అంతా చీటింగ్‌!

ABN , First Publish Date - 2022-06-28T05:04:49+05:30 IST

ఇంటి ఖర్చులకు ఎంతో కొంత ఆసరా అవుతుందని రూపాయి రూపాయి కూడబెట్టి చిట్‌ఫండ్‌లో వేస్తే చిట్‌ వ్యాపారులు మోసాలకు ఒడిగడుతున్నారు.

అంతా చీటింగ్‌!


  • తాండూరులో నమ్మించి నట్టేట ముంచుతున్న చిట్‌ఫండ్‌ కంపెనీలు
  • చిట్టీలు వేసిన వారికి అవసరానికి డబ్బులు ఇవ్వని వైనం
  • చిట్టీలు వేయించాక ఏజెంట్ల తొలగింపు
  • పేరుమోసిన చిట్‌ఫండ్లదీ అదే తీరు
  • ఇప్పటికే రూ.30 కోట్లతో ఉడాయించిన చిట్‌ఫండ్‌ కంపెనీ
  • 300మంది బాధితులు.. ఇంకా ఇస్తామని బుకాయింపు
  • పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆశల్లో చిట్టీదారులు

ఇంటి ఖర్చులకు ఎంతో కొంత ఆసరా అవుతుందని రూపాయి రూపాయి కూడబెట్టి చిట్‌ఫండ్‌లో వేస్తే చిట్‌ వ్యాపారులు మోసాలకు ఒడిగడుతున్నారు. డబ్బులు ఇవ్వకుండా నానా కష్టాలు పెడుతున్నారు. మొత్తానికే కంపెనీలను మూసేసి ఉడాయిస్తున్నారు. మరికొన్ని సంస్థలు అనేక రకాలుగా మోసాలకు గురిచేస్తున్నాయి. దీంతో వాటిలో పెట్టుబడి పెట్టిన సామాన్య జనం తమ డబ్బులు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నారు. 

తాండూరు, జూన్‌ 24 : తాండూరు పట్టణంలో చిట్‌ఫండ్‌ కంపెనీలు చీటింగ్‌ చేస్తున్నాయి. సొంత ఇల్లు కట్టుకోవడం కోసమో, కూతుళ్ల పెళిళ్ల కోసమో, వైద్యం కోసమో కష్టకాలంలో డబ్బులు ఉపయోగపడతాయని చిట్టీవేసిన వారు డబ్బులు తిరిగి రాక మోసపోతున్నారు. ఒక్కో చిట్‌ ఫండ్‌లో ఒక్కో విధంగా చిట్టీవేసిన వారిని మోసం చేస్తున్నారు. చిట్టీ డబ్బులు సకాలంలో ఇవ్వక అష్టకష్టాలకు గురిచేస్తున్నారు. తమ చిట్‌ఫండ్స్‌లో చిట్టీలు వేయించుకునేందుకు ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వారు చిట్టీలు వేయించిన తర్వాత ఏజెంట్లను కంపెనీలు తొలగిస్తున్నాయి. చిట్టీ వేసిన వారు కంపెనీలకు వెళ్లి అడిగితే మీ ఏజెంట్‌లను అడగాలని చెబుతున్నారు. చిట్‌ఫండ్‌ల ఏర్పాటుకు అడ్డగోలు అనుమతులు ఇవ్వడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చిట్‌ఫండ్‌ల ఆర్థిక పరిస్థితి, లావాదేవీలు, బ్యాంకు అకౌంట్స్‌, స్టేటస్‌ వంటివి చూడకుండానే అనుమతులు ఇవ్వడం వల్ల అడ్డగోలుగా చిట్‌ఫండ్‌లు వెలుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. 

చిట్‌ఫండ్‌ డబ్బులతో రియల్‌ దందాలు

చిట్టీల పేరుతో వచ్చిన డబ్బులను రొటేషన్‌ చేసుకునేందుకు గాను చాలామంది చిట్‌ఫండ్‌ యజమానులు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేల్‌ కావడంతో చిట్టీదారులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా వారిని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాండూరులో ఇప్పటికే పలు చిట్‌ఫండ్‌లు బిచాణా ఎత్తి వేయగా మరికొన్ని డబ్బులు చెల్లించలేక చేతులెత్తే పరిస్థితి ఏర్పడింది. 

తాజాగా మరో చీటింగ్‌..

తాండూరు పట్టణంలో తాజాగా మరో చిట్‌ఫండ్‌ కంపెనీ కూడా రూ.లక్షల్లో చిట్టీలు వేయించుకుని జనాలను నట్టేట ముంచుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాండూరు పట్టణంలోని వినాయక్‌ చౌక్‌ సమీపంలో గల ఓ పేరు మోసిన చిట్‌ఫండ్‌ తమ కంపెనీ ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారులు, చిరు ఉద్యోగుల నుంచి చిట్టీలను వేయించుకున్నారు. వీరి వద్ద సుమారు రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు చిట్టీలు వేశారు. అయితే చిట్టీలు వేసిన వారికి చిట్టీ డబ్బులు ఇవ్వాలంటే ఓ ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ అవసరం. దీంతో చిట్‌ కంపెనీవారే ఓ ప్రభుత్వ ఉద్యోగిని ష్యూరిటీ పెట్టేందుకు నియమించుకున్నారు. ఆ ఉద్యోగితోనే సుమారు ఐదుగురికి ష్యూరిటీ  ఇప్పించారు. ఈ కంపెనీలో చిట్టీ డబ్బులు కట్టిన వారు డబ్బులు డ్రా చేసుకుంటే వారికి రావాల్సిన మొత్తం ఇవ్వకుండా ఒక్కొక్కరి వద్ద రూ.లక్షా 50వేల వరకు పట్టుకుని మిగతా డబ్బులు చెల్లిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అది కూడా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిట్‌ఫండ్‌లో తాండూరుకు చెందిన ఓ వ్యాపారి రూ.10లక్షల చిట్టీ వేశారు. ప్రతినెలా వాయిదాలను సక్రమంగా చెల్లించారు. తనకు 23వ నెలలో చిట్టీ డబ్బులు కావాలని అడగటంతో రూ.6లక్షలా 50వేల వరకు డబ్బులు వస్తాయని చెప్పి రూ.5లక్షలే చెల్లించారు. మిగతా రూ.లక్షా 50వేలు ఇవ్వకపోవడంతో ఇదేమని అడిగిన వ్యాపారికి డ్యూ ఉన్నాయ్‌, కమీషన్‌ కట్‌ అయిందంటూ ఏవేవో కారణాలు చెబుతున్నారు. అదేవిధంగా ఏజెంట్లను తరచూ మారుస్తూ మీకు ఏ వివరాలు కావాలన్నా మీ ఏజెంట్లనే అడగాలని, తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారు. ఇలా తాండూరు పట్టణంలో అనేక చిట్‌ఫండ్‌ కంపెనీలు చిట్టీదారుల నుంచి డబ్బులు కాజేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, చిట్‌ఫండ్‌ కంపెనీలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ డబ్బులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందేమోనని, కొద్ది రోజుల తర్వాతైనా తమ డబ్బులు చెల్లించకపోతారా అన్న ఆశతో బాధితులు ఉన్నారు. అందుకే పోలీసులకు వీటిపై ఫిర్యాదులు అందడం లేదని ప్రచారం సాగుతోంది.

బిచాణా ఎత్తేసిన చిట్‌ఫండ్‌లు

తాండూరులో పేరుమోసిన ఒక ప్రముఖ వ్యాపారి మరికొందిరితో కలిసి తాండూరు-కొడంగల్‌ రోడ్డు మార్గంలో కొన్నేళ్లపాటు నమ్మకంగా చిట్‌ ఫండ్‌ను నడిపించారు. వారిపై విశ్వాసం ఉన్న అనేకమంది రిటైర్డ్‌ ఉద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున చిట్టీలు వేశారు. కొన్ని నెలలపాటు నమ్మకంగా లావాదేవీలు కూడా జరిగాయి. ఒక్కసారిగా చిట్‌ఫండ్‌ నష్టాల్లోకి వెళ్లడంతో వ్యాపారులు చేతులెత్తేశాడు. సుమారు 300మంది చిట్టీదారులకు రూ.30కోట్ల మేరకు డబ్బులు చెల్లించాల్సి ఉన్నాయి. అయితే ఈ ఫైనాన్స్‌లో వ్యవసాయ శాఖలో పనిచేసి రిటైర్డ్‌ అయిన ఓ ఉద్యోగి వచ్చిన జీతం డబ్బులు, వచ్చిన పెన్షన్‌ డబ్బులను లక్షల్లో చిట్‌ఫండ్‌లో జమ చేశారు. ప్రస్తుతం ఆయన డబ్బులు తిరిగి రాకపోవడంతో మనోవేదనకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యరు. మరో చిరువ్యాపారి తనకున్న ప్లాట్‌ను రూ.14లక్షలకు విక్రయించి 10ఏళ్ల క్రితం ఈ చిట్‌ఫండ్‌లో డిపాజిట్‌ చేశారు. ప్రస్తుతం ఆ డబ్బులు రూ.28లక్షలకు చేరాయి. ఆయనకు తిరిగి ఒక్కరూపాయి కూడా రాలేదు. తాండూరు మండలానికి చెందిన మరో చిరు వ్యాపారికి డిపాజిట్‌, చిట్టీ డబ్బులు కలిపి రూ.30లక్షల వరకు రావాల్సి ఉండగా వాటిని కూడా ఇవ్వలేదు. వ్యాపారులు తమ పేరిట  ఉన్న ఆస్తులను కూడా బినామీల పేర్లపై మార్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. డబ్బులు డిపాజిట్‌ చేసిన వారికి తిరిగి వాటిని చెల్లిస్తామంటూ ఇంకా నమ్మబలుకుతూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బుజ్జగిస్తున్నారు. ఈ విషయంపై కొందరు బాధితులు కోర్టులో కేసు వేశారు. అదేవిధంగా తాండూరు-చించొళి రోడ్డు మార్గంలో ’’చిట్‌ఫండ్‌లో పొదుపు-మీ ఆర్థిక ప్రగతికి మలుపు‘‘ అనే నినాదంతో ఓ చిట్‌ఫండ్‌ను ఏర్పాటు చేశారు. దానిలో అనేకమంది చిట్టీదారులను చేర్చుకుని బిచాణా ఎత్తేసింది. అప్పట్లో చిట్టీదారులు తిరుగుబాటు చేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. 

మోసం చేసిన చిట్‌ఫండ్‌యజమానులపై చర్యలు తీసుకోవాలి

ప్రజలను మోసం చేస్తున్న ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌లపై చర్యలు తీసుకోవాలి. అవసరం కోసం పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వకుండా చిట్‌ ండ్‌లు మోసం చేస్తున్నాయి. చిట్‌ఫండ్‌లపై పోలీసు నిఘా అవసరంతోపాటు ఆ కంపెనీలకు అన్ని పరిశీలించిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలి. ఇప్పటికే తాండూరులో అనేక చిట్‌ఫండ్‌ కంపెనీలు ప్రజలను మోసం చేశాయి.  

                                                                         - కె.శ్రీనివాస్‌, తాండూరు

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

కష్టపడి డబ్బులు సంపాదించిన వాటిని చిట్టీలు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చిట్‌ఫండ్స్‌ల పూర్వాపరాలు పరిశీలించాలి. రిజిష్టర్‌ చిట్‌ఫండ్‌ల లేక అన్‌ రిజిష్టర్‌తో ఉన్నాయా? అనే విషయాలను గమనించాలి. చిట్టీదారులకు కట్టిన డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసినట్లు ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చిట్‌ఫండ్‌లపై కూడా పోలీసు నిఘా ఉంటుంది. ఆధారాలతో ఎవరైనా ఫిర్యాదులు చేస్తే కేసులు నమోదు చేస్తాం.

                                                                      - శేఖర్‌గౌడ్‌, డీఎస్పీ తాండూరు.

Updated Date - 2022-06-28T05:04:49+05:30 IST