మునుగోడుకు అన్నీ..

ABN , First Publish Date - 2022-08-19T07:48:36+05:30 IST

ప్రాజెక్టుల నిర్వాసితులకు రూ.వందల కోట్ల పరిహారం మంజూరైపోయింది.. ఎప్పటినుంచో ఆగిపోయిన రోడ్ల పనుల్లో కదలిక వచ్చింది..

మునుగోడుకు అన్నీ..

ఉప ఎన్నిక ప్రభావంతో చకచకా నిధులు.. డిండి లిఫ్ట్‌ నిర్వాసితులకు రూ.116 కోట్లు

‘పాపన్న జయంతి’తో గౌడ్‌ల ఓట్లపై కన్ను.. చేనేత బీమా అమలు వేగిరం!

నియోజకవర్గానికి 9 వేల ఆసరా పింఛన్లు.. రూ.7 కోట్ల రోడ్లు, బ్రిడ్జిల పనుల్లో కదలిక

టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు చేజారకుండా 2 లక్షలు అడ్వాన్స్‌.. పంపిణీ చేసిన ఎమ్మెల్సీ!

రోడ్డుపై డిండి నిర్వాసితుల అర్ధనగ్న ప్రదర్శన.. 3 గంటలు రాస్తారోకో.. ట్రాఫిక్‌ జాం


నల్లగొండ, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రాజెక్టుల నిర్వాసితులకు రూ.వందల కోట్ల పరిహారం మంజూరైపోయింది.. ఎప్పటినుంచో ఆగిపోయిన రోడ్ల పనుల్లో కదలిక వచ్చింది.. పాపన్నగౌడ్‌ జయంతి అధికారికమైంది.. చేనేతలకు బీమా అమలు కాబోతోంది.. ఆసరా పింఛన్లు వచ్చేస్తున్నాయి.. మీకు స్తంభాలు కావాలా? ట్రాన్స్‌ఫార్మర్‌ కావాలా? అంటూ ఊరూరా రైతులను ఆరా తీస్తున్నారు.. ఇవన్నీ చేస్తూనే, తమ పార్టీ ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా రూ.లక్షలు అడ్వాన్స్‌గా చేతిలో పెట్టేస్తున్నారు. ఇదంతా ఉప ఎన్నిక ప్రభావంతో మునుగోడులో ప్రభుత్వం, అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ హడావుడి. ఈ ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్న సీఎం కేసీఆర్‌ విజయానికి దశలవారీగా కార్యాచరణ విడుదల చేశారు. ముందుగా శనివారం బహిరంగ సభతో ఓటర్ల మనసులో ముద్ర వేసే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు నియోజకవర్గంలో గంపగుత్తగా ఓట్లు మళ్లించుకునేందుకు భారీ ఓటు బ్యాంకున్న కులాలను ఎంచుకుని ప్రణాళికలను ఆచరణలో పెడుతున్నారు. ఫ్లోరైడ్‌ పీడిత మునుగోడుకు కృష్ణా నీరు ఇవ్వాలన్న యోచనతో డిండి ఎత్తిపోతల పనులను 2015లో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు వ్యవసాయ భూములను సేకరించారు. ఇళ్లను పూర్తిగా తొలగించి మరోచోట పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొదట ఎకరాకు రూ.2 లక్షలు పరిహారం ఇవ్వగా రైతుల పోరాటంతో అది రూ.4.15లక్షలకు పెరిగింది.


అయితే ప్రభుత్వం నిధులు మంజూరు చేయక.. పునరావాసం సమకూరలేదు. భూపరిహారం అందలేదు. దీంతో 2016 నుంచి నాంపల్లి, మర్రిగూడెం మండలాల్లోని కిష్టరాయణ్‌పల్లి, చర్లగూడెం రిజర్వాయర్ల పరిధి గ్రామ రైతులు ఆందోళనలు చేస్తున్నారు.  ఉప ఎన్నికతో ప్రభుత్వం పునరావాస ప్యాకేజీకి రూ.14.50 కోట్లు, పరిహారానికి రూ.101.50 కోట్లను మంజూరు చేసింది. అయితే, హడావుడిగా ప్రభుత్వం పరిహారం మంజూ రు చేసినా.. మల్లన్నసాగర్‌తో సమానంగా పరిహారం కోరుతు న్న నిర్వాసితులు మూడు రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. గురువారం రాత్రి రాస్తారోకోకు సైతం దిగారు.


రోడ్ల పనుల్లో కదలిక

మాల్‌ నుంచి మర్రిగూడ మండలానికి రూ.కోటితో చేపట్టి న రోడ్డు, నాంపల్లి మండలంలో రూ.3 కోట్లతో బ్రిడ్జి, చౌటుప్పల్‌ నుంచి తంగెడపల్లి వరకు రూ.3.16 కోట్లతో రహదారి పనులను బిల్లులు మంజూరు కాకపోవడంతో గతంలో కాం ట్రాక్టర్లు నిలిపివేశారు. ఉప ఎన్నిక ప్రభావంతో ప్రస్తుతం రాత్రింబవళ్లు కొనసాగుతున్నాయి. ఇక రైతుల విద్యుత్‌ స్తం భాలు, ట్రాన్స్‌ఫార్మర్ల అవసరాలను తీర్చేందుకు గ్రామాల వారీగా వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గానికి కొత్తగా 9వేల ఆసరా పింఛన్లు మంజూరు కాగా, సీఎం సభ విజయవంతానికి మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. 


గౌడ్‌లు, పద్మశాలీల కోసం

మునుగోడులో మొత్తం 2.18లక్షల ఓట్లుంటే బీసీల ఓట్లే 60శాతం. వీరిలోనూ అత్యధికంగా గౌడ సామాజికవర్గం ఓట్లు 45 వేలుంటాయి. రాజకీయంగానూ.. గౌడ ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు సరిగ్గా పది రోజుల క్రితం సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ వేడుకలను మునుగోడు నియోజకవర్గంతో పాటు నల్లగొండ జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. నల్లగొండలో పాపన్న జ యంతిలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి.. జిల్లా కేంద్రంలో విగ్రహం ఏర్పాటు చేసి వచ్చే జయంతిని ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మునుగోడులో పద్మశాలీల ఓట్లు 25వేల వరకు ఉన్నాయి. వీరిని దృష్టిలో పెట్టుకుని.. చేనేత బీమా అమలు పథకాన్ని వేగిరం చేశారు.


వలస పోవద్దంటూ సొంత నేతలకు కౌన్సెలింగ్‌ అయినా.. వెళ్లిపోతుండడంతో చేతికి డబ్బు

తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరిక నేపథ్యంలో.. చౌటుప్పల్‌లో ఈ నెల 21న తలపెట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సభ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ఉంటాయని అధికార పార్టీకి సమాచారం వెళ్లింది. ఇలా వెళ్లిపోయే సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులపై టీఆర్‌ఎస్‌ నిఘా పెట్టి కౌన్సెలింగ్‌ ప్రా రంభించింది. అయితే, బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతో చం డూరు మండల టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు మంగళవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. పరిస్థితిని అంచనా వేసిన అధికార పార్టీ నేతలు తమ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు ఒక్కొక్కరికి బుధవారం రాత్రి రూ.2 లక్షల చొప్పున అందజేసినట్టు సమాచారం. చండూరు మండలంలో సైతం ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ కు 15 మంది సర్పంచ్‌లు, నలుగురు ఎంపీటీసీ సభ్యులున్నా రు. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు బుధవారం రాత్రి చండూరు మండలంలో ఓ గ్రామంలోని ఫాంహౌ్‌సలో డబ్బు ప్యాకెట్లను ఓ ఎమ్మెల్సీ, జడ్పీటీసీ సభ్యుడు పకడ్బందీగా పం పిణీ చేసినట్లు తెలిసింది.

Updated Date - 2022-08-19T07:48:36+05:30 IST