అంతా జగన్ మాయ.. విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-11T06:29:10+05:30 IST

ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు, జిల్లాలో జగనన్న పాలవెల్లువ అమలుకు పొంతనే లేదు. పాలవెల్లువ పథకం ‘అంతా మాయ’ అనేందుకు పాలసేకరణ తీరే అద్దం పడుతోంది.

అంతా  జగన్ మాయ.. విషయం ఏంటంటే..

అమూల్‌ కోసం ఏపీ డెయిరీ నిర్వీర్యం

అప్పనంగా రూ.కోట్ల ఆస్తులు 

అప్పగింత జిల్లాలో 90 వేల లీటర్ల పాల ఉత్పత్తి

అమూల్‌ సేకరిస్తోంది 7 వేల లీటర్లే

ప్రైవేట్‌ డెయిరీలకు 50 వేల లీటర్లు

ఏపీ డెయిరీ బకాయిలు చెల్లించే దెవరు..?


‘గత పాలకుల ప్రభుత్వ సహకార డెయిరీలు కుదేలయ్యాయి. వాటికి ఆర్థిక పరిపుష్టి కల్పించడమే లక్ష్యంగా అమూల్‌తో కలిసి జగనన్న పాలవెల్లువ పథకం ప్రారంభిస్తున్నాం. పాలకు గిట్టుబాటు ధర, పాడిరైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తాం. తద్వారా మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తారు..’ 

జగనన్న పాలవెల్లువ పథకం 

ప్రారంభ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన చెప్పిన మాటలివి 


ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు, జిల్లాలో జగనన్న పాలవెల్లువ అమలుకు పొంతనే లేదు. పాలవెల్లువ పథకం ‘అంతా మాయ’ అనేందుకు పాలసేకరణ తీరే అద్దం పడుతోంది. అమూల్‌ కోసం ఏపీ డెయిరీ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వీర్యం చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అమూల్‌ సంస్థకు అప్పనంగా రూ.కోట్ల ఆస్తులు అప్పగించేందుకే జగనన్న పాల వెల్లువను తీసుకొచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల ద్వారా ఏపీ డెయిరీ పాలను సేకరించింది. పాడి రైతులకు రూ.కోట్లలో చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందా...? లేక అమూల్‌ చెల్లిస్తుందా...? తెలియని పరిస్థితి. ఏపీ డెయిరీ ద్వారా తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని బాధిత పాడిరైతులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందనలో అర్జీలు సమర్పిస్తున్నారు. కానీ పట్టించుకునే నాథుడే లేడు. ఏపీ డెయిరీకి పాలు రవాణా చేసిన ట్రాన్సపోర్టు నిర్వాహకులు రవాణా చార్జీల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉద్యోగులు సైతం బకాయిపడిన వేతనాలు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. పాడి రైతులు, ట్రాన్సపోర్టు నిర్వాహకులు, ఉద్యోగవర్గాలకు రూ.3 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. జగనన్న పాలవెల్లువ అమలుతో అన్నివర్గాలు రోడ్డున పడ్డాయి. 

అనంతపురం ఆంధ్రజ్యోతి


ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..

జగనన్న పాలవెల్లువను ఆర్భాటంగా ప్రారంభించడంపై చూపిన శ్రద్ధ.. ఆ పథకాన్ని ముందుకు నడిపించడంపై చూపలేదు. పాలవెల్లువ అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జగనన్న పాలవెల్లువను ఐదు నెలల క్రితం కదిరి నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించారు. తొలివిడత.. ఉమ్మడి జిల్లాలో మూడు క్లస్టర్లలోని 300 గ్రామాలను గుర్తించారు. అందులో అనంతపురం, కదిరి, హిందూపురం ప్రాంతాలున్నాయి. ఈ మూడు క్లస్టర్లలో పాలసేకరణ చేపట్టాలి. కదిరి క్లస్టర్‌లోని కదిరి, తలుపుల, గాండ్లపెంట, నల్లచెరువు మండలాల్లోని 60 గ్రామాల నుంచి రోజుకు 7వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. మిగిలిన క్లస్టర్లలోని 240 గ్రామాల్లో ఇప్పటికీ అమూల్‌ ద్వారా పాలసేకరణ చేపట్టలేదు. అమూల్‌ పాలసేకరణ ఎంత నత్తనడకన సాగుతోందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. 


పాలన్నీ ప్రైవేట్‌ డెయిరీలకే..

- అధికారిక గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో రోజుకు 90 వేల లీటర్లు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 7 వేల లీటర్ల పాలను మాత్రమే అమూల్‌ సేకరిస్తోంది. మిగిలిన 83 వేల లీటర్ల పాలు ప్రైవేట్‌ డెయిరీలు సేకరిస్తున్నాయి. గాయత్రి, దొడ్ల, హట్సన, శ్రీజ, అలేఖ్య ప్రైవేట్‌ డెయిరీలకు రోజుకు 50 వేల లీటర్లకుపైగా పాలు వెళ్తున్నాయి. మిగిలిన పాలు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ కేఫ్‌లు, గృహాలకు నేరుగా పాడి రైతులు, వ్యాపారులు అమ్ముతున్నారు. ప్రైవేట్‌ డెయిరీలు, అమూల్‌.. పాలకు ఇచ్చే ధరలో తేడా లేకపోవడంతో అత్యధిక మంది పాడిరైతులు ప్రైవేట్‌ డెయిరీలవైపే మొగ్గు చూపుతున్నారు. 

- ఆవు పాలు లీటరుకు రూ.31 నుంచి రూ.37 వరకు ఉంటోంది. ఫ్యాట్‌ ఎస్‌ఎనఎఫ్‌ 3.5, ఎస్‌ఎనఎఫ్‌ 8.7 ఉన్న (ఎనుములు, ఆవులు) పాలకిచ్చే మొత్తాన్నే చెల్లిస్తున్నారు. ఫ్యాట్‌ 11 ఉంటే లీటరుకు రూ.70 వరకు అమూల్‌ చెల్లిస్తోంది. ప్రైవేట్‌ డెయిరీల నిర్వాహకులు కూడా అమూల్‌ ధరలనే చెల్లిస్తుండటం గమనార్హం. జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకం లక్ష్యం చతికిలపడటానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ అమూల్‌కు పాలుపోసిన పాడిరైతులకు బోనస్‌ చెల్లించలేదు. దీంతో ఆ వర్గాలు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాయి. 


అప్పనంగా రూ.2 కోట్లు..

అమూల్‌ సంస్థ పాలసేకరణ కోసం రూ.2 కోట్ల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. అమూల్‌ పాలసేకరణ కోసం ఒక గ్రామాన్ని ఒక ఏఎంసీయూగా ఏర్పాటుచేశారు. ఒక్కో గ్రామంలో రూ.2.5 లక్షల విలువైన క్యానలు, కంప్యూటర్‌, బ్యాటరీ, అనలైజర్‌ తదితరాలు ఏర్పాటు చేయించారు. దాదాపు 85 గ్రామాల్లో ఈ ఏఎంసీయూలను ఏర్పాటు చేశారు. అయినా, 60 గ్రామాల నుంచే పాలను సేకరిస్తున్నారు. మిగిలిన 25 గ్రామాల్లో యంత్ర పరికరాలు నిరుపయోగంగా మారాయి. 


రూ.కోట్ల ఆస్తుల  అప్పగింత కోసమేనా..?

జగనన్న పాలవెల్లువ పథకాన్ని అమూల్‌కు అప్పగించడం పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీ డెయిరీకి ఉన్న రూ.కోట్ల ఆస్తులను అప్పనంగా అమూల్‌ సంస్థకు అప్పగించేందుకే ఇలా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏపీ డెయిరీ ఆస్తులు రూ.కోట్లలో ఉన్నాయి. జిల్లాలో ఏపీ డెయిరీకి సంబంధించి బల్క్‌మిల్క్‌ యూనిట్‌ భవనాలు (బీఎంసీలు), వాటి పరిధిలోని ఖాళీ స్థలాలు, నాలుగు ఏఎంసీ యూనిట్ల పరిధిలోని భవనాలు, స్థలాలు అమూల్‌ సంస్థ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. అమూల్‌ సంస్థకు పూర్తి అధికారాలను కట్టబెడితే.. ఏపీ డెయిరీ భవనాలు, వాటి పరిధిలోని ఖాళీ స్థలాలన్నీ ఆ సంస్థపరమయ్యే అవకాశాలు ఉన్నాయి. జగనన్న పాలవెల్లువ ద్వారా తమకు పెద్దగా ప్రయోజనం లేదని పాడిరైతులు పెదవి విరుస్తున్నారు. 


కర్ణాటకలో పోసి వస్తున్నాం.. 

ఇంతకు ముందు ప్రభుత్వ డెయిరీకి పాలుపోసి, రెండు వారాలకు రూ.30 వేల వరకూ బిల్లులు తీసుకున్నాం. ఆ డెయిరీని ప్రభుత్వం మూసేసింది. అమూల్‌ మంచి రేట్లు ఇస్తుందని చెప్పింది. ప్రభుత్వం కొనకపోవడంతో కర్ణాటకలోని వైఎనఎస్‌ కోటకు వెళ్లి పాలను పోసివస్తున్నాం. 

- నారాయణమ్మ, పాడిరైతు, కదరంపల్లి, కుందుర్పి మండలం


రెండేళ్ల జీతం ఇవ్వాలి...

పాడిరైతుల నుంచి పాలను సేకరించి, బీఎంసీలు, ఏఎంసీలకు తరలించే ప్రక్రియలో పనిచేసిన ఉద్యోగులకు దాదాపు రెండు సంవత్సరాల వేతనాలివ్వాలి. ఏపీ డెయిరీ పరిధిలోని 47 బీఎంసీలు, ఏఎంసీలు ఉన్నాయి. నాతోపాటు 200 మంది సిబ్బంది పనిచేశారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు వేతనాలు రావాల్సి ఉంది. ఏపీ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్‌ జీతాలను చెల్లించాలి.  

- ఓబిలేసు, శెట్టూరు డెయిరీ పూర్వ సూపర్‌వైజర్‌

Updated Date - 2022-06-11T06:29:10+05:30 IST