అంతా నా ఇష్టం!

ABN , First Publish Date - 2022-07-01T05:39:31+05:30 IST

మండల పరిషత్‌ నిధులతో ప్రకటించిన తాగునీటి బోరుబావుల ఏర్పాటులో నేతల అతి చొరవపై మండలంలో తీవ్ర విమర్శలు తలెత్తాయి. బోరుబావుల ఏర్పాటులో ఓ మండల ప్రజాప్రతినిధి గ్రూపు రాజకీయాలు నడుపుతూ అనుయాయులకు, తన వర్గీయులకు కేటాయిస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు.

అంతా నా ఇష్టం!
వీలుపర్తిలో తాగునీటి బోరుబావి తీయిస్తున్న దృశ్యం


మంజూరు ఒకచోట... తవ్వకాలు నచ్చిన చోట
బోరుబావుల ఏర్పాటులో పక్షపాత ధోరణి
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు

వేపాడ, జూన్‌ 30:
  మండల పరిషత్‌ నిధులతో ప్రకటించిన తాగునీటి బోరుబావుల ఏర్పాటులో నేతల అతి చొరవపై మండలంలో తీవ్ర విమర్శలు తలెత్తాయి. బోరుబావుల ఏర్పాటులో ఓ మండల ప్రజాప్రతినిధి గ్రూపు రాజకీయాలు నడుపుతూ అనుయాయులకు, తన వర్గీయులకు కేటాయిస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇందుకు వీలుపర్తి ఘటనను ఉదహరిస్తున్నారు. ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 వేపాడ మండలం రాయుడుపేట గ్రామ సమీపంలో కన్నంవారి కళ్లాలు పేరుతో మంజూరు చేసిన బోరుబావిని వీలుపర్తి గ్రామ సచివాలయం సమీపంలోనూ, మరో బోరుబావిని పచ్చికూర వారి కళ్లాల వద్ద తీయించడంపై కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పచ్చికూర వారి కళ్లాల వద్ద గ్రామ పంచాయతీ నిధులతో గతంలో బోరుబావి తీయించారని, రెండో బోరుబావి కూడా అక్కడే తీయించడం సరికాదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 చామలాదేవి అగ్రహారం గ్రామానికి కేటాయించిన బోరుబావిని దొరలకొంపల్లో తీయడంపైనా మండిపడుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే బోరుబావుల ఏర్పాటుపై తనకు కనీస సమాచారం తెలియజేయకపోవడం విడ్డూరంగా ఉందని సర్పంచ్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మహిళా సర్పంచ్‌గా తనకు జరిగిన అవమానంపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు, జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తానని సర్పంచ్‌ లీల, గ్రామ పెద్దలు శానాపతి అప్పారావు, కొటాన అర్జునరావు తదితరులు స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఏఈ దేవి వద్ద ప్రస్తావించగా బోరుబావులు వీలుపర్తి గ్రామంలో డ్రిల్లింగ్‌ చేసినట్టు తనకు తెలియదన్నారు. సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పర్యవేక్షణలో తీయించి ఉంటారని, అడిగి తెలుసుకుంటానని చెప్పారు.

 మండలంలోని జాకేరు, అరిగిపాలెం, జగ్గయ్యపేట, చినగుడిపాల తదితర గ్రామాలకు మంజూరు చేసిన తాగునీటి బోరుబావుల సమాచారం కూడా సర్పంచ్‌లకు, ఎంపీటీసీ సభ్యులకు తెలియ జేయకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-07-01T05:39:31+05:30 IST