న్యూఢిల్లీ: అభివృద్ధి విషయంలో బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను జనంలోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఓటు కీలకమని, ఓటింగ్ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని పార్టీ కార్యకర్తలతో ''నమో యాప్'' ద్వారా మంగళవారంనాడు సంభాషించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ పునరుద్ధరణ, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలు, హెల్త్ కేర్ డవలప్‌మెంట్ వంటి అంశాలను కార్యకర్తలతో జరిపిన ముఖాముఖీలో ప్రధాని ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
ఒక కార్తకర్త అడిగిన ప్రశ్నకు మోదీ స్పందిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు చేరేలా చూడాలని, రసాయనాలు లేని ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్రం చేపట్టిన పలు పథకాల వల్ల వారణాసి ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందుతున్నారని చెప్పారు. నమో యాప్‌లో 'కమల్ పుష్ప్' అనే ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన ఫీచర్ ఉందని, ఈ సమాచారం అందరితో పంచుకోవాలని సూచించారు. బీజేపీ మెక్రో-డినేషన్ క్యాంపయిన్ గురించి కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్టీ సభ్యులు, ఇతరుల నుంచి చిన్న చిన్న మొత్తాల్లో విరాళాలు సేకరించాలని ప్రధాని సూచించారు.