ఉన్నదంతా దైవమే!

ABN , First Publish Date - 2020-03-04T07:38:57+05:30 IST

అందరిలోనూ దైవాన్ని చూడగలిగితే, అదే దివ్యత్వం. అన్నిటినీ ప్రేమించగలిగితే, అదే జ్ఞాన స్పర్శ. స్వార్థం, సంకుచితం ఎరుగని సువిశాలభూమిక ప్రేమ. మోక్షానికి అందరూ అర్హులే. కాకపోతే సాధనతో అర్హతను సాధించుకోవాలి అంతా...

ఉన్నదంతా దైవమే!

అందరిలోనూ దైవాన్ని చూడగలిగితే, అదే దివ్యత్వం. అన్నిటినీ ప్రేమించగలిగితే, అదే జ్ఞాన స్పర్శ. స్వార్థం, సంకుచితం ఎరుగని సువిశాలభూమిక ప్రేమ. మోక్షానికి అందరూ అర్హులే. కాకపోతే సాధనతో అర్హతను సాధించుకోవాలి అంతా బ్రహ్మమైనపుడు అందరూ బ్రహ్మమే. దైవం, ప్రకృతి, పదార్థం, శక్తి.. ఏ పేరుతో అనుకున్నా ఉన్నదొకటే. దర్శించగలిగితే ఆత్మ తప్ప అన్యం లేదు. కనబడుతున్న దానిని ప్రపంచమని, కనబడనిదాన్ని దైవమనీ అంటున్నాం. కానీ ఉన్నదంతా దైవమే. తాడుకి రెండు కొసలున్నట్లు, విజ్ఞానం, ప్రజ్ఞానం ఉన్నయ్‌.


రెండిటినీ సమన్వయం చేసుకోవడమే సాధన. కదిలేదంతా కనపడుతున్నది. కదిలించేది కనబడటం లేదు. కనబడటం లేదు కనుక, లేదనుకోరాదు. కనబడుతున్నదంతా శాశ్వతంగ అనుకోవటం అజ్ఞానమే. కడలిలోనే కెరటాలున్నయ్‌. అవి సముద్రం కంటే భిన్నం కావు. స్థితి, గతి, రూపం, నామం భిన్నంగా కనబడుతున్నయ్‌. అంతే! అసమత్వమే సృష్టి. వైరుధ్యమే ప్రకృతి. ఈ సత్యాన్ని గ్రహించగలిగితే, యాతనలుండవు. జరుగుతున్నదాన్ని అంగీకరించడం, సాక్షిగా ఉండగలగడం స్థిమితాన్నిస్తుంది. కావలసిందల్లా హేతువును గుర్తించగలగడం. పరిస్థితులు మంచివీ కావు. చెడ్డవీ కావు. అర్థం చేసుకోగలిగితే, అవి గురు స్వరూపాలే. వాస్తవాన్ని ఆవిష్కరించే అవకాశాలవి. కింద పడిపోతే ఏడుస్తాం. అదే ఆటలో పడిపోతే నవ్వుతూ మళ్లీ ఆట కొనసాగిస్తాం. జీవితాన్ని ఆటగా అనుకోగలిగితే కిందపడ్డా ఆనందమే. 


అన్నింటిలో ఏకత్వాన్ని చూడటమే పరమానందం. పుట్టుకకు, మరణానికి మధ్య తేడా లేదనుకోవడమే అమృతత్వం. ఏది సాధ్యమో అదే సాధన. శోధిస్తున్నంత సేపూ అసాధ్యంగా కనిపిస్తుంది. శోధన పూర్తయి, ఫలితం దొరికినప్పుడు కలిగే పులకింతే ఒక ఆనంద రేఖ. మతాలు సూచించిన మార్గాలన్నీ మంచివే. అర్థం చేసుకోవడంలో, ఆచరించడంలో ఉన్న అస్పష్టత వల్ల, అసమగ్రత వల్ల భేదం ఉన్నట్లనిపిస్తుంది. మతానికి ధర్మం ఉన్నది. కానీ.. ధర్మం మతాతీతం, దేశ, కాలాతీతం. ధర్మంలోనే మిగిలిన మూడు పురుషార్థాలూ ఇమిడి ఉన్నాయి.


స్వార్థం మానవ ప్రవృత్తిలో ఒక భాగం. దాన్ని అధిగమించే ప్రయత్నమే సాధన. స్వార్థాన్ని దాటగలిగితే మానవుడు తనలోని మాధవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలడు. అరిషడ్వర్గాలను జయించడం మాత్రమే కాదు. ఆరు వికారాలను సాధన, అనుభవం ద్వారా రూపాంతరీకరణం చేసుకోవాలి. కాలగమనంలో సాధనా తీవ్రతతో అవే ప్రభావాన్ని తగ్గించుకుని, సరైన సమయంలో సమశక్తిగా అభివ్యక్తమౌతయ్‌. ప్రవృత్తి, జీవన విధానం, జీవన దృక్పథం, జీవనశైలి ద్వారా విధిని అనుసరిస్తూ అంగీకరించడమే మన విధి. కావలసిందల్లా సమన్వయమే, సంఘర్షణ కాదు. సర్వాత్మభావనే, సర్వేశ్వర భావన! అన్ని రూపాలు ఆయనవే. అన్ని పేర్లూ ఆయనవే. అన్ని గుణాలూ ఆయనవే. భగవంతుడంటే ప్రత్యేకం కాదు. ఉన్నదంతా దైవమే!

  • - వీఎస్‌ఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2020-03-04T07:38:57+05:30 IST