జాతీయ గీతాలాపనలో అందరూ పాల్గొనాలి

ABN , First Publish Date - 2022-08-10T05:24:19+05:30 IST

ఫ్రీడమ్‌ రన్‌, సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని దేశభక్తిని, జాతీయ భావాన్ని చాటాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు.

జాతీయ గీతాలాపనలో అందరూ పాల్గొనాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- ఎస్పీ  రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల క్రైం, ఆగస్టు 9 : ఫ్రీడమ్‌ రన్‌, సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని దేశభక్తిని, జాతీయ భావాన్ని చాటాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, ఆయా కార్యక్రమాలకు పాల్గొని విజయవంతానికి కృషి చేస్తారని తెలిపారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న జిల్లా కేంద్రంలో ఫ్రీడంరన్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. కృష్ణవేణీ చౌక్‌ నుంచి ఇన్‌డోర్‌ స్టేడియం వరకు రన్‌ ఉంటుందని, ప్రజలందరు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. గ్రామాలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఫ్రీడంరన్‌ నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో పోలీస్‌ అధికారులు కూడా ఆయా కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. ఈ నెల 16న  ఉదయం 10.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించాలని చెప్పారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలలోపు పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలు ప్రధాన కూడళ్ల వద్దకు అధిక సంఖ్యలో చేరుకోవాలని సూచించారు. గీతాలాపన చేసే సమయంలో దేవాలయం, మజీద్‌, చర్చిలలో సైరన్‌ మోగిస్తారని, వెంటనే ఇళ్లలో ఉన్నవారితో సహా అందరూ రోడ్లమీదకు చేరుకోవాలని చెప్పారు. ఎక్కడివారు అక్కడే నిలబడి ఉండాలని, సైరన్‌ పూర్తయిన వెంటనే జాతీయ గీతం ప్రసారమవుతుం దని తెలిపారు. ప్రజలందరూ జాతీయ గీతాన్ని పాడి, దేశభక్తిని, జాతీయ భావాన్ని చాటుతూ మహనీయుల త్యాగాలను స్మరిస్తూ భారత కీర్తిని దశదిశలా చాటాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు నాయక్‌, గద్వాల, అలంపూర్‌, శాంతినగర్‌ సీఐలు చంద్రశేఖర్‌, సూర్యనాయక్‌, శివశంకర్‌, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, ఆర్‌ఐ నాగేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T05:24:19+05:30 IST