ప్రతీ ప్రయాణికుడు టీకా వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-09T04:35:55+05:30 IST

ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో శతశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ తెలిపారు.

ప్రతీ ప్రయాణికుడు టీకా వేయించుకోవాలి
సిద్దిపేటలోని బస్టాండ్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని ప్రారంభించి, పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌

 జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌

 సిద్దిపేట బస్టాండ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభం


సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 8: ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో శతశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ తెలిపారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ క్యాంపును ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. బస్సు ఎక్కే ప్రతీ ప్రయాణికుడు టీకా వేయించుకోవాలన్నారు. టీకా వేయించుకోని వారు ఉంటే ఒక్క నిమిషం ఆగి బస్టాండులో ఏర్పాటు చేసిన శిబిరంలో టీకా వేయించుకోవాలని సూచించారు. లేదంటే త్వరలోనే టీకా వేసుకోని వారు బస్సులో ప్రయాణించొద్దనే విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. టీకా తీసుకోకుండా బస్సుల్లో వెళ్లే ప్రయాణికులతో పక్కనున్న వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై బస్సు ఎక్కే ప్రతీ ప్రయాణికుడు టీకా వేసుకోవాలని చెప్పారు. ఆర్టీసీ ఆర్‌ఎం, డీఎం, వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రజలందరికీ టీకాలు వేయించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందక ముందే జిల్లాలోని అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఒమిక్రాన్‌ వైరస్‌ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. బస్టాండ్‌ ప్రధాన కూడలి, వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో అధికారులు ముమ్మరంగా తిరిగి వ్యాక్సిన్‌ వేయించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కే ప్రతీ ప్రయాణికుడి నుంచి టీకా వివరాలు అడిగి తెలుసుకుని, టీకా వేసుకోని వారికి బస్సుల్లోనే ఇప్పించాలన్నారు. 


పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్‌


ఈ నెల 10న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ పరిశీలించారు. పోలింగ్‌ విధులు నిర్వర్తించే అధికారులు, పోలింగ్‌ ఏజెంట్లు కూర్చునే వరుస క్రమం, కంపార్ట్‌మెంట్‌ లైటింగ్‌, తాగునీరు, ర్యాంపు తదితర అంశాలను పరిశీలించారు. ఆయనవెంట మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, ఎన్నికల అధికార సిబ్బంది ఉన్నారు.


 

Updated Date - 2021-12-09T04:35:55+05:30 IST