వృత్తి ధర్మాన్ని పాటిద్దాం!

ABN , First Publish Date - 2020-06-05T05:30:00+05:30 IST

ప్రాచీన వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఒక బోధ చేశాడు. ఎవరి పనులు వాళ్ళే చేయాలనీ, ఎవరి ధర్మం వారే నిర్వర్తించాలనీ భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చక్కగా వివరించాడు...

వృత్తి ధర్మాన్ని పాటిద్దాం!

ప్రాచీన వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఒక బోధ చేశాడు. ఎవరి పనులు వాళ్ళే చేయాలనీ, ఎవరి ధర్మం వారే నిర్వర్తించాలనీ భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చక్కగా వివరించాడు.


  • శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌
  • స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః


ఈ శ్లోకానికి విశేషమైన అర్థం ఉంది. ఈ రోజుల్లో కొంచెం వివాదాస్పాదమైన శ్లోకం కూడా ఇదే! పండితులైన వారు సరైన అర్థంతో, అన్వయంతో జనంలోకి తీసుకెళ్ళకపోతే విపరీతార్థాలకు దారితీసే ప్రమాదం ఉంది. 

‘శ్రేయాన్‌ స్వధర్మో విగుణః’... అంటే స్వధర్మం అనేది కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, అది కొంచెం చెడ్డదని అనిపిస్తున్నప్పటికీ అదే శ్రేయస్కరం. అదే చెయ్యాలి. ‘పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌’... పరధర్మం ఎంత గొప్పగా చేసినప్పటికీ స్వధర్మమంత గొప్పగా ఉండదు. ‘స్వధర్మే నిధనం శ్రేయః’... మన ధర్మానికి మనం కట్టుబడి ఉండడం, మన వృత్తికి మనం కట్టుబడి ఉండడం మంచిది. ‘పరధర్మో భయావహః’... ఒక వృత్తిలో ఉన్న వాడు మరో వృత్తిలోకి ప్రవేశిస్తే, ఒక ధర్మం చేయవలసిన వాడు, ఇతరుల ధర్మం స్వీకరిస్తే ఎప్పటికైనా అతనికీ, లోకానికీ భయావహం అవుతుంది. ఈ శ్లోకం స్పష్టంగానే ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ స్వధర్మంలోనే ఉంది అసలు విషయం. ఆధునిక సమాజంలో ఎవరికి ఏది స్వధర్మమో ఎలా చెబుతాం! పూర్వం ఆ విభజన స్పష్టంగా ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజన ఉండేది. దాని మంచి చెడ్డలు పక్కన పెడితే ఉన్న విషయం అది. బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మాన్ని చేయాలి. క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని చేయాలి. అలా ఎవరు వారి ధర్మాన్ని నిర్వర్తించాలి. అది చాలా స్పష్టంగా ఉండేది. అర్జునుడు క్షత్రియుడు. యుద్ధానికి ముందు అర్జునుడు బ్రాహ్మణుడిలా దయతో ఆలోచిస్తున్నాడు. క్షత్రియ ధర్మాన్ని పక్కన బెట్టి బ్రాహ్మణ ధర్మంలో ఆలోచిస్తున్నాడు. అందుకే శ్రీకృష్ణుడు ‘‘నువ్వు క్షత్రియుడివి. క్షత్రియ ధర్మంతో ఆలోచించు. నీ ధర్మాన్ని నెరవేర్చు’’ అని అర్జునుడికి బోధ చేశాడు. ఇంత మంచి శ్లోకాన్ని మనం ఈనాడు వదిలేద్దామా! ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏ కులం వాళ్లు ఆ పని చేయడం లేదు కాబట్టి కులం పేరు చెప్పుకునే యోగ్యత మనకు లేదు. ఈ పరిస్థితుల్లో కూడా శ్లోకాన్ని చక్కగా అన్వయించుకుంటే నవజీవనంవేదంలా మోగుతుంది. స్వధర్మం అంటే పుట్టుకతో వచ్చిన కులాన్ని బట్టి కాకుండా, ‘మనకు ఇష్టమై మనం చేపట్టిన వృత్తి’ అని అర్థం చేసుకోవాలి. ఒక వృత్తిలో చేరినప్పుడు ఆ వృత్తికి న్యాయం చేయాలా వద్దా? ఇవ్వాళ ఎంత మంది వృత్తికి న్యాయం చేస్తున్నారు? ప్రభుత్వోద్యోగులుగా ఉంటూ బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్న వారు కొందరు లేరా? అంటే పరధర్మం గురించి ఆలోచిస్తున్నట్టే కదా! పరమాత్మ సారాన్ని ఇలా గ్రహిద్దాం! ‘శ్రేయాన్‌ స్వధర్మో విగుణః’... నీవు చేపట్టిన వృత్తిలో ఆదాయం తక్కువ ఉండొచ్చు. ఇంకో వృత్తి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టవచ్చు. కానీ నీవు చేపట్టిన వృత్తికి న్యాయం చేయాలి. 

-గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-06-05T05:30:00+05:30 IST