అంతా మా ఇష్టం!

ABN , First Publish Date - 2021-01-18T05:06:33+05:30 IST

పోలీసుస్టేషన్‌కు ఏ ఒక్కరూ రావాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే చాలు.. మీ ఇంటి ముంగిటకే పోలీసులు వస్తారు. సత్వర న్యాయం చేస్తారు’ అంటూ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోలీసుస్టేషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి సైతం పదేపదే చెబుతున్నారు. జిల్లాలో మాత్రం దీనికి భిన్నంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అంతా మా ఇష్టం!


 సెటిల్‌మెంట్‌ కేంద్రాలుగా స్టేషన్లు
 అనేక సంఘటనలు వివాదాస్పదం
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
పోలీసు శాఖలో కొందరి పనితీరు తరచూ విమర్శలకు తావిస్తోంది. బాధితులు న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళితే.. ఎక్కువమంది ప్రైవేటు సెటిల్‌మెంట్స్‌కు శ్రద్ధ చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది పోలీసులు అధికార పార్టీ నేతల అండతో కావాల్సిన చోట కొలువుదీరుతున్నారు. స్టేషన్లను సెటిల్‌మెంట్‌ కేంద్రాలుగా మార్చేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీర్ఘకాలంగా ఒకే స్టేషన్లలో తిష్ట వేసిన రైటర్‌లు ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు స్వయాన ఎస్పీకి ఫిర్యాదులు అందుతున్నాయి.

-పోలీసుస్టేషన్‌కు ఏ ఒక్కరూ రావాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే చాలు.. మీ ఇంటి ముంగిటకే పోలీసులు వస్తారు. సత్వర న్యాయం చేస్తారు’ అంటూ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోలీసుస్టేషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి సైతం పదేపదే చెబుతున్నారు. జిల్లాలో మాత్రం దీనికి భిన్నంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ ఫిర్యాదుల కంటే స్టేషన్లలో ఆఫ్‌లైన్‌ ఫిర్యాదులను స్వీకరించేందుకు పోలీసులు ఇష్టపడుతున్నారు. కుటుంబ తగాదాలు, భూమి గొడవల్లోనూ తలదూర్చి సెటిల్‌మెంట్‌లకు కేంద్రాలుగా మార్చేస్తున్నా, ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. కొన్నిచోట్ల ఒక వర్గానికి వత్తాసు పలికే క్రమంలో ఫిర్యాదుదారులతో తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకొని రైటర్లే తమకు నచ్చిన విధంగా రాసుకుంటున్నారనే విమర్శలున్నాయి. గతంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువర్గాలు శ్రీకాకుళంలోని ఒక పోలీసుస్టేషన్‌కు రాగా.. అక్కడ పోలీసులు పంచాయతీ పెట్టారు. దీంతో స్టేషన్‌లోనే ఇరువర్గాలూ కత్తులతో పరస్పర దాడులకు దిగడం సంచలనం రేకెత్తించింది. దీనిపై అప్పట్లో ఎస్పీ స్వయంగా విచారణ చేసినా ఎవరిపై ఎటువంటి చర్యలు లేవు.

నేతలు, రౌడీషీటర్లే మధ్యవర్తులు
 -సంతబొమ్మాళి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒక మహిళ మోసపోయిన వ్యవహారంలో పోలీసులు మధ్యవర్తులుగా వ్యవరించి జేబులు నింపుకొన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- టెక్కలి స్టేషన్‌ పరిధిలో ఒక వైసీపీ నాయకుడి కనుసన్నల్లో అన్ని వ్యవహారాలు సాగిపోతున్నాయి. ఇటీవల ఒక విలువైన భూమి వివాదంలో రౌడీషీటర్‌తో పోలీసులు మంతనాలు సాగించి రెండో వర్గానికి నష్టం జరగకుండా కాపు కాయడం విమర్శలకు తావిచ్చింది.
- ఇటీవల విద్యుత్‌ శాఖ ఉద్యోగి ఒకరు ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో తనకు జరిగిన మోసంపై న్యాయం చేయాలని శ్రీకాకుళంలోని ఒక పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఆయనకు అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్‌ న్యాయం చేయకపోగా చుక్కలు చూపించారు ఆయన పోలీసుల వేధింపు చర్యలకు విసిగిపోయి తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను, ఎస్పీని ఆశ్రయించారు. ఆయనకు నేటికీ న్యాయం జరగలేదు. పైగా ఫిర్యాదు చేసిన పాపానికి ఆయన్ను పదేపదే పోలీసులు స్టేషన్‌కు రావాలని పిలిచి భయపెడుతున్నట్లు సమాచారం.

సహనం కోల్పోయి

జిల్లాలో న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులపై పోలీసులు సహనాన్ని కోల్పోయి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి. గతంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. పలాస-కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో న్యాయం కోసం వచ్చిన ఒక దళితుడిని సీఐ కాలితో తన్నిన సందర్భం వివాదాస్పదమైంది.
- బూర్జ మండలం పాలవలస లక్కుపురంలో ఒక వ్యక్తిపై పోలీసులు దాడికి పాల్పడడంతో గ్రామస్తులు తిరగబడిన సంఘటన చోటుచేసుకుంది.
- వీరఘట్టంలో రెండు చర్చిల నిర్వాహకుల మధ్య వివాదం విషయంలో పోలీసులు తలదూర్చి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోడానికి పరోక్షంగా కారకులయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
- పొందూరులో అక్రమ మద్యం కేసులో స్టేషన్‌కు వచ్చిన ఒక మహిళను ఎస్‌ఐ ఇంటికి రమ్మని ఫోన్‌లో పిలిచిన సంభాషణ పోలీసు శాఖకు అప్పట్లో మచ్చ తెచ్చింది.
- ఇటీవల శ్రీకాకుళంలోని ఒక స్టేషన్‌లో మాస్క్‌ కట్టుకోలేదనే కారణంతో ఇద్దరు యువకులపై పోలీసులు జులుం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
- హైవేకు ఆనుకుని ఉన్న ఒక స్టేషన్‌, నగరం నడిబొడ్డున ఉన్న మరో స్టేషన్‌ నిత్యం జనంతో కిటకిటలాడుతున్నాయి. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, వ్యక్తిగత కేసులపై వచ్చేవారిని కౌన్సెలింగ్‌ల పేరుతో పోలీసులే షెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇసుక ట్రాక్టర్లు తనిఖీల పేరుతో పట్టుకున్న సందర్భంలో కాసులు దండుకోవడం పరిపాటిగా మారింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఎచ్చెర్ల, రణస్థలం పోలీసుస్టేషన్‌ల పరిధిలో వాహన తనిఖీల పేరుతో వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఇటువంటి సంఘటనలు షరామామూలుగా మారుతున్నాయని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్లపై నిఘా పెట్టాలని, కొంతమంది పోలీసుల తీరుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2021-01-18T05:06:33+05:30 IST