Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అందరూ.. దొంగలే..!

twitter-iconwatsapp-iconfb-icon
  అందరూ.. దొంగలే..!మార్కాపురం మున్సిపల్‌ కార్యాలయం (ఇన్‌సెట్లో) అనధికార భవనాలను తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు (ఫైల్‌)

అవినీతికి కేరాఫ్‌ మున్సిపల్‌ కార్యాలయం

ఏసీబీ దృష్టి కేవలం టౌన్‌ ప్లానింగ్‌ పైనేనా?

మార్కాపురం, ఆగస్టు 11:

  మున్సిపాలిటీలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి ప్లానర్లే మధ్యవర్తులుగా పనిచేస్తున్నారు. భవన యజమానులు, అధికారులకు మధ్య వ్యవహారాలన్నీ వారే చక్కబెడుతున్నారు. భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులను, భవిష్యత్‌లో పన్నులు తక్కువగా వేసేందుకు పరిమాణాన్ని తక్కువగా చూపుతున్నారు. ఇందుకు కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్‌ అధికారితో నేరుగా రాయబేరాలు నడుపుతారు. 

  ఇక కీలకమైన టౌన్‌ప్లానింగ్‌లో ముఖ్య అధికారి తీరే వేరు. సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వారు అనుమతులు లేకుండా భవన నిర్మాణానికి సిద్ధమైతే చాలు డేగలా వాలిపోతాడనే పేరొచ్చింది. సామదాన దండోపాయాలను వాడి వచ్చినకాడికి వసూలుకు పాల్పడతారు. 

  ఇక కార్యాలయంలో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి ఏవైనా పనులు కావాలంటే తప్పనిసరిగా అక్కడ పనిచేస్తున్న టౌన్‌ప్లానింగ్‌లోని అటెండర్‌ని కలవాల్సిందే. మొత్తం వ్యవహారానికి అతనే సూత్రధారి. రేటు మాట్లాడుకుని వ్యవహారం పూర్తిచేయించి ఇస్తారు. ఆ విభాగంలో పనిచేసే సిబ్బంది అతని కనుసన్నల్లోనే పనిచేయాలి.

  ఇక రెవెన్యూ విభాగంలోని ఇన్‌స్పెక్టర్‌ తీరే వేరే. ఎంత భారీ భవనానికైనా సరే అతను అనుకుంటే గుడిసెను చేస్తాడు. ప్రభుత్వాదాయానికి గండికొట్టి తన జేబులు మాత్రం నింపుకుంటాడు. జనాన్ని పీడించి జగనన్నకు భారీగా ట్యాక్స్‌ కడతాడనే స్థానికంగా పేరుంది.

  ఇదీ మార్కాపురం పురపాలక సంఘం తీరు. అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ఏ విభాగాన్ని చూసినా జనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్యాలయంలో కాసులు లేనిదే పని జరగడం లేదు. అధికారపార్టీ నేతలకు కప్పం కడుతూ వారి కనుసన్నల్లో పనిచేస్తూ మిగతా వారిని పీల్చిపిప్పిచేస్తున్నారు.


 అక్కడ అందరూ దొంగలే... మరి కేవలం టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై మాత్రమే ఏసీబీ అధికారులు దృష్టిసారించడమేమిటి? అవినీతికి కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన మార్కాపురం పురపాలక సంఘంలో ప్రక్షాళన జరిగేదెప్పుడు..? ఇది వారంరోజుల క్రితం ఏసీబీ అధికారులు పురపాలక సంఘ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఫైళ్లను స్వాధీనం చేసుకున్న తర్వాత మార్కాపురంలోని ప్రతి ఒక్క సామాన్యుని మదిలో తలెత్తుతున్న ప్రశ్నలు.


టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఫైళ్ల స్వాధీనం

మార్కాపురం పురపాలక సంఘంలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో గత గురువారం ఏసీబీ డీఎస్పీ ప్రతా్‌పకుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేసిన సమయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వెంకటేశ్వర్లు కార్యాలయంలో లేడు. ఆయన జాడ ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సర్వేయర్‌ శివశంకర్‌ వద్ద ఫైళ్లు స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయనను ఒంగోలు ఏసీబీ కార్యాలయానికి పిలిపించుకొని విచారించారు. విచారణలో నిర్ధారించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదికలు పంపే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఆచూకీ లేని టీపీవో వెంకటేశ్వర్లు, సర్వేయర్‌ శివశంకర్‌పై చర్యలు తప్పవని మున్సిపల్‌ సిబ్బంది బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. కొలతల కోసం ప్రజలు చలానాలు కట్టినప్పటికీ సర్వేయర్‌ వాటిని పక్కనపెట్టి చేతులు తడిపిన వారి స్థలాలనే కొలతలు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.


ఇతర విభాగాల పరిస్థితి ఏమిటి?

అదీ... ఇదీ అని కాదు, మున్సిపాలిటీలో ఉన్న దాదాపు అన్ని విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పనుల కోసం వెళ్లే ప్రజల నుంచి లంచాల రూపంలో డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. మున్సిపల్‌ కార్యాలయంలో ప్రతి పనికీ ఒక రేటును, అందులోనూ వ్యక్తిని బట్టి మరో రేటును నిర్ణయించి వసూలు చేస్తున్నారని సమాచారం. పురపాలక సంఘం పరిధిలో పనిచేసే సిబ్బంది జీతం సైతం ఉన్నతాధికారులు కాజేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో...

మార్కాపురం బీగ్రేడ్‌ స్థాయిలో ఉంది. ఇక్కడ భవనాలకు రెండంతస్తులకు వరకూ మాత్రమే అనుమతి. అంతకు మించి నిర్మాణాలకు రాష్ట్రస్థాయి నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాక విస్తీర్ణపరంగా కొంతవరకూ ఇక్కడి అధికారులకు అనుమతులిచ్చే అధికారాలున్నాయి. కానీ నిబంధనలకు విరుద్ధంగా వందలసంఖ్యలో మార్కాపురంలో బహుళ అంతస్థుల భవనాలు నిర్మించారు. వారు నిర్మించే భవన స్థాయిని బట్టి అధికారుల చేతులు తడిపితే చాలు ఎంతటి నిర్మాణాలకైనా అనుమతులు ఇస్తారు. విస్తీర్ణపరంగా రాష్ట్రస్థాయిలో అనుమతులకు దస్త్రాలు పంపాలంటే ప్రభుత్వానికి చలానా రూపంలో అధికమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ పనిచేసే అధికారులే ఆ భవన యజమానులకు సలహాలిస్తారు. ఒక ప్లాన్‌కు బదులుగా రెండు, మూడు ప్లాన్లకు ఇక్కడే అనుమతులిస్తారు. నిర్మాణం మాత్రం అంతా కలిపే జరుగుతుంది. సామాన్యుడు నిర్మించుకునే ఇంటికి అనుమతి ఇవ్వాలంటే సదరు యజమాని మున్సిపల్‌ అధికారులకు కనీసంగా రూ.లక్ష వరకు లంచాల రూపంలో ఇవ్వక తప్పనిపరిస్థితి.


రెవెన్యూ విభాగంలో...

మున్సిపాలిటీలోని కీలకమైన మరో విభాగం రెవెన్యూ. పట్టణంలోని గృహాలకు, కమర్షియల్‌ సముదాయాలకు పన్ను నిర్ధేశించడం, వాటిని వసూలు చేయడం ఈ విభాగం అధికారుల ప్రధాన విధి. ప్రభుత్వ నియమాల ప్రకారం పన్నులు విధించాల్సి ఉంది. అయితే పన్నులను తక్కువగా నిర్ధారించడానికి అధికారుల చేతులు తడిపితే చాలు భవన యజమాని చెప్పినట్లు చేస్తారు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణ స్వభావం, శ్లాబ్‌, రేకులు, ఇంటి పొడవు, వెడల్పులు, ఇంటిలో వాడిన మార్బుల్స్‌ వీటన్నింటినీ పన్ను విధించేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాలి. కానీ అడిగినంత ఇస్తేచాలు ఇక్కడ స్లాబ్‌ రేకులవుతాయి, రాజస్థాన్‌ మార్బుల్‌ సిమెంట్‌ ప్లోరింగ్‌ అవుతుంది. 


ఇంజనీరింగ్‌ విభాగంలో...

పట్టణంలో జరిగే అభివృద్ధి, నీటిపారుదల పనులన్నీ ఇంజనీరింగ్‌ అధికారుల మంజూరు, పర్యవేక్షణలో జరుగుతాయి. ఇక్కడ జరిగే పనులన్నింటికీ ఇంజనీరింగ్‌ విభాగంలో వివిధ స్థాయిలలో పనిచేసే అధికారులందరికీ బిల్లులలో 10శాతం మేర పర్సంటేజీ రూపేణా కాంట్రాక్టర్లు చెల్లించాల్సిందే. ఇంటికి తాగునీటి కొళాయి కనెక్షన్‌ ఇచ్చేందుకు సైతం మామూళ్లు తప్పని సరి పరిస్థితి.


ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల జీతాలు హాంఫట్‌

పురపాలక సంఘంలో పరిశుధ్య విభాగంలో 180 మంది వరకూ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కార్మికులు పనిచేస్తుంటారు. అనారోగ్య, ఇతర ఏ వ్యక్తిగత కారణాల వలనో వారు విధులకు హాజరుకాకపోతే వారి స్థానంలో ఇతర వర్కర్లను ఆ రోజుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసి పనులు చేయించాలి. ఔట్‌సోర్సింగ్‌ వారికి ఇచ్చే దినసరి వేతనాన్ని బదిలీయ కార్మికులకు చెల్లించాలి. కానీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విధులకు హాజరుకానీ రోజు సైతం వారు విధులకు హాజరైనట్లు హాజరు నమోదు చేస్తున్నారు. కానీ బదిలీయ కార్మికులతో పనులు చేయించకుండా మిన్నకుంటున్నారు. ఆ మొత్తాన్ని ఉన్నతాధికారులు వాటాల ప్రకారం పంచుకుంటున్నట్లు సమాచారం.


రేట్లు పెంచండి

రెవెన్యూ విభాగంలో పన్నులను తక్కువగా విధించేందుకు ప్రజల నుంచి వసూలు చేసే మొత్తాన్ని పెంచాలని పురపాలక సంఘ ప్రధానాధికారి కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. అదీనూ పురపాలకసంఘంలో ఏసీబీ అధికారుల తనిఖీలు చేసిన మరుసటిరోజు కావడమే కొసమెరుపు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.