అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి..!

ABN , First Publish Date - 2022-04-07T05:29:02+05:30 IST

ఇద్దరు ఎమ్మెల్యేల పోటీ కారణంగా కర్నూలు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు ఆరు నెలల ముందే తమ పదవులను వదులుకోవాల్సి వచ్చింది.

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి..!
కర్నూలు మార్కెట్‌ కమిటీ కార్యాలయం

  1. ఏడాదిన్నర కాలానికే ముగిసిన పదవీ కాలం
  2. అసంతృప్తిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు 
  3. తెరపైకి కొత్త రాజీ ఫార్ములా 
  4. తలూపిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌
  5. ఈసారి కాటసాని వర్గీయులకే పదవులు


    ఇద్దరు ఎమ్మెల్యేల పోటీ కారణంగా కర్నూలు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు ఆరు నెలల ముందే తమ పదవులను వదులుకోవాల్సి వచ్చింది. ఏటా రెండేళ్ల పాటు పదవుల్లో కొనసాగగా ఈ సారి మాత్రం ఒకటిన్నర ఏడాది కాలానికే తమ సీట్లలో నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అధినేతల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వారి మాట కాదనలేని పరిస్థితిని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల పదవీ కాలం ఉంటుందని భావిస్తే ఏడాదిన్నర కాలానికే  తమను ఇంటికి పంపించే ప్రయత్నాలు జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


కర్నూలు(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 5: రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన కర్నూలు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల పదవుల కోసం అధికార పార్టీ నాయకుల్లో పోటీ మొదలైంది. ఇప్పటి దాకా కొనసాగిన పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 5వ తేదీకి ముగిసిపోయింది. ప్రభుత్వ విధానం ప్రకారం మరో ఆరు నెలలు తమకు అవకాశం లభిస్తుందనే ఆశతో పాలకవర్గం ఆశలు పెట్టుకుంది. అయితే మారిన పరిస్థితుల వల్ల ప్రభుత్వం ఈ అవకాశం ఇస్తుందో లేదోననే అనుమానం కూడా వారిని వేధిస్తోంది. మార్కెట్‌ కమిటీ యార్డు పరిధి కల్లూరులో ఉండడంతో ఎమ్మెల్యే రాంభూపాల్‌ రెడ్డి జోక్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఇప్పటిదాకా కొనసాగిన మార్కెట్‌ కమిటీ పాలకవర్గంలో తమకు కొన్ని డైరెక్టర్ల పదవులనైనా అప్పజెప్పాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని పట్టుబడుతున్నారు. 


కాటసాని సూచించిన వారికే..!

మొదటి విడతలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ తనకే పూర్తి అవకాశం ఉండేలా వైసీపీ పెద్దలను ఒప్పించుకొని సక్సెస్‌ అయ్యారు. దీని ప్రకారం ఇప్పటి పాలకవర్గంలో కర్నూలు ఎమ్మెల్యే సూచించిన వారికే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల పదవులు దక్కాయి. ఈ నిర్ణయంపై కొంత అసంతృప్తితో ఉన్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని ప్రస్తుత కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డులోనే పాణ్యం కమిటీ యార్డును కూడా ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించారు. అయితే ఒకే యార్డులో రెండు మార్కెట్‌ కమిటీల యార్డులు పని చేయడం మంచి పద్ధతి కాదని, ఇకపై ఎన్నుకునే పాలకవర్గంలో పాణ్యం ఎమ్మెల్యే సూచించిన వారికే అవకాశం ఇచ్చేటట్లుగా రాజీ పార్ములాను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఇందుకు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ రాజీ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం దిగిపోయిన పాలకవర్గం స్థానంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని సూచించిన వారికే నామినేట్‌ పదవులు దక్కనున్నాయి.


ఆవేదనలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు

ఇప్పటిదాకా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు పదవీ కాలం ముగియడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కొనసాగిన ఏ మార్కెట్‌ కమిటీ పాలకవర్గమైనా ప్రతి రెండేళ్ల వరకు పాలన సాగిస్తూ వచ్చిందని చెబుతున్నారు. అయితే తమకు సంవత్సరం ఆరు నెలలకే పదవి ముగిసిపోయిందని చెప్పడం బాధ కలిగిస్తోందని కొంత మంది డైరెక్టర్లు పేర్కొంటున్నారు. మొదటిసారి తమకు సంవత్సరం పాటు పదవిలో కొనసాగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, రెండోసారి ఆరు నెలల పదవీ కాలంలో కొనసాగేందుకు ఉత్తర్వులు తెచ్చుకునేందు కోసం తాము పడరానిపాట్లు పడాల్సి వచ్చిందన్నారు. మరో ఆరు నెలలు అవకాశం ఉండి కూడా అధినాయకుల నిర్ణయం ప్రకారం తమకు అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఇంకా కొంత మందిలో ఆశలే.. 

ఏదో ఒక రూపంలో మరో ఆరు నెలలు పదవిలో కొనసాగే అవకాశం వస్తుందనే ఆశతో కొంత మంది డైరెక్టర్లు ఉన్నారు. మార్కెట్‌ కమిటీ చరిత్రలో రెండేళ్ల పదవీ కాలం వరకు పాలకవర్గం కొనసాగుతూ వచ్చింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రారంభంలో ఒక సంవత్సరం వరకు పదవిలో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రెండోసారి మరో ఆరు నెలలు పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. మూడోసారి మరో ఆరు నెలలు పదవిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యేవి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొనసాగిన ఈ పద్ధతినే ప్రస్తుత వైసీపీ హయాంలోనూ కొనసాగిస్తారని, ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్న వారు ఆశించారు.


మరోసారి పొడిగించాలని కోరలేదు - డైరెక్టర్‌ మహబూబ్‌ బాషా (చైర్మన్‌ రోఖియాభీ భర్త) 

మరోసారి పదవీ కాలాన్ని పొడిగించాలని మేము మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌కు ఎటువంటి లెటరు పంపలేదు. అయితే ఇప్పటిదాకా కర్నూలు మార్కెట్‌ యార్డులో పాలకవర్గం రెండేళ్లు కొనసాగుతూ వచ్చింది. మేము కూడా రెండు సంవత్సరాల పాటు పదవిలో ఉంటామని అనుకున్నాం. అయితే.. ఊహించని పరిస్థితుల కారణంగా ఒకటిన్నర ఏడాది కాలానికి దిగిపోవాల్సి వచ్చింది. అధినాయకుల నిర్ణయం కారణంగా మేము మళ్లీ ఆరు నెలల పదవీ కాలం కోసం  ఆశలు పెట్టుకోవడం లేదు. మాలో ఎటువంటి అసంతృప్తి లేదు.

Updated Date - 2022-04-07T05:29:02+05:30 IST