అంతా అక్రమమే!

ABN , First Publish Date - 2022-06-28T05:23:50+05:30 IST

ధర్మవరం రూరల్‌ పరిధిలోని పలు గ్రామాల్లో రియల్‌ వ్యాపారం ఊపందుకుంది.

అంతా అక్రమమే!
రేగాటిపల్లి సమీపంలో అక్రమలేఔట్‌

ధర్మవరం- పుట్టపర్తి రహదారిలో అక్రమ లేఔట్లు!

ఆదాయం కోల్పోతున్న పంచాయతీలు

ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి

కొత్తజిల్లా సాకుతో రూ.కోట్లలో వ్యాపారాలు

అక్రమార్కులకు ‘అధికార’ పార్టీ నేతల అండ



కొత్త జిల్లా ఏర్పాటుతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. లక్షల విలువైన భూములు రూ.కోట్లలోకి వచ్చి చేరాయి. ఈ క్రమంలో పుట్టపర్తి, ధర్మవరం పట్టణాలతో పాటు చుట్టు పక్కల మండలాల్లో అక్రమ లేఔట్లకు రియల్‌ వ్యాపారులు తెరలేపారు. ల్యాండ్‌ కన్వర్షన లేకుండానే రియల్టర్లు అక్రమ లేఔట్లు వేసేస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల రాబడికి, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ‘లేఔట్స్‌ రెగ్యులేషన స్కీం’ తీసుకొచ్చిన వీరు స్పందించడం లేదు. లేఔట్లు వేస్తున్న వారికి రాజకీయ అండదండలు ఉండటంతో సంబంధిత రెవెన్యూ అధికారులు సైతం ఏమీ చేయలేని నిస్సహయస్థితిలో ఉన్నారు.


(ధర్మవరంరూరల్‌, జూన27)


 ధర్మవరం రూరల్‌ పరిధిలోని పలు గ్రామాల్లో రియల్‌ వ్యాపారం ఊపందుకుంది. ధర్మవరం మున్సిపాలిటీ చుట్టూ 10 కిలోమీటర్ల మేర రియల్‌ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాట్లు వేసి విక్రయాలు చేసేస్తున్నారు. మధ్యవర్తులను ఏర్పాటుచేసుకుని రైతుల నుంచి తక్కువ ధరకు వ్యవసాయభూములు కోనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా మార్చి కోట్లు గడిస్తున్నారు. పంచాయతీ, అహుడా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా లేఔట్లు వేసి విక్రయదారులకు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలను సంపాదించుకుంటున్నారు. ఇంత దర్జాగా అక్రమ లేఔట్లు వేస్తున్నా కనీసం అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘చేసుకున్నోడికి చేసుకున్నంత’ రీతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమ లేఔట్ల వ్యవహరం ధర్మవరం మండలం చుట్టుపక్కల గ్రామాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టి విచ్చలవిడిగా లేఔట్లు వేసుకుని విక్రయిస్తూ అక్రమ సంపాదనకు తెరలేపారు.


పుట్టపర్తికి వెళ్లే రహదారికి ఎక్కువ


ధర్మవరం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధానరహదారిలో ఎక్కువగా రియల్‌వ్యాపారం జోరుగా సాగుతోంది. వీటికి తోడు అధికారపార్టీ నాయకులు వత్తాసు పలకడంతో ఇష్టానుసారంగా లేఅవుట్లు వేసి విక్రయాలు చేస్తున్నారు. ప్రధానంగా పోతులనాగేపల్లి సమీపంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పోతులనాగేపల్లి పొలం సర్వేనంబర్‌ 64, 132లో అక్రమ లేఔట్లు వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పోతులనాగేపల్లి పొలంలో 28,29,33 సర్వే నంబర్లలో  రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇంటి పట్టాలను అందజేసింది. ఇదే ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు ఈ జగనన్న కాలనీల సమీపంలో అక్రమంగా లేఔట్లు వేసి ఽరెట్టింపు ధరలకు  ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. ధర్మవరం చుట్టు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎకరా భూమి కొనాలన్న రూ.2 కోట్లు నుంచి రూ.10 కోట్ల వరకు ధర పలుకుతోంది. సెంటు భూమి కొనాలన్న రూ.4 నుంచి రూ.10లక్షల వరకు పలుకుతోంది. ధర్మవరం చుట్టూ ఆయాగ్రామాల్లో  40నుంచి 50 దాకా అక్రమ లేఔట్లు వెలిశాయి. అధికార పార్టీ అండదండతో నాయకులు రియల్‌ వ్యాపారులతో కుమ్మక్కై అక్రమ లేఔట్ల ద్వారా కోట్లు గడిస్తున్నారు. అదేవిధంగా కుణుతూరు, గొల్లపల్లి, తుమ్మల రోడ్డు, రేగాటిపల్లి సమీపంలో, చిగిచెర్ల, గొట్లూరు, నాగలూరు గ్రామాల పరిధిలోని భూముల్లో అక్రమ లేఔట్లు భారీగా ఏర్పడ్డాయి. అధికారపార్టీ అండదండలతో రియల్టర్లు రెచ్చిపోయి వ్యవసాయభూముల్లో అక్రమ లేఔట్లు వేసి విక్రయాలు జరుపుతున్నారు.  


దర్జాగా అమ్మేస్తున్నారు. 


భూమిని లేఔట్‌గా మార్చాలంటే ముందుగా ఆర్డీఓకు దరఖాస్తు చేసుకుని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా(ల్యాండ్‌ కన్వర్షన) మార్పు చేయాలి. ఇందుకోసం ప్రభుత్వానికి 5 శాతం డబ్బు చెల్లించాలి. అనంతరం అహుడా, పంచాయతీ అధికారులను సంప్రదించాలి. లేఔట్లలో ప్రధాన రహదారి 40 అడుగులు, మిగిలిన రోడ్డు 30 అడుగులు వెడల్పు వేసి భూమిలో 10 శాతం భూమిని ప్రజాప్రయోజనాల దృష్ట్యా అహుడాకు కేటాయించిన తర్వాతే లేఔట్లు వే యాల్సి ఉంటుంది. తాగునీటి సరఫరా కోసం పంచాయతీకి, వి ద్యుత స్తంభాల ఏర్పాటుకు ట్రాన్సకోకు నిర్ధేశించిన రుసుము కూడా చెల్లించాలి. నిబంధనల మేరకు అహుడాకు భూమితో పాటు ఫీజు చెల్లిస్తేనే అధికార లేఔట్‌ అవుతుంది. అలాంటి లే ఔట్లలో స్థలాలు కొని ఇళ్లు కట్టుకునే వారికి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. అంతభూమి ఇవ్వడానికి ఇష్టపడనని రియల్టర్లు రాజకీయ అండతో 15-20 అడుగుల వెడల్పుతో రోడ్లు వేసి అక్రమ లేఔట్లలో విక్రయాలు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం లేఔట్‌ అప్రూవల్‌ తీసుకుంటే ఓపన సైట్‌కు, రోడ్ల కోసం సరాసరి 35-40 శాతం భూమి ప్రభుత్వానికి కేటాయించాలి. కానీ అక్రమ లేఔట్లలో రియల్టర్లు 20 అడుగుల రోడ్డును వేసి అహుడాకు భూమిని కేటాయించకుండా  ప్లాట్లు వేసి దర్జాగా విక్రయిస్తున్నారు.


నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం

-విజయ్‌భాస్కర్‌, ఎంపీడీఓ, ధర్మవరం


మండలంలోని ఏయే పంచాయతీల్లో అక్రమలేఔట్లు ఉన్నాయో వాటిపై ఆయా గ్రామపంచాయితీ సెక్రటరీల ద్వారా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం. ఇటీవలే మండలానికి ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నాను. అక్రమ లేఔట్లపై దృష్టి సారిస్తాను. అనుమతులు లేకుండా వేసిన లేఔట్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటాం. 



Updated Date - 2022-06-28T05:23:50+05:30 IST