అంతా ఆయనే..!

ABN , First Publish Date - 2022-09-27T05:06:49+05:30 IST

సబ్‌ డివిజన పరిధిలో ఏదైనా తన కనుసన్నల్లోనే జరగాలి..! ఎవరిపై కేసు నమోదు చేయాలి.. ఎవరిని చూసీ చూడనట్లు వదిలేయాలి.. ఎవరిని కౌన్సెలింగ్‌కు పట్టుకురావాలి.. ఇవన్నీ ఆయన చెబుతారు.

అంతా ఆయనే..!

-కనుసన్నల్లో కేసులు.. సెక్షనలు.. కౌన్సెలింగ్‌ 

- సెల్‌ఫోన్లు అప్పగించాకే కలిసేందుకు వీలు

- కుర్చీలు ఉన్నా.. నిలబడి మాట్లాడాల్సిందే..  

- సబ్‌ డివిజన పరిధిలో డీఎస్పీ నియంతృత్వం


  తాడిపత్రి, సెప్టెంబరు 26: సబ్‌ డివిజన పరిధిలో ఏదైనా తన కనుసన్నల్లోనే జరగాలి..! ఎవరిపై కేసు నమోదు చేయాలి.. ఎవరిని చూసీ చూడనట్లు వదిలేయాలి.. ఎవరిని కౌన్సెలింగ్‌కు పట్టుకురావాలి.. ఇవన్నీ ఆయన చెబుతారు. ఎంతో ధైర్యంగా అధికార పార్టీకి అండగా నిలుస్తున్న ఆయన.. సొంత శాఖలోని కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి తనను కలిసేందుకు వస్తే మాత్రం భయపడుతున్నారు..! ‘సీఐ.. ఎస్‌ఐ.. ఎవరైనా సరే.. నా వద్దకు వచ్చేటప్పుడు సెల్‌ఫోనలను బయటే అప్పగించి రండి..’ అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ వద్ద ఉండే సిబ్బంది దీన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. కొన్ని రకాల ఆదేశాలు ఇచ్చేటప్పుడు ఎవరైనా వీడియో, ఆడియో రికార్డు చేస్తారని డీఎస్పీ చైతన్య ఇలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారని ఆ శాఖవారు అంటున్నారు. ‘డీఎస్పీ సర్‌ని కలవాలా..? సెల్‌ఫోనను మాకు అప్పగించి.. వెళ్లు..’ అని సిబ్బంది ఖరాకండిగా చెబుతారని కొందరు వాపోతున్నారు. 


నిలబడాల్సిందే..


   పోలీసు శాఖలో సంస్కరణలో భాగంగా.. ఫిర్యాదు చేసేందుకు వచ్చినవారిని గౌరవించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. కూర్చోబెట్టి మాట్లాడించాలని పదే పదే సూచిస్తుంటారు. సమీక్షలు నిర్వహించే సమయంలో ఎస్పీ, ఆ పైస్థాయి అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటారు. కానీ తాడిపత్రి సబ్‌ డివిజనలో ఇది అమలు కావడం లేదు. డీఎస్పీ చైతన్యను కలిసేందుకు వెళ్లినవారు నిలబడాల్సిందే..! అక్కడ కుర్చీలు ఉన్నా.. కూర్చొనే అవకాశాలు ఉండవు. నిల్చునే తమ బాధను చెప్పుకోవాలి. ఇదే పద్ధతిని సబ్‌ డివిజనలోని సర్కిల్‌ పోలీ్‌సస్టేషన్లు, మండల పోలీస్‌ స్టేషన్లలో అమలవుతోంది. గతంలో ఎన్నడూలేనిది డీఎస్పీ చైతన్య వచ్చాక ఇటీవల నిలబడే విధానం అమలులోకి వచ్చింది. 


వేచి చూడాల్సిందే..


డీఎస్పీ కార్యాలయానికి వెళ్లేవారు ఎంతసేపైనా వేచిచూడాల్సిందే అన్న ప్రచారం ఉంది. నిమిషాలు.. గంటలైనా తప్పదని బాధితులు అంటున్నారు. ఎదురుగా డీఎస్పీ ఒంటరిగా కనిపిస్తున్నా.. ‘ఎవరితోనో మాట్లాడుతున్నాడు.. మీటింగ్‌లో ఉన్నాడు’ అని సిబ్బంది బుకాయిస్తారని వాపోతారు. ‘అదే వైసీపీవారు వెళితే వెంటనే లోపలికి అనుమతిస్తారు. వారి సమస్య పరిష్కారానికి వెంటవెంటనే ఫోన్లు వెళతాయి..’ అని చెబుతున్నారు. తాడిపత్రి పట్టణంలోని నవరంగ్‌ టాకీస్‌ వద్ద వైసీపీకి చెందిన కాంట్రాక్టర్‌  నిబంధనకు విరుద్ధంగా పనులు చేస్తున్నాడని డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు  కొన్ని రోజుల క్రితం టీడీపీ కౌన్సిలర్లు వెళ్లారు. కార్యాలయంలోనే ఉన్న డీఎస్పీని కలిసేందుకు గంటకుపైగా వేచి ఉన్నారు. సిబ్బందికి  పలుమార్లు చెప్పి పంపించినా ఫలితం కనిపించలేదు. దీంతో నిరాశతో, పనులు జరుగుతున్న ప్రాంతానికి తిరిగి వెళ్లారు. వీరు వెళ్లిన కొద్దిసేపటికే పోలీసులు అక్కడకు చేరుకుని.. అడ్డుకున్నారు. 


 టీడీపీ వారి ఫోనలు ఎత్తడం లేదు: జేసీపీఆర్‌


  తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఫోన చేస్తే.. లిఫ్ట్‌ చేయవద్దని, పొరపాటున లిఫ్ట్‌ చేసినా మాట్లాడకుండా డిస్‌కనెక్ట్‌ చేయండి అని డీఎస్పీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై ఆయన ఎస్పీ ఫక్కీరప్పకు పదిరోజుల క్రితం వినతిపత్రం అందజేశామని, ఇప్పటికీ స్పందన లేదని అన్నారు. వైసీపీవారు దాడులు చేసినా, ప్రాణాపాయం కలిగినా టీడీపీ మద్దతుదారులను పట్టించుకోరా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీవారు వ్యక్తిగతంగా రక్షణ ఏర్పాటు చేసుకోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు కేవలం వైసీపీవారి ఆలనాపాలన చూసేందుకేనా అని విమర్శించారు. 


కుమలిపోతున్న సిబ్బంది


సబ్‌ డివిజన పరిధిలో డీఎస్పీ అండ చూసుకుని కొందరు కిందిస్థాయి అధికారులు సిబ్బందిని టార్గెట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు అనుకూలమైన అధికారులు చెప్పే చాడీలను పరిగణనలోకి తీసుకుని వేధిస్తారని బాధితులు వాపోతున్నారు. అధికారులకు అనుకూలంగా ఉంటే ఒకటి, లేకుంటే మరొకటి అన్నరీతిలో సిబ్బంది పరిస్థితి ఉంది. చాలామంది బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. విషయం బయటకు పొక్కితే క్రమశిక్షణ పేరుతో శాఖపరమైన చర్యలు ఉంటాయని భయపడుతున్నారు. ఇప్పటికే కొందరిని వీఆర్‌కు, మారుమూల పోలీ్‌సస్టేషన్లకు డీఎస్పీ పంపించారి ఆరోపనలు ఉన్నాయి. చాలామంది అన్నింటినీ దిగమింగుకొని డ్యూటీ చేస్తున్నారు. భరించలేని కొందరు అనారోగ్యం పేరిట సెలవులో వెళుతున్నారని సమాచారం.


ఇదీ పరిస్థితి..


సబ్‌ డివిజనలో శాఖ పరిధిలో ఏం జరిగినా బయటకు పొక్కకూడదు. మీడియాకు తెలిస్తే.. సంబంధిత అధికారులదే బాధ్యత. ఏదైనా తనద్వారానే జరగాలి. మీడియాకు తానే చెప్పాలి. సీఐ లు, ఎస్‌ఐలకు డీఎస్పీ నుంచి ఈ మేర కు ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా రాజకీయనేపథ్యం ఉన్న గొడవల విషయంలో ఇది కఠినంగా అమలు అవుతోందని సమాచారం. ఇత ర సంఘటనల గురించి పెద్దగా పట్టించుకోరని, కానీ అధికార, ప్రతిపక్షాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ డీఎస్పీ ఆదేశాలు మాత్రమే అమలు అవుతాయని అంటున్నారు. కొందరు సీఐలు, ఎస్‌ఐలను ఏదైనా కేసు గురించి విలేకరులు అడిగితే.. తమ పరిధిలో లేదని, కావాలంటే డీఎస్పీని సంప్రదించండి అని చెబుతున్నారు. తమను వివరాలు అడిగిన విషయం కూడా బయట పెట్టొదన్ని కోరుతున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


Updated Date - 2022-09-27T05:06:49+05:30 IST