అంతా సందిగ్ధం

ABN , First Publish Date - 2021-05-15T06:29:06+05:30 IST

వానాకాలం పంటల సీజన్‌ సమీపిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయక పోవడంతో రైతుల్లో సందిగ్ధం నెలకొంది.

అంతా సందిగ్ధం
పంట చేనును చదును చేస్తున్న రైతు(ఫైల్‌)

పంట రుణాల చెల్లింపునకు అన్నదాతల అయోమయం

ఇప్పటి వరకు రుణమాఫీపై స్పష్టతనివ్వని ప్రభుత్వం

గడువు ముగియడంతో రుణం చెల్లించాలని బ్యాంకర్ల ఒత్తిడి

కొత్త రుణాల కోసం తప్పని ఎదురుచూపులు

వానాకాలం సీజన్‌ సమీపిస్తుండడంతో రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సీజన్‌ సమీపిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయక పోవడంతో రైతుల్లో సందిగ్ధం నెలకొంది. దీంతో పంట రుణాలను చెల్లించాలా? వద్దా? అని అన్నదాతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడంతో రైతన్నలు ఆశాగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్లు గడుస్తున్నా.. ముఖ్యమంత్రి హామీ నెరవేరడం లేదు. గతంలో దశల వారీగా రుణమాఫీ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఊసెత్తడమే లేదు. వరుసగా రెండో యేడాది వానాకాలం ముందు కరోనా ఎఫెక్ట్‌ కనిపించడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడి పంటలను సాగు చేస్తున్నారు. తాజాగా గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం కింద ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3లక్షల 16వేల మంది రైతులకు 8వ విడత కింద ఆర్థిక సహాయం విడుదల చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో లక్షా 47వేల మంది రైతులున్నారు. ఇందులో లక్షా 22వేల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలను తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2018 డిసెంబరు 11లోపు పంట రుణాలు తీసుకున్నా.. రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించే అవకాశం ఉంది. ఆ తర్వాత రుణం తీసుకున్న రైతులకు మాఫీ వర్తించదని అధికారులు చెబుతున్నారు. అయితే లక్ష రూపాయల లోపు రుణం మాఫీ చేస్తే జిల్లాలో 93వేల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వం ప్రకటనకు ముందే రుణం చెల్లిస్తే మాఫీ వర్తిస్తుందో? లేదో? అని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. గతేడు వానాకాలంలో 25వేల రూపాయల వరకు రుణం ఉన్న మొత్తం 17వేల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఈసారి కరోనా పరిస్థితులతో రుణ ప్రక్రియ మరింత ఆలస్యం కావడంతో వానాకాల పంటల సాగుపై అయోమయం నెలకొంది. నిబంధనల ప్రకారం ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచి పంట రుణాల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. కాని ఈసారి మే నెల గడిచిపోతున్నా.. పంట రుణాల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకర్లు, అన్నదాతల్లో అయోమయ పరిస్థితులు నెల కొన్నాయి. అంతేకాకుండా మరో పక్షం రోజుల్లో తొలకరి వర్షాలు కురిస్తే పత్తి, సోయా పంటలను సాగు చేసేందుకు జిల్లాలోని ఆయా గ్రామాల రైతులు సిద్ధమవుతున్నారు.

సిద్ధం కాని ప్రణాళిక

ఈ యేడు వానాకాల పంటల సాగుకు అవసరమైన రుణప్రణాళిక ఇంకా సిద్ధం కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. మరో వారం పది రోజుల్లో ప్రణాళిక సిద్ధమయ్యే అవకాశం ఉందంటున్నారు. కరోనా పరి స్థితులతో పంట రుణాలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.  ప్రతియేటా ఏప్రిల్‌, మేలలోనే వానాకాల రుణాలను అందజేస్తే రైతులు పంటల సాగుకు సిద్ధమవుతారు. ఈ యేడు కరోనా పరిస్థితులతో లాక్‌ డౌన్‌ విధించి బ్యాంకుల సమయాన్ని కుదించారు. పంట రుణాల కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అధి కారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే తీసుకున్న రుణాలను రెన్యూవల్‌ చేసేందుకు రైతులు వెనుకాడుతున్నారు. గతంలో రూ.25వేల లోపు  రుణం ఉన్న వారికి ప్రభుత్వం రుణమాఫీ చేసింది. దశల వారీగా పంట రుణం మాఫీ చేసేందుకు ఆసక్తి చూపించినట్లు కనిపించడం లేదు. అసలు ఈసారి మాఫీ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఇకనైనా పంట రుణాలపై గందరగోళ పరిస్థితులకు తెరదించి స్పష్టమైన ఆదేశాలు ఇస్తేనే సాగు పనులు ఊపందుకోనున్నాయి. 

రైతులపై బ్యాంకర్ల ఒత్తిళ్లు

రుణం తీసుకున్న గడువు ముగిసి పోవడంతో రైతులపై బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. పంట రుణాలను సకాలంలో చెల్లించాలని బ్యాంకు అధికారులు ఆదేశిస్తున్నారు. కనీసం వడ్డీ చెల్లించి అయిన రుణ సొమ్మును రెన్యూవల్‌ చేసుకో వాలని సూచిస్తున్నారు. రుణం తీసుకున్న రోజు నుంచి సంవత్సరం గడువులోగా రుణం చెల్లించాలని చెబుతున్నారు. గడువు మించితే అదనంగా వడ్డీ భారం పడే అవకాశం ఉందంటున్నారు. ఇలా రోజులు గడుస్తున్నకొద్ది.. వడ్డీ భారం పెరిగి పోతోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం రుణమాఫీ చేసిన వడ్డీ సొమ్మును రైతులే చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉందని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త రుణాల కోసం ఎదురుచూపులు

ఇది వరకు పంట రుణం తీసుకోని రైతులు కొత్త రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. రుణం రాగానే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడంతో భారం పెరిగి పోతోందని వాపోతున్నారు. కొందరు రైతులైతే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి మరీ.. వేసవి దుక్కు లు, సేంద్రీయ ఎరువుల తరలింపు నకు పెట్టుబడులు పెడుతున్నారు. అప్పు చేసే స్థోమత లేని చిన్న, సన్నకారు రైతు మాత్రం బ్యాంకు రుణం వచ్చే వర కు సాగు పనుల జోలికి వెళ్లడం లేదు. సకాలంలో రుణం చేతికొస్తేనే వానా కాల పంటల సాగు పనులు ఊపందుకుంటాయని, లేని పక్షంలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

మరో వారం రోజుల్లో ఆదేశాలు వస్తాయి...

: చంద్రశేఖర్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, ఆదిలాబాద్‌

ఈ యేడు పంట రుణాల పై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందలేవు.మరో వారం రోజుల్లో ఆదేశాలు అందే అవకాశం ఉంది. కరోనా పరిస్థితులతో రైతులు తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు.ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే రుణ ప్రక్రియను ప్రారంభిస్తాం. అర్హులైన రైతులందరికి రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం. 

Updated Date - 2021-05-15T06:29:06+05:30 IST