అంతా మాయాజాలం

ABN , First Publish Date - 2022-09-27T05:13:31+05:30 IST

స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన గ్రేట్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీలో మాయాజాలం చోటుచేసుకుంది. వీడియో ఇంటర్వ్యూ పేరుతో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతల సిఫార్సులకు అనుగుణంగా ఎంపికలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. రాత పరీక్షకు సంబంధించిన కీని విడుదల చేయకుండా, ఫలితాలు ప్రకటించకుండా ఐదు మార్కుల ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేయడం ఆరోపణలకు ఊతం ఇస్తోంది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 142 సూపర్‌ వైజర్‌ పోస్టుల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకోసం ఈనెల 18న రాత పరీక్ష నిర్వహించారు.

అంతా మాయాజాలం
పోస్టుల కోసం పరీక్ష రాసి బయటకు వస్తున్న అభ్యర్థులు

అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులకు 

ఎంపిక విధానంపై అనుమానాలు 


కీ లేదు.. మార్కులూ ప్రకటించలేదు

ఉన్నతాధికారుల నుంచి 

పీడీలకు 254 మంది అభ్యర్థుల పేర్లు

వారు ఇంగ్లిష్‌ మాట్లాడుతున్న 

వీడియోలను తీసి అప్‌లోడ్‌

దీన్ని చూసి మార్కులు 

వేయనున్న త్రీమన్‌ కమిటీ 

చక్రం తిప్పిన అధికార పార్టీ నేతలు

కోర్టుకెళ్లే ప్రయత్నంలో అభ్యర్థులు

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

 స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన గ్రేట్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీలో మాయాజాలం చోటుచేసుకుంది.  వీడియో ఇంటర్వ్యూ పేరుతో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతల సిఫార్సులకు అనుగుణంగా ఎంపికలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. రాత పరీక్షకు సంబంధించిన కీని విడుదల చేయకుండా, ఫలితాలు ప్రకటించకుండా ఐదు మార్కుల ఇంటర్వ్యూకు  అభ్యర్థులను ఎంపిక చేయడం ఆరోపణలకు ఊతం ఇస్తోంది.  ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 142  సూపర్‌ వైజర్‌ పోస్టుల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకోసం ఈనెల 18న రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 45 మార్కులు ఉండే ఈ పరీక్షకు 5,640మంది అభ్యర్థులు హాజరయ్యరు. 


మళ్లీ ఇంటర్వ్యూ విధానం 

రాత పరీక్ష నిర్వహించిన అధికారులు ఇంటర్వ్యూకు సిద్ధమవడంతో అనేక అనుమానాలు ప్రారంభమయ్యాయి. రాత పరీక్షలో ఎంత ప్రతిభను చాటుకున్నా ఇంటర్వ్యూలో సిఫార్సులు, ఆమ్యామ్యాలకు అనుగుణంగా అధికారులు ఎవరికి మార్కులు వేస్తే వారికే ఉద్యోగం లభిస్తుంది. ఈ విషయాన్ని గమనించి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబునాయుడు అనేక ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలకు సంబంధించి ఇంటర్వ్యూల విధానాన్ని ఎత్తేశారు. కీలకమైన ఉపాధ్యాయుల బదిలీలకు కౌన్సెలింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం అంగన్‌వాడీ గ్రేడ్‌-2సూపర్‌వైజర్‌ పోస్టుల ఎంపికలో ప్రభుత్వం తిరిగి ఇంటర్వ్యూల విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది.


మార్కులు వెల్లడించకుండానే.. 

అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల విషయంలో రాత పరీక్షకు సంబంధించి ప్రభుత్వం కనీస విధివిధానాలను పాటించలేదన్న విమర్శలున్నాయి. 45 మార్కులకు తొలుత రాత పరీక్ష నిర్వహించారు. మరో 5 మార్కులను ఇంటర్వ్యూకు కేటాయించారు. సాధారణంగా అయితే రాత పరీక్షకు సంబంధించి కీ విడుదల చేస్తారు. అలా కాకపోయినా  పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చింది వెల్లడిస్తారు. అందులో ప్రథమ స్థానం నుంచి తాము నిర్థారించుకున్న పర్సంటేజీ వరకు అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. అయితే ఇక్కడ అవేమీ జరగలేదు. కీ విడుదల కాలేదు, మార్కుల లిస్టూ వెల్లడి కాలేదు. కానీ ఆయా మండలాల వారీ పరీక్షకు హాజరైన అంగన్‌వాడీ టీచర్లలో కొందరికి మీరు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు అందుకు సిద్ధం కండని సమాచారం పంపారు.


ఇంటర్వ్యూలో తిరకాసు 

అభ్యర్థుల ఇంటర్వ్యూను కేవలం ఇంగ్లిష్‌పై ఉన్న అవగాహనపై మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు 5 మార్కులు కేటాయించింది. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల వీడియో వాయిస్‌ను ఎక్కడికక్కడ సీడీపీవోలు రికార్డుచేసి పంపిస్తే త్రిమన్‌ కమిటీ దానిని పరిశీలించి మార్కులు వేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. టెక్నాలజీని వినియోగించటం వరకు ఓకే కానీ అభ్యర్థితో నేరుగా మాట్లాడితే వారి శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. అలా కాకుండా వీడియో ఇంటర్వ్యూను చూసి మార్కులు వేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అటు రాత పరీక్ష ఫలితాలను ప్రకటించకుండా, ఇటు ఇంటర్వ్యూను రికార్డెడ్‌ వీడియో విధానంలో నిర్వహించటం ద్వారా అధికార పార్టీ నేతల సిఫార్సులకు అనుగుణంగా సూపర్‌వైజరు పోస్టులు భర్తీ చేసే ఎత్తుగడలో ప్రభుత్వం ఉందనే విషయం తేటతెల్లమవుతోంది.  ‘సందట్లో సడేమియా’ అన్నట్లు కిందిస్థాయిలో వసూళ్ల కార్యక్రమం కూడా జరిగింది.


254 మంది అభ్యర్థుల వాయిస్‌ల రికార్డు

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు  ఇప్పటికే 254 మంది అభ్యర్థుల పేర్లను ఆయా జిల్లాల ప్రాజెక్ట్‌ డైరెక్టర్లకు పంపించారు. వారి వివరాలను పీడీలు సీడీపీవోలకు పంపించారు.  ఈ పేర్లు కలిగిన అభ్యర్థులు ఇంగ్లీషు మాట్లాడుతున్న వీడియోలను తీసి సీడీపీవోలు   అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియోలను చూసి ఇంటర్వ్యూ కమిటీ ఐదు మార్కులు వేయాల్సి ఉంది. అందుకోసం కలెక్టర్‌ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో డీఈవో, ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐవో, వృత్తి విద్యాకోర్సుకు సంబంధించిన అధికారి ఉన్నారు. అధికారపార్టీ శాసనసభ్యులు, ఇన్‌చార్జిలు ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా పాలకపక్ష పెద్దలు ఈ జాబితాలు పంపారన్న విమర్శ ఉంది.  దీంతో తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్న అభ్యర్థులు, పలు సంఘాల వారు న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.



Updated Date - 2022-09-27T05:13:31+05:30 IST