40 రోజుల తర్వాత అంతా ఓపెన్‌

ABN , First Publish Date - 2021-06-21T05:09:33+05:30 IST

కరోనా కేసుల సంఖ్య క్రమేణా తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి.

40 రోజుల తర్వాత అంతా ఓపెన్‌
లాక్‌డౌన్‌ సడలింపుతో సంగారెడ్డిలోని ఓ సినిమా థియేటర్‌లో మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో తెరుచుకున్న వ్యాపార, వాణిజ్య రంగాలు

సంగారెడ్డి టౌన్‌, జూన్‌ 20 : కరోనా కేసుల సంఖ్య క్రమేణా తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సినిమా థియేటర్లు, బార్లు, హోటళ్లు, ఆదివారం నుంచి పూర్తిగా తెరుచుకున్నాయి. ఈ మేరకు సినిమా థియేటర్లు, బార్లలో చిన్న చిన్న మరమ్మతులను చేపట్టారు. 40 రోజుల పాటు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులో ఉండడంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా రెండోదశ విజృంభించిన నేపథ్యంలో గత నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. 

కరోనాను కట్టడి చేసేందుకు మే నెల 12 నుంచి 31వ తేదీ వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. ఉదయం 10 గంటల వరకు తక్కువ సమయం ఉండడంతో నిత్యావసర సరుకుల కొనుగోళ్ల కోసం దుకాణాల వద్ద జనం కిక్కిరిసిపోయారు. దీంతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరగడంతో, ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో జూన్‌ 1 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌డౌన్‌ను సడలించారు. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గడంతో ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు ఉద యం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించింది. ప్రస్తుతం కొవిడ్‌ కేసులతో పాటు మరణాలు గణనీయంగా తగ్గడంతో 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం నుంచి సంగారెడ్డి జిల్లాలో వ్యాపార, వాణిజ్య రంగాలు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. 



Updated Date - 2021-06-21T05:09:33+05:30 IST