అంతా ఓకే..! టచ్‌లో ఉండండి..!!

ABN , First Publish Date - 2022-08-19T05:12:58+05:30 IST

ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి బాగుంది. ఒంగోలులో ఇంకా బాగుంది.. కానీ మీరు ఒంగోలులోనే ఉండి పనిచేయాలి. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో దూకుడు పెంచాలి అని ఒంగోలు టీడీపీ ఇన్‌చార్జ్‌ దామచర్ల జనార్దన్‌కు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సూటిగా చెప్పారు. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో ముఖాముఖి సమీక్షలు చేస్తున్న అధినేత గురువారం దామచర్లతో సమీక్ష చేశారు.

అంతా ఓకే..!  టచ్‌లో ఉండండి..!!
దామచర్లతో మాట్లాడుతున్న చంద్రబాబు

దామచర్ల జనార్దన్‌తో చంద్రబాబు 

ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో దూకుడు పెంచండి

ఒంగోలులోనే ఉండి

 పనిచేయండి

ఓటర్ల సవరణ కార్యక్రమంపై దృష్టిపెట్టాలని సూచన 

 (ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి బాగుంది. ఒంగోలులో ఇంకా బాగుంది.. కానీ మీరు ఒంగోలులోనే ఉండి పనిచేయాలి. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో దూకుడు పెంచాలి అని ఒంగోలు టీడీపీ ఇన్‌చార్జ్‌ దామచర్ల జనార్దన్‌కు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సూటిగా చెప్పారు. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో ముఖాముఖి సమీక్షలు చేస్తున్న అధినేత గురువారం దామచర్లతో సమీక్ష చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సాయంత్రం గంటసేపు ఒంగోలు అసెంబ్లీ, అలాగే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఇతర అంశాలపైనా మాట్లాడినట్లు తెలిసింది.

అంతా ఓకే.. టచ్‌లో ఉండాలి

జిల్లా కేంద్రమైన ఒంగోలులో పార్టీ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి.. కానీ మీరు పూర్తికాలం ఒంగోలులోనే ఉండి పనిచేయాల్సిన సమయం వచ్చింది.. బాదుడే బాదుడులో వేగం పెరగాలని, ఓటర్ల సవరణల కార్యక్రమంపై దృష్టిపెట్టాలని దామచర్ల జనార్దన్‌కు బాబు ప్రత్యేకంగా సూచించారు. సమన్వయలోపాన్ని సవరించుకోవాలని కూడా చెప్పినట్లు తెలిసింది. అన్ని స్థాయిల్లోని పార్టీనేతలు, శ్రేయోభిలాషులకు నిత్యం టచ్‌లో ఉంటూ అందరినీ సమన్వయం చేసుకోకపోతే కుదరదని కూడా సూటిగా చెప్పినట్లు తెలిసింది. నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, నిత్యం చేస్తున్న పర్యవేక్షణను దామచర్ల ఆయనకు వివరించారు. స్థానికంగా అధికారపార్టీలో నెలకొన్న వివిధరకాల పరిస్థితులను సద్వినియోగం చేసుకోవటంలో కూడా విజయవంతం అవుతున్నట్లు కూడా చెప్పినట్లు తెలిసింది. సొంత పనులు, వ్యాపారాలు చూసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇకనుంచి పూర్తిగా ఒంగోలులోనే ఉండి పనిచేయక తప్పదని చెప్పినట్లు సమాచారం. తన తండ్రి ఆరోగ్య కారణాలతో కొంతకాలం బయట ఉండాల్సి వచ్చిందని చెప్పిన దామచర్ల కుటుంబసభ్యులతో వచ్చేనెల 1న యూకే వెళ్తున్నానని తిరిగొచ్చి వచ్చేనెల 13 నుంచి ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకునే కార్యక్రమం చేపడుతున్నట్లు దామచర్ల ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.


దర్శి కమిటీకి సహకరించండి

 కాగా మనమెంతో సహకారం ఇచ్చినా దర్శి ఇన్‌చార్జ్‌గా మీరు ప్రతిపాదించిన రమేష్‌ దూరం కావటం ఏమిటని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. అక్కడ పరిస్థితులను జనార్దన్‌ వివరించిన తర్వాత స్థానిక నాయకులు ఎనిమిది మందితో నియోజకవర్గ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపటం జరుగుతుందని అప్పటివరకు ఈ కమిటీ నేతృత్వంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు మీవంతు సహకారం అందించాలని సూచించారు. వైపాలెంలో సీనియర్‌ నాయకుడు డాక్టరు రవీంద్రను పిలిపించుకుని భవిష్యత్తుపై ఆయనకు స్పష్టమైన హామీ ఇవ్వాలని దామచర్ల కోరినట్లు తెలిసింది. అక్కడ ఇన్‌చార్జేగాక జిల్లాలోని మిగిలిన ఇన్‌చార్జ్‌లు కూడా బాగా కష్టపడుతున్నారని, రవీంద్ర విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిని కూడా ముందుగానే నిర్ణయిస్తామని చంద్రబాబు చెప్పగా విషయంలో కొన్ని జాగ్రత్తలను, తన అభిప్రాయాలను జనార్దన్‌ తెలిపారు.


  అందరూ కలిసి పనిచేయాల్సిందే..

 కాగా ఒంగోలు పార్లమెంటు విషయంపై చంద్రబాబు లోతైన సమీక్షే చేసినట్లు తెలుస్తోంది. బాలాజీకి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాం. మీ వైపు నుంచీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అందరూ సమన్వయంతో పనిచేయాల్సిందే. లేదంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నట్లు తెలిసింది. పనిచేయని ఇన్‌చార్జ్‌లను మార్చినట్లే పనిచేయని అధ్యక్షులు ఉన్నా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి మార్చే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన సర్వేలో వచ్చిన సానుకూలతను, పార్టీపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చంద్రబాబు ఈ సందర్భంగా జనార్దన్‌కు వివరించినట్లు తెలిసింది.


Updated Date - 2022-08-19T05:12:58+05:30 IST