వార్టర్స్‌లో ఎక్కడ చూసినా ఇసుక కుప్పలే కనిపిస్తున్నాయి. పెన్‌గంగా నది నుంచి భారీ టిప్పర్లలో తీసుకొస్తూ డంపు చేసి మరి విక్రయిస్తున్నారు. ఇదంతా కాంట్రాక్టర్‌ కనుసన్నల్లోనే నడుస్తున్నా అధికారు లు చూపీ చూడనట్లు వ్యవహరించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెన్‌గంగా నది నుంచి ఇసుకను తరలించే సమయంలో అధికారులకు పట్టుబడితే సమీకృత మార్కెట్‌కు తరలిస్తున్నామని చెబుతు ఇసుక మాఫియా తెలివిగా తప్పించుకుంటున్నారు. జైనథ్‌ మండలం డొల్లార గ్రామ సమీపంలో ఇసుక టెండర్‌ను దక్కించుకున్న ఓ ఇసుక వ్యాపారి సమీకృత మార్కెట్‌యార్డు వద్ద భారీగా డంపు చేస్తూ ట్రాక్టర్‌కు అమర్చిన ప్రత్యేక యంత్రాలతో జాలిపడుతూ విక్రయిస్తున్నారు. ప్రతి ట్రాక్టర్‌కు రూ.500ల నుంచి రూ.1000 వరకు కాంట్రాక్టర్‌కు కమిషన్‌ రూపంలో చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేమిటని అడిగితే అధికారులకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

తవ్వకాలు నిలిపి వేయాలని చెప్పాం

- విఠల్‌, ఈఈ, నీటిపారుదల శాఖ అధికారి

సాత్నాల క్వార్టర్స్‌లో చేపడుతున్న మొరం తవ్వకాలను వెంటనే నిలిపి వేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు చెప్పడం జరిగింది. ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్‌ పక్కన భారీ మొత్తంలో మొరం తవ్వకాలు చేపట్టడంతో గెస్ట్‌హౌస్‌కు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే నిలిపి వేయకుంటే పై అధికారులకు ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకుంటాం.


వెంటనే పనులను పరిశీలిస్తాం..

- శైలజ, మున్సిపల్‌ కమిషనర్‌, ఆదిలాబాద్‌ 

సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణ పనులను పరిశీలిస్తాం. నాసిరకంగా చేపట్టినట్లు తేలితే చర్యలు తీసుకుం టాం. సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను తరచూ పనులను పర్యవేక్షణ చేయాలని ఆదేశి స్తాం.నాణ్యత లేకుండా పనులు చేపడితే బిల్లులు చెల్లించేది లేదు. నిబంధనల ప్రకారం పనులు చే యాల్సి ఉంటుంది. ఇస్టిమేషన్‌ ప్రకారం సూచించి న ఇసుకను మాత్రమే వాడాలి. మోతాదుకు మిం చి డస్ట్‌ను వాడినట్లయితే చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2022-04-27T04:51:29+05:30 IST