అంతా జగన్మాయ!

ABN , First Publish Date - 2021-12-27T07:33:04+05:30 IST

అంతా జగన్మాయ!

అంతా జగన్మాయ!

ఓటీఎస్‌ పేరుతో ఘరానా మోసం

లేని అప్పులు ఉన్నట్టుగా చూపిస్తూ వసూళ్లు

పేదలకిచ్చిన రుణాలు తీర్చేసిన గత ప్రభుత్వాలు

బ్యాంకర్లు వేధిస్తారనే హౌసింగ్‌ ద్వారా రుణం 

ఇప్పుడు హౌసింగ్‌ నుంచే వేధింపులు 

పేదల చేతికి ఉపయోగంలేని పేపర్లు 

ఇప్పటికే అనేక చేతులు మారిన ఇళ్లు 

రెట్టింపు కట్టించుకుంటున్న ప్రభుత్వం 

ఇప్పుడు యజమానికి హక్కులు వస్తాయని, 

ఇళ్లు అమ్ముకోవచ్చంటూ కొత్తగా కలరింగ్‌ 

భారీ వడ్డీ వేసి.. మాఫీ అంటూ ప్రచారం 

మొత్తం చేయొచ్చుగా అంటున్న పేదలు


‘మీరు నెల నెలా రూ.3వేల చొప్పున 20ఏళ్ల పాటు కడుతూ పోవాలట... లంచాలు తీసుకునేది చంద్రబాబు. ఆ లంచాలను మీరు బ్యాంకులకు కట్టాలట. ఇచ్చిన ఫ్లాట్లను ఎవరూ వద్దనొద్దు. ఇస్తే బంగారంలా తీసుకోండి. ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... జగన్‌ అనే నేను మీకు మాటిస్తున్నా. ఆ ఫ్లాట్లపై నెలనెలా రూ.3వేలు చొప్పున కట్టే మొత్తం డబ్బంతా మాఫీ చేస్తానని మాటిస్తున్నా’... ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీ ఇదీ. అయితే ఇప్పుడు ఓటీఎస్‌ పేరిట జరుగుతున్నదంతా జగన్మాయే...! 


సాహసం చేయని గత సీఎంలు

పక్కా ఇళ్లకు రుణాలిచ్చే విధానం ఎన్టీఆర్‌ హయాంలో మొదలై కిరణ్‌కుమార్‌ రెడ్డి వరకూ కొనసాగింది. కానీ అప్పట్లో ఏ సీఎం కూడా పాత అప్పులు బలవంతంగా వసూలు చేసే సాహసం చేయలేదు. వైఎస్‌ హయాంలో పెద్దఎత్తున ఇందిరమ్మ ఇళ్లు కట్టినా ఏనాడూ రుణాల వసూలుపై దృష్టిపెట్టలేదు. ఆ నగదు వస్తే ప్రభుత్వానికి లాభమేనంటూ మధ్యలో కొందరు హౌసింగ్‌ ఎండీలు ప్రతిపాదించినా అప్పటి సీఎంలు తిరస్కరించారు. స్వల్ప మొత్తాలకు పేదలపై ఒత్తిడి చేయడం సరికాదని, కడితే కట్టించుకోండి, లేకపోతే వదిలేయండి... అని స్పష్టంగా చెప్పేశారు. రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా జగన్‌ ఇప్పుడు పేదల గొంతుపై కత్తి పెట్టి మరీ వసూళ్లకు దిగారు. పైకి స్వచ్ఛందం అని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఓటీఎస్‌ నిర్బంధంగానే అమలవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

పక్కా ఇళ్ల పేరుతో జరుగుతోన్న మాయ ఇది. రంగు పేపర్లు చేతిలో పెట్టి వాటితోనే జనం జీవితాలు మారిపోతాయంటూ చేస్తోన్న ఘరానా మోసం ఇది. ప్రభుత్వానికి ఖజానా నిండటం, అధికార పార్టీకి రాజకీయ ప్రచారం తప్ప పేదలకు పైసా ఉపయోగం లేని నాటకం ఇది. దానికే వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’- వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అని నామకరణం చేసింది. పేదలకు కొత్తగా ఇళ్లు కట్టిస్తున్నట్లు, స్థలాలు, రాయితీలు ఇస్తున్నట్లు ఎక్కడలేని ఆర్భాటం చేస్తోంది. కానీ వారికి అవన్నీ గత ప్రభుత్వాలే చేసేశాయి. బ్యాంకులైతే పేదలకు రుణాలు ఇవ్వవని, ఒకవేళ ఇచ్చినా తిరిగి కట్టించుకునేప్పుడు వేధింపులకు దిగుతాయన్న ఆలోచనతో గృహనిర్మాణ శాఖే రుణాలు సమీకరించి, పేదలకు అప్పుగా ఇచ్చింది. అందుకోసం తీసుకున్న ప్రతి రూపాయీ గత ప్రభుత్వాలు తిరిగి చెల్లించేశాయి కూడా. ఎప్పుడో తీరిపోయిన అప్పుల మాటున వసూళ్లకు దిగడమే పేదలకు జగన్‌ సర్కారు చేస్తోన్న భారీ మేలు. హౌసింగ్‌ కార్పొరేషన్‌కు పాత ఇళ్లకు సంబంధించి అప్పులేవీ లేకపోయినా, జనం ముక్కుపిండి వసూలు చేయడాన్ని జగన్మాయ అని కాక ఇంకేమనాలి! 


దేనికోసం ఈ వసూళ్లు? 

సాధారణంగా పేదలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, రుణసంస్థల నుంచి ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. తిరిగి వాటిని ప్రభుత్వమే చెల్లిస్తుందనే గ్యారెంటీతో ఆ రుణాలను సమీకరిస్తాయి. హౌసింగ్‌ కార్పొరేషన్‌ కూడా 1983 నుంచి పేదలకు రుణాలు ఇచ్చేందుకు హడ్కో, బ్యాంకుల నుంచి అప్పు లు చేస్తూ వచ్చింది. వాటిని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తీర్చేశాయి. ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నట్లుగా మొత్తం అప్పులు రూ.16వేల కోట్లు అయితే వాటికి సంబంధించి సర్కారు చెల్లించాల్సింది రూ.100 కోట్లే. అయినా ఇప్పుడేదో వాటిని వెంటనే చెల్లించేయాలి అన్నట్టుగా హడావిడిగా వసూళ్లకు దిగింది. పోనీ ఇలా వసూలు చేసిన నగదును తిరిగి హౌసింగ్‌ ప్రాజెక్టులకే ఖర్చు చేస్తారా అంటే అదీ లేదు. ఇతర అవసరాలకు మళ్లించడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇంటిని వాస్తవ లబ్ధిదారు నుంచి కొని ఉంటే, కొనుగోలు చేసినవారు రెట్టింపు నగదు చెల్లించాలని ఓటీఎ్‌సలో ప్రభుత్వం నిబంధన విధించింది. అంటే ఇళ్లను అమ్ముకోవడాలు, కొనుక్కోవడాలు ఇప్పటికే జరిగిపోయాయి. కానీ ఇప్పుడు డబ్బు కడితే కొత్తగా హక్కులు వస్తాయంటూ ప్రచారం చేస్తోంది. వాస్తవానికి ఇప్పటికే అమ్ముకోవాలనుకున్నవారు చాలావరకు ఆ పని చేసేశారు. ఎక్కువ మందికి అసలు ఇల్లు అమ్ముకునే ఆలోచనే లేదు. అయినా ఇప్పుడు ‘మీ ఇల్లు అమ్ముకొనే హక్కు లభిస్తుంది’ అంటూ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియకు ప్రభుత్వం తెర తీసింది. అసలు ఇప్పటివరకూ అమ్మకాలకు అవకాశం లేదనుకుంటే వాస్తవ లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసినవారిని అనర్హులుగా తేల్చాలి. కానీ వారినుంచి రెట్టింపు వసూలు చేస్తున్నారు. 


గతంలో వడ్డీ మాఫీ 

ఓటీఎస్‌ పథకం ఇప్పుడే కొత్తగా కనిపెట్టినట్టు వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ గతంలోనూ అనేకసార్లు ఓటీఎ్‌సను గృహనిర్మాణ శాఖ అమలుచేసింది. ప్రతిసారీ వడ్డీ మాఫీ చేసి అసలు రుణాన్ని చెల్లిస్తే వారిని రుణవిముక్తులుగా ప్రకటించింది. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాలను తీసుకుంటే 1983-84లో రూ.3వేలు, 1986 నుంచి 1994 వరకు రూ.4వేలు, 1994-95లో రూ.5వేలు, 1995 నుంచి 1998 వరకు రూ.7వేలు, 1998 నుంచి 2003 వరకు రూ.10వేలు చొప్పున రుణాలు ఇచ్చింది. ఆ తర్వాతే ఇళ్లకు ఇచ్చిన రుణాలు రూ.10వేలు దాటాయి. కానీ గత ప్రభుత్వాల్లో అమలుచేసిన ఓటీఎ్‌సల్లో అసలు మాత్రం వసూలు చేసి రుణవిముక్తుల్ని చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం అప్పట్లో రూ.3వేలే తీసుకున్నప్పటికీ దానికి వడ్డీపై వడ్డీ వేసి ఆ రూ.3వేలనే రూ.30వేలుగా చూపించి అందులో రూ.10వేలు కడితే సరిపోతుందని, రూ.20వేలు మాఫీ చేస్తున్నామంటూ మాయ చేస్తోంది.

Updated Date - 2021-12-27T07:33:04+05:30 IST