అందరూ పాస్‌

ABN , First Publish Date - 2021-12-25T07:24:25+05:30 IST

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులందరినీ

అందరూ పాస్‌

  • ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫెయిలైన వారందరూ కనీస మార్కులతో ఉత్తీర్ణులైనట్టే
  • సర్కారు నిర్ణయంతో 2.35 లక్షల మందికి ప్రయోజనం
  • ఎక్కువ మార్కుల కోసం ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకోవచ్చు
  • ఇలాగే ఆందోళనలు చేస్తే పాస్‌ చేస్తారనుకోవద్దు
  • రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారు
  • అడిగితే ఆ ఫీజులు తిరిగి ఇచ్చేస్తాం: సబితా ఇంద్రారెడ్డి


హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస (35) మార్కులతో పాస్‌ చేయాలనే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. సర్కారు నిర్ణయంతో 2.35 లక్షల మంది విద్యార్థులకు మేలు కలగనుంది. ఇంత కంటే ఎక్కువ మార్కులు కావాలంటే.. వచ్చే వార్షిక పరీక్షల సమయంలో ఇంప్రూమెంట్‌ పరీక్షలు రాసుకోవచ్చు. గత ఏడాది రద్దయిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను ఇటీవల నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షల్లో సుమారు 49 శాతం మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులను పాస్‌ చేయాలని వివిధ విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి.


ఈ నేపథ్యంలో సర్కారు తీసుకున్న నిర్ణయం గురించి.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మొత్తం 2.35 లక్షల మంది ఫెయిల్‌ కాగా.. 10 మార్కులు కలిపితే పాసయ్యేవారు కేవలం 8,076 మంది ఉన్నారని.. 15 మార్కులను కలిపితే పాసయ్యేవారు 24 వేల మంది, 20 మార్కులను కలిపితే పాసయ్యేవారు 58 వేల మంది, 25 మార్కులను కలిపితే పాసయ్యేవారు 72 వేల మంది, 30 మార్కులు కలిపితే పాసయ్యేవారు 83 వేల మంది మాత్రమే ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వం 30 మార్కులు కలిపిన తర్వాత కూడా పాస్‌ కానివారు ఇంకా దాదాపు లక్షన్నర మంది ఉంటారని వెల్లడించారు. దీంతో, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. సెకండియర్‌ పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో.. ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. అందరినీ పాస్‌ చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.


అయితే.. ఇలాగే ఆందోళనలు చేేస్త సెకండియర్‌లో కూడా పాస్‌ చేస్తారని ఆశించొద్దని మంత్రి తేల్చిచెప్పారు. పిల్లలందరూ బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే పాసైనవారి మార్కుల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని వెల్లడించారు. రీ వెరిఫికేషన్‌కు 39,039, రీ కౌంటింగ్‌కు 2,400 దరఖాస్తులు వచ్చాయని.. తమపై నమ్మకమున్న వాళ్లు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ చేయించుకోవచ్చని, అవసరం లేదనుకున్న వారు కోరితే వారు చెల్లించిన ఫీజులను తిరిగి ఇచ్చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆప్షన్లు ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయన్నారు.


మొన్నటి ఫలితాల్లో 95 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సుమారు 10 వేల మంది ఉన్నారని చెప్పారు. ఫెయిల్‌ అయిన విద్యార్థుల విషయంలో ఇంటర్‌ బోర్డు, ప్రభుత్వం తప్పు లేదని మంత్రి స్పష్టం చేశారు. వారంతా.. 9, 10తరగతుల పరీక్షలు రాయకుండానే ప్రమోట్‌ అయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం మీద నిందవేయడం, ముఖ్యమంత్రి మీద, బోర్డు మీద వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇంటర్‌ విద్యార్థులు ఫెయిలవడంపై రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తూ, ప్రభుత్వానిదే తప్పన్నట్టు వ్యవహరించడం మంచిది కాదన్నారు. తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు విద్యార్థులను ఎడ్యుకేట్‌ చేసే విధంగా ప్రవర్తించాలన్నారు. ఇలాంటి విషయాల్లో రాజకీయ లబ్ధికి ప్రయత్నించకూడదని పేర్కొన్నారు. పార్టీలు ఈ అంశాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోణంలో చూడాలే తప్ప రాజకీయకోణంలో చూడరాదని సూచించారు.



ఆ వాదన తప్పు..

ఈ ఏడాది ఎక్కువ శాతం మంది ఫెయిల్‌ అయ్యారని.. అదీ ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులే ఫెయిలయ్యారని వస్తున్న వాదనలను మంత్రి తోసిపుచ్చారు. ఈ రెండు వాదనలూ పూర్తిగా అవాస్తవమన్నారు. ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటున్నదని గుర్తుచేశారు.  2014లో ఉత్తీర్ణత 59%, 2015లో 61%, 2016లో 62%, 2017లో 66%, 2018లో 67%, 2019లో 65%, 2020లో 68 శాతంగా ఉందన్నారు. ఈ ఏడాది ప్రైవేట్‌ కాలేజీల్లో  53 శాతమే పాస్‌ కాగా.. బీసీ గురుకులాల్లో 65%, ఎస్సీ గురుకులాల్లో 66ు, గిరిజన గురుకులాల్లో 52%, మైనారిటీ గురుకులాల్లో 48%, కేజీబీవీ మెడల్‌స్కూళ్లల్లో 43%, తెలంగాణ రెసిడెన్షియల్‌ గురుకులాల్లో 78%, నవోదయ కాలేజీల్లో 47 శాతం విద్యార్థులు పాస్‌ అయ్యారని మంత్రి వెల్లడించారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్న సబిత.. ఈ విషయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. జీవితంలో గెలుపోటములు సహజమని.. విద్యార్థులకు ఈ విషయం అర్థం కావడానికే స్కూళ్లల్లో క్రీడలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉండే విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మానసిక కౌన్సెలర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.


కాగా, ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేసినందుకు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి ఇతర సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ప్రభుత్వం ఈ ప్రకటన చేయడానికి ముందు.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విద్యార్థులందరినీ పాస్‌ చేసి, ఆత్మహత్యలు ఆపాలని విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2021-12-25T07:24:25+05:30 IST